పొరుగూరు

జీవితం నమ్మశక్యం కానంత చిన్నదని మా తాతయ్య చెప్పేవాడు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు జీవితం కుదించుకుపోయి కనపడుతుంది. ఎంతలా అంటే, ఎవరైనా కుర్రాడు పొరుగూరు బయల్దేరితే, దారిలో అవ్వదగ్గ ప్రమాదాల సంగతి పక్కన పెడితే, ఆ ప్రయాణానికి అతను వాడదల్చుకున్న సమయం మిగతా సుఖజీవనంలోనుంచి తగ్గిపోతుందని అతనికి ఎందుకు తట్టలేదా అనిపించేంతలా.

Source: The Next village by Franz Kafka

వినోదానికి నాంది

సంగీతం ఎట్లా ఉంటుందో చూడొచ్చని తనని తానొక గాజు వయొలిన్ గా మార్చుకున్నాడతను. తన పడవని పర్వతశిఖరం దాకా లాక్కెళ్ళి సముద్రం పొంగి అక్కడికే వస్తుందని ఎదురు చూశాడు. రాత్రిపూట రైళ్ల రాకపోకల సమయాలు చూడ్డంలో మునిగిపోయాడు. చివరి స్టేషన్లు ఎందుకో అతనికి కన్నీళ్ళు తెప్పించేవి. అతనొక “బ” ని నాటి గులాబీలు పూయించాడు. బట్టతలకి విరుగుడుగా ఒక పద్యాన్ని రాశాడు. అదే వస్తువుమీద ఇంకోటి కూడా రాశాడు. ఆకులు రాలిపోవడాన్ని శాశ్వతంగా ఆపుదామని గడియారం స్థంభం మీదున్న గడియారాన్ని పగలగొట్టాడు. పూలకుండీలోనుంచి ఒక నగరాన్ని తవ్వి తియ్యాలనుకున్నాడు. భూగోళాన్ని ఇనపగొలుసుతో కాలికి కట్టుకుని రెండు రెళ్ళు రెండే అన్నట్టు అతను నెమ్మదిగా, సంతోషంగా, నవ్వుతూ నడిచాడు. అసలు అతనంటూ లేడనీ అందరూ అన్నప్పుడు బాధతో చనిపోలేదు. అందువల్ల అతనికి మళ్ళీ పుట్టక తప్పలేదు. ఈపాటికే ఎక్కడో పుట్టే ఉంటాడు, తన చిన్నకళ్లని మూస్తూ తెరుస్తూ అతను పెరుగుతాడు. సరైన సమయానికి అక్కరకొస్తాడు. అదిగో మన అందాలరాశి, చురుకైన పిల్ల, ముచ్చటగొలిపే ఆడయంత్రం. అమె సంతోషంకోసం, ఆమెని మురిపించి మెప్పించడం కోసం త్వరలోనే ఒక హాస్యగాడు కావాలి కదా!Source: Prologue To A Comedy by Wisława Szymborskahttps://sites.google.com/site/awalsiw/prologue-to-a-comedy# flashfiction

మెరుపు

ఒకరోజు జనంతో కిక్కిరిసిన నాలుగురోడ్ల కూడలిలో, వచ్చేవాళ్ళు వస్తూ పోయేవాళ్ళు పోతుండగా ఇది జరిగింది.
 
నేను ఉన్నట్టుండి ఆగిపోయి రెప్పలార్చాను. నాకేం అర్థం కాకుండా పోయింది, దేని గురించి నాకేం తెలీనట్టుగా అయింది. ఈ వస్తువులు, మనుషులు అసలు ఎందుకుండాలో అర్థమవల్లేదు. అంతా అసంబద్ధంగా, అర్థరహితంగా అనిపించి నవ్వాను.
ఆరోజుదాకా నేను గమనించనిదీ, అప్పుడే నాకు వింతగా అనిపించినదీ ఎంటంటే; ఆ క్షణందాకా నేను ట్రాఫిక్ లైట్లనీ, కార్లనీ, విగ్రహాల్నీ, యూనిఫాం లనీ ప్రపంచానికి ఏ సంబంధంలేని, ఏమాత్రం పనికిరాని చాలా విషయాల్ని ఏదో అత్యవసరాల్లాగా ఎలా ఆమోదించానా అని, వాటన్నిటిమధ్య ఏదో గట్టిసంబంధం ఉందని ఎందుకు నమ్మానా అని.
ఇలా అనిపించగానే నా నవ్వు ఆగిపోయింది. మొహం సిగ్గుతో ఎర్రబడింది. జనాల దృష్టి నావైపుకి తిప్పుకుందామని చేతులూపాను. వాళ్ళని ఒక్క క్షణం ఆగమన్నాను. “ఇక్కడేదో తప్పు జరిగింది, అసలిదంతా తప్పుడు వ్యవహారం లాగానే ఉంది! మనందరంఏవేవో తలాతోకాలేని పిచ్చిపనులు చేస్తున్నాం, అసలిది కాదు మనం చెయ్యాల్సింది. దీనికి అంతం లేదా?” అని పెద్దగా అరిచాను.
 
జనమంతా నాచుట్టూ చేరి కుతూహలంగా నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్నారు. నేను వాళ్ల మధ్యలో నుంచుని చేతులూపుతున్నాను. వాళ్లకి అంతా వివరంగా చెప్పాలని, ఉన్నట్టుండి నాలోపల మెరిసిన ఈ కొత్త తెలివిని వాళ్లకి పంచాలని అనిపించి కూడా మౌనంగా ఉండిపోయాను. ఎందుకంటే, నేను చేతులు పైకెత్తి నోరు తెరవగానే నాకు సాక్షాత్కరించిన అంతగొప్ప విషయమూ గొంతులో గుటక పడ్డట్టయింది. ఎలాగో గొంతు పెగుల్చుకుని పైకి అన్న నాలుగుమాటలూ పాతవే అనిపించాయి.
 
“ఐతే ఇప్పుడేమంటావ్? అంతా చక్కగా ఉండాల్సినట్టే ఉంది. ఏది జరిగినా దానికో కారణం ఉంది. అసలిక్కడ ఒకదానితో ఒకటి పొసగనిదంటూ ఏం లేదు. మాకు తెలిసి వీటిల్లో తప్పు కానీ, గందరగోళం కానీ ఏం లేదు.” అన్నారు వాళ్ళు.
 
నేను అయోమయంగా అక్కడే నిల్చున్నాను. ఇప్పుడు ట్రాఫిక్ లైట్లు, విగ్రహాలు, శిలాఫలకాలు, యూనిఫాం లు, రైలుపట్టాలు, బిచ్చగాళ్ళు, ఊరేగింపులు అన్నీ మాములుగా, అంతా సవ్యంగా ఉన్నట్టే అనిపిస్తుంది. ఐనా నాకేం శాంతి దొరక్కపోగా మనసంతా కలతగా అయిపోయింది.
 
“క్షమించండి, నేనే ఏదో పొరపాటు పడ్దట్టున్నాను. ఎందుకో అప్పుడలా అనిపించింది. ఇప్పుడంతా బాగానే కనిపిస్తుంది. తప్పైపోయింది.” అని చెప్పి వాళ్ల కోరచూపుల్ని తప్పించుకుంటూ ఆ గుంపునుంచి బయటపడ్డాను.
 
అదేంటో గానీ, ఇప్పటికీ నాకర్థం కానిదేదైనా కనపడ్ద ప్రతిసారీ (ఇది చాలా తరచుగా జరుగుతుంది). మళ్ళీ నాకా జ్ఞానోదయపు క్షణాలు తిరిగొస్తాయేమో అనే ఆశ పుడుతుంది. బహుశా, మళ్ళీ ఒకసారి నాకేదీ అర్థం కాకుండాపోయి, తెలియాల్సిన మరేదో పట్టుపడితే, ఒకే క్షణంలో నన్ను నేను పోగొట్టుకొని మళ్ళీ దొరకబుచ్చుకోవాలి.
 
Italo Calvino
“The Flash” from Numbers in the Dark
 

బస్సులు చచ్చిపోయిన రాత్రి

బస్సులు చచ్చిపోయిన రాత్రి నేను బస్ స్టాప్ లో ఒక బెంచిమీద కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నాను. నా బస్ పాస్ మీద పంచ్ లని చూస్తే ఏం గుర్తుకొస్తుందా ఆలోచిస్తున్నాను. ఆ పంచుల్లో ఒకటి చూడ్దానికి కుందేలులాగా ఉంది. అదంటే నాకు బాగా ఇష్టం. మిగతావాటివైపు ఎంతసేపు చూసినా ఒట్టి రంధ్రాల్లాగానే కనపడ్డాయి.
 
అక్కడొక ముసలాయన నిద్రకళ్లతో జోగుతూ కసితీరా బస్సువాళ్లని తిడుతున్నాడు. “గంటనుంచి ఎదురు చూస్తున్నాం, గంటేంటి, ఇంకా ఎక్కువేనేమో, ఈ బస్సుల వాళ్ళున్నారే, గవర్నమెంటు పన్ల కోసమైతే ఉన్నఫళాన ఊడిపడతారు. కానీ మనలాంటి వాళ్లం ఎదురుచూసేటప్పుడు మాత్రం చచ్చినా రారు. చెప్పేదొకటీ, చేసేదొకటీ దొంగనాయాళ్ళు.”
 
ముసలాయన తిట్ల దండకం పూర్తిచేసి టోపీ సర్దుకుని నిద్రలోకి జారుకున్నాడు. మూతలుపడ్ద అతని కళ్లవైపు చూసి నవ్వుకుని, నేను మళ్ళీ రంధ్రాలవైపు అదేపనిగా చూస్తూ, అక్కడ ఏదైనా మారకపోతుందా అని సహనంగా ఎదురు చూస్తున్నాను. ఒక కుర్రాడెవరో చెమటలు కక్కుతూ మమ్మల్ని దాటుకుని దూసుకెళ్ళాడు. అతను ఆగకుండానే వెనక్కి తిరిగి, ఎండిపోయిన గొంతుకతో, ఊపిరాడని స్వరంతో ఇలా అన్నాడు “మీరు అనవసరంగా ఎదురు చూస్తున్నారు. బస్సులన్నీ చచ్చిపోయాయి.” అతను కొంతదూరం పరిగెత్తి ఎడమచేత్తో డొక్క పట్టుకుని వెనక్కితిరిగి ఏదో ముఖ్యమైంది చెప్పటం మర్చిపోయినట్టు మావైపు చూశాడు. అతని బుగ్గలమీద కన్నీళ్ళు చెమట పూసల్లాగా తళుక్కున మెరిశాయి. “అన్ని బస్సులూ చచ్చిపోయాయి.” అని ఉన్మాదంగా అరిచి అటు తిరిగి పరిగెత్తాడు. ముసలాయన ఉలిక్కిపడి లేచి “ఎంటా పిచ్చోడి గోల?” అన్నాడు. నేను “ఏం లేదు పెద్దాయనా” అని గొణిగాను. నేలమీదనుంచి నా చేతిసంచిని తీసుకుని వీధి చివరికి నడక మొదలెట్టాను. “ఇదిగో, అబ్బాయ్, నువ్వెక్కడికి?” ముసలాయన నా వెనకే అరుస్తున్నాడు.
 
పాత చాక్లెట్ ఫాక్టరీ దగ్గర ఒక జంట వేళ్లతో ఆడే ఆటొకటి ఆడుతూ ఎదురు చూస్తున్నారు. అదెట్లా ఆడాలో నాకెప్పుడు అర్థం కాదు.”ఇదిగో నిన్నే” అని అతను నన్ను పిలిచాడు. ఆమె చేతి బొటనవేలు అతని అరచేతికి ఆనించి ఉంది, “బస్సుల సంగతి ఏమైనా తెలిసిందా?” నేను భుజాలెగరేశాను.”ఏదో స్ట్రైక్ జరుగుతున్నట్టుంది, బాగా లేటైంది కదా, పొనీ నువ్వు మా ఇంట్లో ఉండిపో ” అని అతనామెతో చెప్పడం వినబడింది. నా సంచికున్న పట్టీ భుజంమీద ఒరుసుకుపోతుంటే సరిచేసుకున్నాను. రోడ్డు పక్కన బస్టాపులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అందరూ బస్సులమీద ఆశలొదిలేసుకుని ఇళ్ళకి వెళ్ళినట్టున్నారు. బస్సులు రానందుకు వాళ్ళకేం బాధ లేదల్లే ఉంది. నేను దక్షిణం వైపుగా నడుస్తున్నాను.
 
లింకన్ వీధిలో నాకు రూపురేఖల్లేకుండా వెలికిల్లా పడున్న మొదటి శవం కనపడింది. పగిలిన కిటికీ అద్దం కనపడకుండా దానిమీద నల్లటి మడ్డినూనె పూసేసుంది. నేను మోకాళ్లమీద వంగి ఆ మరకలన్నిటిని నా చొక్కాచేత్తో తుడిచేశాను. నేనెప్పుడూ ఎక్కని నలభై రెండో నంబర్ బస్, అది పెటాటిక్వా నుండో ఏమో వస్తుంది. లింకన్ వీధిలో తగలబడి వెలికిల్లా పడున్న ఈ బస్ ని చూస్తే నాకెంత విషాదంగా అనిపించిందో చెప్పలేను.
 
పెద్దబస్టాండ్ కెళ్ళి చూస్తే, చీలిన కడుపు ల్లోంచి బయటికొచ్చిన పేగులు, కాలవలు కట్టిన ఇంధనం, నిశ్శబ్ధమైన నల్లటి రోడ్డుమీద చెదిరిపడ్ద శరీర భాగాలతో, వందలాది బస్సులు ఇదే పరిస్థితిలో చిందరవందరగా పడున్నాయి. కళతప్పిన మొహాలతో, ఏదైనా మోటర్ శబ్ధం వినపపడకపోతుందా అనే ఆశతో డజన్ల కొద్దీ మనుషులు అక్కడే కూర్చుని ఉన్నారు. తిరిగేచక్రం కోసం నీళ్ళునిండిన వాళ్ళ కళ్ళు దారంతా తరచి చూస్తున్నాయి. బస్ ఇన్స్పెక్టర్ టోపీ పెట్టుకున్న ఒక మనిషి వాళ్ల మధ్యలోకొచ్చి వాళ్లకేదో ఆశ పుట్టించడానికన్నట్టు “ఇక్కడొక్కచోటే ఇలాగయ్యింది. హైఫా లో బోలెడు బస్సులు తిరుగుతున్నాయి. అవి ఏ నిముషమైనా ఇటేపు రావచ్చు.” అని చెప్పాడు. కానీ ఒక్క బస్సుకూడా బతికి బయట పళ్ళేదని వాళ్లందరితో పాటు అతనికీ తెలుసు.
 
పాలకోవా అమ్మే అతను తన బండికి నిప్పంటించి ఇంటికెళ్ళిపోయాడని కొందరన్నారు. కాసెట్ల షాపులో కాసెట్లన్నీ ఆవేశంతో విరిగిపోయాయనీ, బస్టాపుల్లో ఎర్రబడ్ద కళ్లతో ఎదురు చూసిన సిపాయిలందరూ నవ్వులేని మొహాలతో ఇంటికి తిరిగెళ్ళారని, అసలు నిజానికి వాళ్ళు తీరని దుఃఖంలో మునిగి ఉన్నారనీ కూడా జనం చెప్పుకున్నారు. నాకు బస్స్టాప్ లో ఎవరూ పట్టించుకోని ఒక బెంచీ దొరికింది. దానిమీద నడుంవాల్చి కళ్ళు మూసుకున్నాను. జేబులోని బస్ పాస్ మీద కన్నాలు మాములు వాటిలాగే అనిపించాయి.
 
Based on “The night the busses died” by Edgar Keret

దారినపోయే దానయ్యలు

రాత్రిపూట నువ్వు వీధిలో నడుస్తుంటావు. కొండెక్కే మెరకవీధిలో పున్నమి వెన్నెల్లో చాలా దూరంనుంచి ఒక మనిషిని చూస్తావు. అతను నీవైవే పరిగెత్తుకొస్తాడు, నువ్వేం అతన్ని పట్టుకుని ఆపవు. ఒకవేళ అతను రివటలాంటి ముసలాడైనా, గావుకేకలేస్తూ అతన్నెవరైనా తరుముకొస్తున్నాసరే నువ్వతన్ని ఆపవు.
ఎందుకాపవంటే, అసలే అపరాత్రి, పైగా వెన్నెల్లో నీకంటే ముందే ఈ వీధి కొండపైకి ఎక్కేస్తే, నీ గతి ఏం కాను?అసలు వాళ్ళిద్దరూ సరదాగా ఒకళ్లనొకళ్ళు తరుముతూ ఆడుకుంటున్నారేమో. బహుశా మొదటివాడు అమాయకుడు, రెండోవాడు హంతకుడు అయుండచ్చు, అదే నిజమైతే, నువ్వు ఇతన్ని ఆపటం ఒక హత్యకి సాయం చేసినట్టే. ఏమో, వాళ్ళిద్దరూ ముక్కూమొహం తెలీని అపరిచితులు కూడా కావచ్చుగా, త్వరత్వరగా ఎవరిళ్లకెళ్ళి వాళ్ళు నిద్రపోదామని పరిగెడుతుండొచ్చు, వాళ్ళు గుడ్లగూబలైనా ఆశ్చర్యం లేదు, ఆ మొదటి మనిషి దగ్గర తుపాకీ ఉందేమో ఎవరు చూడొచ్చారు?
ఇదంతా కాదుకానీ, నువ్వీపూట తెగ అలసిపోయావు, పైగా పీకల్దాకా తాగేసి ఉన్నావు కూడా. హమ్మయ్య, ఆ రెండోవాడు కూడా కనుచూపుమేరలో లేకుండా వెళ్ళిపోయాడని నువ్వు ఊపిరి పీల్చుకుంటావు.
Source: “passers-by” by Franz Kafka

ఒంటిగాడి తంటాలు

పెళ్ళికాకుండా ఉండిపోవడమంత పాపిష్టి బతుకు ఇంకోటిలేదు. సాయంత్రంపూట ఊరికే కబుర్లాడాలనిపిస్తే, రమ్మనే పిలుపుకోసం ఎవర్నైనా బింకంగా దేబిరించాలి. ఇక జబ్బుపడితే ఒక మూలన మంచంలో పడుండి వారాలతరబడి ఖాళీగదిని కలయజూడాలి. “ఇక పడుకుంటా” అనేమాట వాకిట్లోనే చెప్పి లోపలికి రావాలి. భార్యతో కలిసి చకచకా మెట్లెక్కి పైకి వెళ్లడానికి ఎలానూ వీల్లేదు. గదిలో పక్కవైపు తలుపులు వేరేవాళ్ల వాటాల్లో ముందుగదిలోకే ఉండక తప్పదు. ప్రతిరాత్రి బయటనుంచి భోజనం చేతపట్టుకుని గదికి రావాలి. పొరుగు వాళ్ళ పిల్లల్ని ముద్దు చెయ్యాలి, కనీసం సొంతపిల్లల్లేరనే మాట బయటికనకూడదు. వయసులో ఉన్నప్పుడు చూడగా గుర్తుండిపోయిన ఒకరిద్దరు బ్రహ్మచారుల్లాగా కనపడ్డానికి, వాళ్ళలాగా నడుచుకోడానికి నానా తంటాలూ పడాలి.
అదీ సంగతి, ఐతే నిజానికి ఇవన్నీ లేకపోయినా సర్వకాలాల్లోనూ ఒక నిండైన ఒళ్ళు, దానిపైన ఒక నిజమైన నుదురు ఉంటాయిగా, ఇలా చెయ్యి పైకెత్తి చక్కగా తలబాదుకోవచ్చు.
Bachelor’s Ill Luck
by Franz Kafka

చెట్లు

మనందరం మంచులో నిలబడ్డ మానుల్లాంటివాళ్ళం. అవి చూడ్డానికి బహునాజూగ్గా, ఒక్క తోపుతోస్తే దొర్లిపోయేలాగా కనబడతాయి. కానీ, వాటి మొదళ్ళు గట్టిగా నేలలోకి దిగిపోతాయి కాబట్టి, నెడితే పడవని మనకి తెలుసు. ఐనా ఆ పాతుకుపోవడం కూడా ఊరికే కనబడ్డం వరకే.

The Treesby Franz Kafkahttp://franzkafkastories.com/shortStories.php…

ఏవో మాటలు కొన్ని

నవ్వే బొమ్మ

ఉన్నంతసేపు దిగులుగా ఉంటావు. నవ్వితే మాత్రం పిచ్చిదాన్లా నవ్వుతావేమ్మా, అన్నాడు నాన్న. రాత్రి దాదాపు స్పృహపోతూ తలపక్కకి వాలుస్తుంటే ఏవో ఇంజెక్షన్లు పొడిచేరు నాలుగు చోట్ల. ఇవ్వాళ తల ఎంత తేలిగ్గా ఉందో, ఏ పిచ్చి ఆలోచనలు లేకుండా. ఆ ఇంజెక్షన్లేవో రోజూ చేస్తే బాగుండు. రోజూ ఇంజెక్షన్లు కావాలనుకోవడం కంటే పిచ్చి ఆలోచన ఏముంది, అన్నాడు కొడుకు. నాకెందుకో ఇంటికన్నా ఇక్కడే హాయిగా ఉంది. ఇంకో రెండ్రోజులు ఉండనియ్యండని అడిగితే నర్స్ రీడింగ్స్ రాసుకుని ఏం మాట్లాడకుండా టీవీ ఆన్ చేసి వెళ్ళిపోయింది.

నిజం

అబద్ధం ఏం లేదు. ఇష్టం ఇష్టమే.

“ఒకసారి మాట్లాడాలనుంది. మరీ ప్రాణావసరమైతే తప్ప ఊరికూరికే అడగను.”

ఒకటే బ్లూ టిక్ కనపడుతుంది. మెసేజ్ కావాలనే చూడబడదు. ఎవరి ఇరుకిరుకు జీవితాలు వాళ్ళవి.

పట్టనట్లుండటం ఎలాగో అందరికీ పట్టుపడదు.

రావాల్సిన టైమ్‌కి ఫోన్ రాకపోవడం ఇది లెక్కలేనన్నోసారి. నీకు నిజంగా మాట్లాడాలని లేదా? అనే ప్రశ్న నోటి దాక వచ్చి ఆగిపోతుంది ఎప్పుడూ. అసలంటూ ఎప్పుడో ఒకసారి ఫోన్ వస్తుంది కదా, వాళ్ళకి వేరే ఏం తోచనప్పుడైనా, ఆ మాత్రమైనా పాడు చేసుకోవడమెందుకు అనీ…

మెరుపు

పాడుబడ్ద గుడి బయట చింకిగోతాం పరుచుకుని దేశదిమ్మరి ఒకడు కాసేపు నడుంవాల్చి ఆనక గోతాం దులుపుకొని వెళ్ళిపోయాడు.

గుళ్ళో పగుళ్ళుబారిన రాతిబొమ్మ గొంతుపెగుల్చుకు అరుస్తుంది- “దొరా! ఒక్కమారు వెనక్కొచ్చి మసితుడిచి దీపం ముట్టించిపో.”

ఆపాటికే వాడు పొలిమేర దాటిపోయాడు, శృతిలేని వాడి గాలిపాటతో పాటు.

కుక్కపిల్లల ఆట

“ఈ ఒక్క కథా రాసేసి ఇక మానేస్తాను.”

కొలనులోకి విసిరిన రాళ్ళు కొంగల చుట్టూ వృత్తాలు గీస్తుంటే ముంజేత్తో చెమట తుడుచుకుంటూ వాడన్నాడు. నా చేతిలోవి సగం గులకరాళ్ళు వాడి దోసిట్లోకి వదిలాను. కథ దేనిగురించని రెట్టించి అడిగాను. ఊరుకున్నాడు. ఊరికే ఏమనకుండా ఉన్నాడు కాసేపు. ఎగుడు దిగుడు కొండరాళ్లలో నడుస్తూ అలుపొచ్చి ఆగినప్పుడు జేబులోనుంచి కాగితం బయటికి తీశాడు. చిన్నగా దగ్గి పైకి చదివాడు.

“ఏం జరిగిందో చెప్పుకోడానికి ఏ మనిషినీ నిర్లక్ష్యంగా నమ్మలేని వెలితిలోనుంచి ఈమాటలు రాస్తున్నా.”

మొదటి లైన్ బాగుందా అనడిగాడు.

ఆయాసపడుతున్నావు, కాసిని మంచినీళ్ళు తాగమని ఇచ్చాను.

 

(published in eemata June 2020)

పార్కులో

నాకు బ్లూ బెలూన్ కావాలి, బ్లూ బెలూన్. కా..వా..లీ…
చిట్టితల్లీ, ఇదిగో బెలూన్, తీసుకో. ఇది మాములు బెలూన్ కాదు, ఎంత తేలిగ్గా గాల్లో పైపైకి ఎగిరిపోతుందో చూడు.
ఐతే దీన్ని గాల్లోకి వదిలేస్తాను. వదిలెయ్యనా?
నీకవసర్లేకపోతే అదిగో, ఆ పేదపిల్లకి ఇవ్వొచ్చుగా, చక్కగా ఆడుకుంటుంది.
ఇవ్వను, గాల్లోకి వదిలేస్తానంతే.
పాప బ్లూ బెలూన్ని గాల్లోకి వదిలి, దాని రంగు ఆకాశపు నీలంలో కలిసిపోయేవరకూ చూస్తూనే ఉంది.
చూడు, దాన్నట్లా గాల్లోకి వదిలే బదులు ఆ పిల్లకి ఇస్తే బాగుండేది కదా?
అవును, పాపం. తనకి ఇవ్వాల్సింది.
ఐతే ఇదిగో, ఇంకోటి కొంటున్నా, వెళ్ళి ఆ అమ్మాయికిచ్చేసి రా.
ఊహూ, దీన్ని కూడా గాల్లోకి వదిలేస్తా.
పాప మళ్ళీ బెలూన్ని వదిలేసింది.
సరే, ఇదిగో మూడోది.
ఎవరూ చెప్పకూండానే పాప బెలూన్ని తీసికెళ్ళి పేదపిల్లకిచ్చి “దీన్ని గాల్లోకొదిలెయ్, భలే సరదాగా ఉంటుంది.” అంది.
ఊహూ, నేనొదల్ను, దగ్గరే ఉంచుకుంటా- ఆ అమ్మాయి సంతోషంతో గంతులేస్తుంది.
గదిలోపల బెలూన్ పైకప్పు దగ్గర తారాడుతూ ఉంది. అక్కడే మూడురోజులుండి, రంగుమారి, ముడుచుకుపోయి, గాలిపోయి కింద పడిపోయింది.
అయ్యో, నేను దీన్ని ఆరోజే గాల్లోకి వదిలెయ్యాల్సింది. పైకిపోయేటప్పుడు దానికేసి చూస్తూ ఉంటే ఎంత బాగుండేది! అనుకుంది పేదపిల్ల.
ఈలోపల చిట్టికి వాళ్ల మామయ్య చాలా బెలూన్లు కొనిపెట్టాడు. ఒకరోజు పది, ఇంకోరోజు ముప్ఫై, ఇలాగ.
పాప వాటన్నిటినీ గాల్లోకి వదిలేసింది. ఒక పది మాత్రం పేదపిల్లలకి పంచింది.
ఇక చిట్టికి బెలూన్ల మీద మోజు తీరిపోయింది. చిన్నపిల్లలాగా బెలూన్లేంటి అనుకుంది.
పాపకి భలే పెద్దరికం వచ్చిందే అనుకుంది వాళ్ళ అత్తయ్య.
పేదపిల్ల రోజూ కలవరిస్తూనే ఉంది- నేను బెలూన్ని గాల్లోకి వదిలెయ్యాల్సింది, అది పైకెళ్ళేటప్పుడు చూడాల్సింది, పైకెళ్ళెటప్పుడు చూస్తే ఎంత బాగుండేదో!
—-
Based on “In the Amusement Park” by Peter Altenberg