ముగింపు- మొదలు

ప్రతీ యుద్ధానంతరం

ఎవరో ఒకరు మరకలు తుడవాలి.

అన్నీ వాటంతట అవే సర్దుకోవుగా మరి.

విధ్వంస శకలాల్ని

ఎవరో ఒకరు రోడ్డుపక్కకి లాగి పడెయ్యాలి.

మృతదేహాల్ని మోసుకెళ్ళే బళ్ళు

అడ్డు లేకుండా సాగిపోవాలిగా మరి.

దుమ్ముధూళిలో, బూడిదగుట్టల్లో

గాజుపెంకుల్లో, విరిగిన కుర్చీల శీలల్లో

రక్తసిక్తమైన పాతబట్టల్లో,

ఎవరోఒకరు నిండుగా

మునిగిపోవాలి.

 తప్పనిసరిగా ఎవరో ఒకరు

ఇనప బద్దీలని ఈడ్చుకొచ్చి,

గోడల్ని నిలబెట్టాలి.

మరెవరో కిటికీ అద్దాల్ని తుడిచి మెరిపించాలి.

తలుపుల్ని మునుపట్లాగే తిరిగి అమర్చాలి.

ఇప్పుడు ఫోటోలు తీస్తే,

ఈ చోటేం అందంగా కనపడదు.

ఇంకొన్నేళ్ళు ఆగాలి.

కెమెరాలన్నీ

మరో యుద్ధానికి తరలిపోయాయి మరి.

మళ్ళీ మనకి కొత్త రైల్వే స్టేషన్లు కావాలి,

కొత్త వంతెనలు కావాలి.

పదేపదే పైకి మడిచి

చొక్కాచేతులు మురికిపట్టాలి.

చేతిలో చీపురు పట్టుకుని ఎవరో

పాతసంగుతులు తలచుకుంటారు.

శ్రద్ధగా విని,

మెడమీద మిగిలిన తలని

అంగీకారంగా పంకిస్తారెవరో.

చెత్తని ఎత్తిపోసేవాళ్ళు మాత్రం,

ఆపాటికే నిర్లిప్తంగా ఐపోతారెందుకో.

పొదల వెనకాల నుండి

ఒక్కోసారి ఎవరెవరో

తుప్పు పట్టిన వాగ్వివాదాల్ని,

నేల పొరల్నుండి తవ్వితీసి

చెత్తకుప్ప వైపుకి మోసుకెళ్తారు.

అక్కడ జరిగినదాని గురించి

వివరంగా తెలిసినవాళ్ళు,

అప్పుడే తెలుసుకునేవాళ్ళకి

కొద్ది కొద్దిగా తెలిసినవాళ్లకి

అసలేం తెలీనివాళ్ళకి,

అడ్డు తొలిగి దారినివ్వాలి.

కార్యకారణాల్లాగా

దుబ్బుగా పెరిగిన గడ్డిమీద,

కాళ్ళుచేతులూ ఆరజాపుకుని

వెలికిల్లా పడుకుని ఉంటారు ఎవరో;

నోట్లో ఒక గడ్డిపరకతో

మబ్బులవైపు తదేకంగా చూస్తూ.

 

—Wislawa Szymborska

(translated from the Polish by Joanna Trzeciak)

ముద్దులు, పాత పుస్తకాలు, మనిద్దరం

1

మన నగ్నదేహాలు నెమ్మదించాక
నేనన్నాను,
“నీ ఒంటిమీదగా
పాతరాతియుగంలోకి
వెళ్ళొచ్చాను.
అక్కడ ఆదిమానవుడొకడు
రెండు రాళ్లతో ఆటలాడి
నిప్పు రాజేస్తున్నాడు.”

2

మోహం తిరగబెట్టే ముందు
మనమొక పాత పుస్తకాల కొట్టుకి వెళ్లాం.
“ఈ చోటు నీ నోటి వాసనేస్తుంది”
అనొక కుంటిసాకు చెప్పి
ముంచేసేలా ముద్దులాడావు.

3

ముద్దు మధ్యలో
నా శ్వాస వాసనేస్తుందన్నావు,
పాత పుస్తకాల వాసన.
ఆపై నువ్వే
ఊపిరి తిప్పుకుని చెప్పావు,
“వేస్తే వెయ్యనీ,
శిథిల నగరంలాగా ఉండే
నీ మొహమన్నా, నీ గడ్డమన్నా పిచ్చి ఇష్టం.”

సముద్రగర్భంలో మునిగిపోయిన నగరాల్ని తలపోస్తూ
ఒక పాడుబడ్డ ఊళ్ళో, ఆకాలపు వరదల్లో కలిసిపోవడాన్ని ఊహిస్తూ
నేను నిట్టూర్చాను.

9/9/19

నాన్నకి నివాళి

ఎందుకని ప్రయాణాలు చేశావు?
ఎందుకంటే ఇంట్లో బాగా చలేసింది.
నువ్వెందుకు ప్రయాణాలు చేశావు?
ఉదయం నుంచి సాయంకాలం వరకు
నా పని అదే కదా.
అలా తిరిగినప్పుడు ఏం బట్టలేసుకున్నావ్?
పైన నీలం చలికోటు, తెల్ల చొక్కా, కొత్త టై, పొడుగాటి సాక్సులు
వేసుకున్నాను.
మరి నువ్వేం వేసుకున్నావ్?
పెద్దగా ఏం లేదు,
పల్చటి దిగులు తువ్వాలు వెచ్చగా మెడకు చుట్టుకున్నాను.
రాత్రుళ్ళు ఎవరితో కలిసి పడుకున్నావ్?
రోజూ కొత్త కొత్త ఆడవాళ్ళతో పడుకున్నాను.
మరి నీతో ఎవరైనా ఉండేవాళ్ళా రాత్రుళ్ళు?
ఒక్కణ్ణే పడుకునేవాణ్ణి, రోజూ, ఎప్పుడూ ఒక్కణ్ణే.
నాతో అబద్ధాలెందుకు చెప్పావ్?
అవన్నీ నిజాలనుకునే చెప్పాను.
నువ్వు చెప్పిన అబద్ధాల సంగతేంటి?
నాకు నిజాలిష్టం;
నిజంకంటే పెద్ద అబద్ధం ఉండదు కాబట్టి, చెప్పే ఉంటాను.
ఎందుకెళ్లిపోతున్నావ్?
ఇక్కడ ఏదీ నాది కాదనిపిస్తుంది.
నువ్వెందుకు వెళ్లిపోతున్నావ్?
తెలీదు. ఎప్పుడూ తెలీలేదు, ఎప్పటికీ తెలీదు.
నీకోసం ఎంతసేపు ఎదురు చూడమంటావ్?
నాకోసం ఎదురు చూడొద్దు, అలసటగా ఉంది, పడుకుంటాను.
అలసటగా ఉందా, పడుకుంటావా?
అవును, బాగా అలసిపోయాను, ఇక పడుకుంటాను.

– From ‘Elegy for my father’ by Mark Strand

10/9/19

ఇష్టమే మొదటి పదం

మిగతా వాక్యనిర్మాణాలు
ఎవరు చూడొచ్చారు.
ఇష్టమే మొదటి పదం; వసంతం ఇంకా
చుట్టుముట్టి ఉండగానే –
నిన్ను పూర్తిగా ముద్దాడటానికి,
నాకేం మొత్తంగా మతిపోలేదు.

అదృష్టవంతుడినైతే
జ్ఞానం కాదు, ముద్దులు రాసిపెట్టుంటాయ్,
ఇదిగో, నా రక్తకణాలన్నీ అవునంటున్నాయ్.

అమ్మాయీ,
పూలన్నింటి మీదా ఒట్టు –
ఏడవద్దు.
నా మహత్తరమైన ఆలోచనకూడా
నీ కనురెప్పల చప్పుడుకి సాటిరాదు.

ఒకరికొకరం కదా మనం; నా చేతుల్లో
వాలి కాస్త నవ్వు చూద్దాం.
అందుకే మరి,
జీవితమంటే వాక్య సముదాయం కాదనేది.

చావుతో అచ్చుతప్పులు సరిచెయ్యలేం అనేదీ.

(Source: “Since feeling is first” by ee Cummings)

22/9/2019

కాలానికి అందని కల ఒకటి

 

వరికోతల రోజుల్లో దిక్కులన్నీ

మా చుట్టూరా మూగి చోద్యం చూశాయి.

ఎందుకనో, మమ్మల్ని చూసిపోడానికి

సూర్యచంద్రులు ఒక్కసారైనా రాలేదు.

అలా పొద్దు నడినెత్తికెక్కినా

ఒళ్లెరక్కుండా మేం నిద్రపోతూనే ఉన్నాం.

పైకి వినపడేలా అతన్ని నిద్రలేపుతూ,

లోగొంతుకలో మాత్రం

“పోన్లే, ఇంకాసేపు బజ్జో” అని బుజ్జగించాను.

నిరుడు ఇదే రోజుల్లో

ఆఖరికోత గడ్డితో కప్పిన పూరింటికి

అతన్ని చూడ్డానికొచ్చాను.

కంకులతో వంగిపోయిన వరిచేల మీదగా తిరిగొచ్చి అతనన్నాడు,

“మన వియోగ దుఃఖమే పొలాలమీద మంచుగా కప్పేసింది”

చిన్న పడవొకటి అద్దెకి తీసుకుని అతన్ని రమ్మని పిలిచాను

“పడవలో తేలేటప్పుడు నీ మొహం మిలమిల్లాడుతుంది తెలుసా”

అని చెయ్యి పట్టుకుని లాగాను కూడా.

పొద్దుగుంకిపోయాక,

మాకోసం వెనకడుగులు వేసుకుంటూ

రహస్యంగా తిరిగొచ్చింది సాయంత్రం.

బుద్ధి పుడితే కొలను ఒడ్డుకి పోతాం

ఒక్కోసారి దాని నీడని చూస్తూ ముద్దాడుకుంటాం.

కొలనో, దాని నీడో,

రెండిట్లో ఎల్లకాలమూ ఉండిపోయేదేదో తెలుసుకుని

దాని పక్కనే ఇల్లు కట్టుకుంటాం.

(inspired by “Time Problem” by Brenda Hillman)

published in Navatelangana May 2019

నువ్వు రాకముందు

లోకమంతా ఎక్కడ వేసిందక్కడే

ఏ మార్పూ లేకుండా ఉండేది

అప్పట్లో ఆకాశం ఒట్టి దిగంత సూచిక

రహదార్లు కేవలం మట్టిదారులు

గుమ్మాలు చెక్కముక్కల ద్వారబంధాలు

ఈ ఖాళీ గాజుభరిణె అడుగంటిన నా హృదయపాత్ర

 

ఇప్పుడలా కాదు;

అరుణవర్ణపు నింగి, కనుచూపు మేరా గోధూళి రహదారి, ఈ గాజుగిన్నె

అన్నీ,

నూరువరహాల పూవ్వులై

ఏళ్ళ ఎడబాటు తర్వాత కలిసిన మొదటి చూపులై

నువ్వులేని సాయంకాలాలు వదిలిన ధూసర ఛాయలై,

పసుపు వర్ణపు  పొడిపొడి చప్పుళ్ల శిశిరరాశులై,

నా రక్తరేఖల అంచున నిలబడి

ఒక్కోచుక్కలోంచి వేల రంగుల్ని పులుముకున్నాయి

 

నువ్వు రాకమునుపు;

ఎరుపెరుపు కోరికతో దహించుకుపోయేవి పూలతోటలు

ఏడ్చేడ్చి తడిచిపోయిన చీరచెంగులా వానమబ్బులు

నొప్పెట్టి సలిపే నరంలాగా ఎదురుచూసేవి కాలిబాటలు

పల్లేరుకాయలు, విషపు బొట్లు, నక్షత్రధూళీ

పారదర్శక పాత్రలో కదిలిపోయేవి ఎవరెవరివో నీడలు

 

ఆకుల చివర్లమీద అడుగులేసి అంతదూరం నుంచి వచ్చావు

ఆఖరి ఋతువుదాకా ఆగిపోతావా?

అప్పుడీ ఆకాశం  తిరిగి అకాశమౌతుంది

రహదారులు  ఆర్తగీతాలౌతాయి

ఈ మోహపాత్ర మధువుతో పొర్లిపోతుంది

మరోసారి ప్రపంచం ప్రాణం పోసుకుంటుంది

ఆంధ్రజ్యోతి 11/02/2019

Image may contain: text

శీతాకాలపు రాత్రి

1

నిశ్శబ్ధ సంభాషణలో నిమగ్నమై
ఒంటరి చలివీధిలోకి
మనం మలుపు తిరిగేటప్పుడు
ఒక్కో వలువనీ ఓడుపుగా జారుస్తూ
వగలాడి ఊరు

2

పదాలుగా మారేలోపే
తడబడుతున్నాయి మనసులు
అసలు మనం మాట్లాడుకున్నామా?

3

ఇంతసేపూ మౌనం
ఈలోగా ఒక చిన్నమాట
విషాదం ఏంటంటే
రెండూ అసందర్భమే

4

కళతప్పిన కొమ్మలమీద
గూళ్ళు కడుతూ దిగులుపిట్టలు;
పాలిపోయిన ఆకాశం కింద తొణకని సముద్రంలా
పెగలని గొంతుకల్తో నువ్వూ నేనూ-
ఎందాకా నడుద్దాం?

5

పలుకై పుట్టాలని
ఆజన్మాంతం పలవరిస్తూ
అరకొరగా దాచుకున్న ఆ కాసిన్ని మాటలే!

**

My translation of Rohith’s “poems on a wintry night”

చావు తర్వాత

మొట్టమొదట,

“ఉన్నవాడు” కాస్తా “ఉండేవాడు” ఐపోతాడు

గాలిరంగులా, రంగులేని గాలిలా

అతని పేరు ఒట్టి పదంగా, కేవలం ఒక గుర్తులా

ఒక భావనగా తేలిపోతుంది

 

అతని పేరు ఒట్టి శబ్ధంగా, ఒక జ్ఞాపకంగా
రంగూ రూపూ లేని గాలిఅలలా తేలిపోతుంది

ఇంటిల్లిపాదీ తీయించుకున్న ఆనాటి ఫోటోల్లో

అతనున్నంత మేరా

కాలప్రవాహంలో కొట్టుకుపోయిన

ఒకశకానికి ఆనవాళ్ళుగా మిగిలిపోతుంది

 

అతని జీవిత విశేషాలాన్నీ

ఖచ్చితమైన వివరాల్తో, శిలాక్షరాలుగా మారిపోతాయి

అతని అవ్యక్త అనుభూతులన్నీ

ఉన్నట్టుండి భాషలోకి ఒదిగిపోతాయి

పలువిధాలా పరుచుకున్న అతని వైఖరి

ఒక ఇతిహాసంలో తీర్చిదిద్దిన పాత్రలాగ

ఇథమిద్ధంగా ఇదీ అని ఖాయమైపోతుంది-

దిక్కులెరగక వాగై, వంకై  పొంగి పారిన జీవితం
ఒకే దారిలో, ఒక వరసలో సంఘటనలు పేర్చిన కథలా

తేదీల్లో, ఊర్లలో, పేర్లలో ఇమిడిపోతుంది

అతన్ని బంకమట్టి నేలలో పూడ్చినా
గుభాళించే గంధపు చెక్కల చితిపై కాల్చినా
చిన్నమరకైనా లేని ఒక సరికొత్తరూపం

తనదైన రక్త మాంసాస్తి సహిత అస్థిత్వంతో

అసలు జ్ఞాపకాల్ని చెరిపేసి—
అతనున్న రోజుల వాస్తవాన్ని నిలువునా ఆక్రమించుకుంటుంది.

(Original – “After Death” by Ro hith)

(8/10/10 Andhrajyothi Vividha)

పుస్తకానికో నివాళి

పుస్తకాన్ని మూసేసి జీవితాన్ని తెరిచిన క్షణాన
ఓడరేవులనుంచి పీలగొంతుల అరుపులు,
ఇసుకలో తవ్వుకుంటూ స్వదేశానికి సాగిపోయే రాగితెడ్ల చప్పుళ్ళు
వినపడతాయి.
రాత్రిళ్ళు ద్వీపాల మధ్యన మా సముద్రం
ఎగిరిదూకే చేపలతో తుళ్ళిపడుతుంది,
దేశపు పాదాల్ని తాకి, తొడలమీదుగా పైపైకి ఎగబాకి,
పాలిపోయిన పక్కటెముకల్ని చేరుతుంది.
రాత్రంతా తీరాన్ని కావలించుకు పడుకుని,
తెల్లారేసరికి గిటార్ తీగల్ని ఉన్మత్తపరిచే
పాటలతో నిద్రలేస్తుంది.

అదిగో.. ఆ మహా తరంగం పిలుస్తోంది.
ఆ సముద్రపు గాలి పిలుస్తోంది.
నా సావాసగాళ్ళు, తోటి ఉద్యమకారులు పిలుస్తున్నారు.
మైన్ యూనియన్ నుండి ఒక ఉత్తరం వచ్చింది.
నాకు అత్యంత ప్రియమైన ఒక మనిషి (పేరు రహస్యం),
నన్ను మా దేశానికి వచ్చెయ్యమని రాసింది.

ఏ పుస్తకమూ కాగితపు బంధనాలతో నన్నుచుట్టెయ్యలేదు.
అచ్చు అక్షరాల ఆడంబరంతో నాలోపలి ఖాళీల్ని నింపలేదు..
తన అందచందాలతో నా కళ్ళని కట్టిపడెయ్యలేదు.

పుస్తకాల్లోంచి బయటపడి మానవోద్యానవనాల్లోకి,
నా బొంగురుగొంతు పాటల్తో వచ్చి చేరతాను.
మండే లోహాలతో పని చెయ్యటానికి,
కొండవాలున పొయ్యిగట్టు మీద
పొగవాసనల మధ్య,
కాల్చిన మాంసాన్ని తినడానికి
ఈ జనాల్లో చేరతాను.
నాకు పుస్తకాలన్నా, సాహసాలన్నా ఇష్టం.
అడవులు, అగాధాలు, మంచుసోనలు, ఆకాశ వీధులూ- వీటిని చూపించే పుస్తకాలంటే..
కానీ యువకుల్ని ఈగల్లా చుట్టుముట్టి రొద చేసేవీ.,
తప్పుడు తలపులతో, విషపు తీగల ఉచ్చులో వేయ్యజూసేవీ అంటే మాత్రం కంపరం.

పురాణ గాధల్ని విదిలించుకుని
చెప్పులనిండా దుమ్ముతో నేను నా దారిలో ఉన్నాను.
పుస్తకాలన్నిటినీ అలమరల్లోకి తోసేసి,
వీధుల్లోకి నడచి పోతున్నాను.
నేను జీవితం గురించి జీవితాన్నుంచే నేర్చుకున్నాను.
ఓక గాఢమైన ముద్దు నుంచే ప్రేమంటే ఏమిటో తెలుసుకున్నాను.
కాబట్టి, నేనెవరికీ ఏమీ బోధించలేను.
కానీ కొన్నున్నాయి;
మనుషుల్లో ఒకడిగా కొన్నాళ్ళు బ్రతికిన సంగతి
వాళ్లతో పోరాడిన సంగతి
వాళ్ళు చెప్పలేని మాటల్ని నా బొంగురు పాటలో పాడిన సంగతీ…
వీటిని మాత్రం గొంతెత్తి చెప్పుకోగలను.

 

Original: Ode to the Book (Elemental Odes) by Neruda
అనువాదం: స్వాతికుమారి

http://vaakili.com/patrika/?p=13826