లవ్ మే హాపెన్

For love that smiled in April

Is false to me in May.

–  Sara Teasdale

 

వేసవి శెలవులు ఐపోతున్నాయన్న స్పృహ ని అతిప్రయత్నం మీద మర్చిపోతూ లాన్ మీద బెలూన్లు ఎగరేస్తూ, సబ్బు బుడగలు ఊదుతూ పిల్లలు. ఉప్పేసిన నిమ్మసోడా లోంచి పైకెగసే తుంపరలు తాకేలా మొహానికి దగ్గరగా తీసుకుని పగటి అలసటని మర్చిపోయే నడివయసు పెద్దమనుషులు. సాయంత్రానికి ఫెళఫెళ తగ్గి ఇస్త్రీచేసి మడతపెట్టిన పాత పట్టుచీరలా రోహిణికార్తె ఎండ.

 

టాంక్ బండ్ మీద, ఏ చాటూ లేని బెంచీలో, చూడనట్టు నటిస్తూ కదిలిపోయే వందల చూపుల మధ్య వాళ్ళిద్దరూ. మెడలో నల్లటిదారానికి గుచ్చిన నత్తగుల్ల లాకెట్తో ఆమె. కొత్తగా ప్రయోగం చేసిన జెల్ వల్ల జిడ్డుగా కనపడుతున్న హెయిర్ స్టైల్ తో అతను.

 

అతను ఆమె చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. దురుసుగా వెనక్కి లాక్కుంది. సంకోచంగా నడుం వెనగ్గా… వేళ్లతో…

విదిలించి కొట్టింది.

 

“అదేది? ఇటియ్యి” ఆతని చేతిలో చెమటకి తడిచిన ప్రేమలేఖని గుంజుకుంది. తన దగ్గరున్న పొట్లాంలోంచి కొన్ని పల్లీలు ఆ కాగితంలోకి విదిలించి ఇందాకట్నుంచీ వీళ్లనే చూస్తున్న బిచ్చగత్తె చేతిలో పెట్టింది.

 

“కెంపు, ప్లీజ్, నువ్వంటే ప్రాణం రా! ”

 

“చల్, ఇదంతా మనకి నడవదు. రూమ్మేట్ ఊరెళ్ళింది. ఈ శనివారం ఫోన్ చేసి వచ్చేయ్ కావాలంటే.”

 

అతను విలవిల్లాడిపోయాడు. సమాజం ఆమోదించదనే భయంతో కన్నీళ్ళని దాచుకున్నాడు. అప్పటిదాకా మోచేతి వరకు మడిచిపెట్టిన ఫుల్ స్లీవ్స్ మడతలు విప్పి ముంజేతి మీదకి లాక్కున్నాడు. మణికట్టు వెనకవైపు బ్లేడుతో ఆరోజు ఉదయమే రాసుకున్న “కె” అక్షరం కవర్ అయిందా లేదా అని సరి చూసుకున్నాడు.

 

“పార్లల్ కెళ్లాలి. పోతున్న.” సడెన్ గా లేచి అటుగా వెళ్తున్న ఆటోని కేకేసింది. ఆటో యూ టర్న్ తీసుకుని వచ్చేలోపు బెంచి మీదే ఉండిపోయిన అతన్ని పిలిచింది.

“బాబీ..”

ఉలిక్కిపడి ఇటు చూశాడు.

“ఒడ్డూ పొడుగూ బాగుంటావ్ కదా. అంతే. అంతకన్నా ఏం లేదు. మళ్ళీ ఇదో డ్రామా అవద్దు రేపు.”

ఆటో వచ్చి ఆగింది.

 

**

 

కేఫ్ సైలెన్స్ లో  “ఫ్రూట్ పల్ప్ లాటే”  ఆర్డర్ చేసి ఎదురు చూస్తుంది వాన. మెయిల్ బాక్స్ తెరిచి చూసింది- ఫ్లిప్కార్ట్, లింకిడ్ ఇన్, ఇండిగో, టాక్స్ సూత్రా… వాట్సాప్ చూసింది- ఆఫీస్ గ్రూప్ లో వీకెండ్ ఔటింగ్ ప్లాన్స్. ఫేస్బుక్ తెరిచింది. నాలుగేళ్ల క్రితం ప్రపోజ్ చేసిన పాత కొలీగ్, స్టేటస్మార్చాడు. “నా బంగారు తల్లులు” కవల పిల్లల ఫోటో ప్రొఫైల్ పిక్ పెట్టాడు.  కాస్త వీక్ గా ఉన్నారు. నడుమునుండి గొడుగుల్లా విచ్చుకున్న గౌన్లతో ఇద్దరూ. వెనక ఏదో లాన్, జారుడుబల్ల, మరో నాలుగేళ్ల తర్వాత వీళ్లవే యూకేజీ గ్రాడ్యుయేషన్ డే ఫోటోలు పెడతాడు.

 

 

‘ఊఫ్హ్’ మని పెద్దగా గాలొదిలి, ఫోన్ బాగ్ లో పెడుతుంటే చేతికి తగిలింది పేపర్ ఉండ. దాన్నిటేబిల్ మీద పెట్టి అరచేతుల్తో సాఫీగా చేసింది. రాత్రి టాంక్ బండ్ మీద  నడిచేటప్పుడు ఎవరో నలిపి విసిరేస్తే కాలికింద పడింది. మాములు కాగితమైతే పట్టించుకోకపోయేదే, నలిపేసినా ఆకర్షించేలా దాన్నిండా హృదయం గుర్తుల ప్రింట్. రేపు చూడొచ్చులే అనుకుని, తీసి బాగ్ లో వేసుకుంది.

అక్షరాలమీద కాస్త నూనె మరకలు. కళ్లజోడు సరిచేసుకుని చదవడానికి ప్రయత్నిస్తుంది.

 

ఈలోగా ఆర్డర్ వచ్చింది. అరుణ్ కూడా వచ్చాడు. ఆమె పక్కన ఉన్న కుర్చీని టేబుల్ ఇవతలవైపుకి లాక్కుని కూర్చున్నాడు.

”ఈ చెవిలో గాలి ఆ చెవిలోకి కొడుతుంది. బైక్ మీద రాకుండా ఉండాల్సింది.”

ఎదురుగా ఉన్న గ్లాస్ తీసుకుని రెండు గుక్కలు గటగటా తాగేశాడు.

“మిక్స్డ్ ఫ్రూటా? బాగుంది. … ఏంటది చదూతున్నావ్? “

ఏదో ప్రేమలేఖ, ఎవరో కుర్రాడు చాలా అమాయకంగా రాశాడు. అమ్మాయి పేరు మాత్రం బాగుంది, “కెంపు

అవును. కొత్తగా ఉంది. సరే చెప్పు. ఏంటి మాట్లాడాలన్నావ్?” 

కాగితం ఉండచుట్టి గురిచూసి మూలనున్న డస్ట్బిన్ లోకి విసిరింది. లాటే గ్లాస్ మీద వేళ్లతో చిన్నగా దరువేస్తూ అంది;

నిన్న నా పుట్టిన్రోజు”

హే! సారీ.. బిలెటెడ్…”

అందుక్కాదు. నాకిప్పుడు ముప్ఫై ఐదేళ్ళు”

“విషయం ఏదో సీరియస్ లా ఉందేఊ… చెప్పు”

 

అమ్మ పోయి ఆరు నెల్లౌతుంది. చాలా సంవత్సరాలుగా ఇద్దరమే ఉంటున్నాం. ఆ వయసులో ఆమె ఒంటరిగా ఉండలేదని నేను, నా బిజీ లైఫ్ లో ఇంట్లో ఉండి చూసుకుంటున్నానని ఆమె, బయటికి చెప్పుకునేవాళ్లం. తను ఇంట్లో ఉంది కదా అని నేనెప్పుడూ త్వరగా ఇంటికెళ్లలేదు. ఆఫీస్ లో ఓవర్ టైం. తర్వాత బయ ట తిరగడం. వీకెండ్స్ పార్టీలు. ఒకవేళ  ఎప్పుడైనా తలనొప్పితో త్వరగా ఇంటికెళ్ళిపోతే ఆమె తనగదిలోంచి బయటికొచ్చి చూసిందీ లేదు..

 

“ఎందుకని అంతదూరం? మాములుగా అట్లా ఉండ రు కదా?”

 

“నా చిన్నప్పుడే అతనికి దూరమైంది. తను ఒంటరిగా ఉండగలిగే మనిషి కాదు. నాకు ఇబ్బందేమో అని మరెవరికీ దగ్గర కాలేకపోయింది. చాన్నాళ్ళు హైపర్ సెన్సిటివ్ గా ఉండేది. ఎప్పుడూ దిగులుగా, విసుగ్గా. తర్వాత ఉన్నట్టుండి ఏమైందో ఏడవడం మానేసింది. తను చెయ్యాల్సిన పనులు చేసేది. నాక్కావల్సినవి చూసుకునేది. అంతే. బహుశా, నన్ను చూస్తే ఆమెకి తన త్యాగం గుర్తుచ్చేదేమో. నాకేమో నావల్ల ఆమె ఇట్లా అయిందని పెద్ద గిల్ట్ ఉండేది. అందుకే ఇద్దరం ఒకళ్లనొకళ్లం తప్పించుకు తిరిగేవాళ్లమేమో!”   

 

ఐనో. చాలా బాధగా ఉంటుంది, దగ్గరివాళ్ళు ఉన్నప్పుడు ఇన్సెన్సిటివ్ గా ఉంటాం. మళ్ళీ తిరిగొస్తే ఈసారి అలా ఉండకూడదు అనుకుంటాం. ఆమెతో బాగుండాల్సింది అనిపిస్తుందా?

 

వాన ఏం మాట్లాడలేదు. గ్లాస్ ఎత్తి మిగిలిన లాటే తాగేసింది.

కళ్ళజోడు తీసి పక్కన పెట్టింది. టేబిల్ మీద రెండు కన్నీటి చుక్కలు. అరుణ్ కుర్చీ ఆమె పక్కకి లాక్కున్నాడు. హోల్డర్ లోంచి టిష్యూలు తీసి ఆమె చేతికిచ్చి చిన్నగా వీపు మీద తట్టాడు.

 

ఆవిడ పోయినప్పుడు కూడా ఏడవలేదు నువ్వు. యు మస్ట్ బీ మిస్సింగ్ హర్ నౌ”

 

ఊహూ. నో.. ఇట్స్ హర్ ప్రెసెన్స్ దట్ ఐ మిస్.”

 

రెండూ ఒకటి కాదా?”

 

మొదటి రెణ్నెల్లూ నువ్వు చెప్పినట్టే ఆలోచించా. మేము వేరేలా ఉండాల్సిందా? నేను తన కోసం ఏమైనా చేసుం డాల్సిందా? అసలు నా చిన్నప్పుడు ఏం జరిగింది? నేనెందుకు దేనికీ బాధ్యత తీసుకోలేదు. ఇట్లా రాత్రీ పగలు ఒకటే ఆలోచన్లు. కానీ ఈ ఆలోచనంతా ఒకరోజు ఆగిపోయింది. అయిందేదో ఐపోయింది. అంతకన్నా డిఫరెంట్ గా ఏం జరిగేది కాదు అనిపించింది.

 

ఎగ్జాక్ట్లీ. మన స్వభావాలు, పరిస్తితులు, అవసరాలు, ప్ర యారిటీస్.. ప్రతీ స్టేజ్ లోనూ బోలెడు అడ్డంకులు ఉంటాయి.  వెనక్కెళ్ళినా రెపెయిర్ చెయ్యలేము కొన్నిటిని” 

 

“హ్మ్, ఇంతకీ నీకు చెప్పాలనుకున్న విషయం అది కాదు..”

 

“ఓ! మరేంటి?”  

 

***

 

వాళ్ళిద్దరూ బిర్లా మందిర్ మెట్లు దిగుతూ ఉన్నారు. ఆ అమ్మాయి ఊరికూరికే చున్నీ సర్దుకుంటుంది.  బాబీ అస్తమానం సెల్ చెక్ చేసుకుంటున్నాడు. ‘మాట్రిమోనీ ప్రొఫైల్ లో ఫెయిర్ గా ఉంది, బయట అంత కలర్ లేదు’ అనుకున్నాడు మనసులో. ఇద్దరికీ దాహంతోనూ, టెన్షన్ తోనూ గొంతులెండిపోతున్నాయి.

 

“అంటే.. నాన్న చెప్పారు. ఫామిలీ అదీ నచ్చిందని. మీరు చూడాలన్నారనీ కానీ… లేకపోతే నేనసలు..” ఆ అమ్మాయి ముందుకు పడుతున్న పొట్టిజడని వెనక్కి వేసుకుంది. రోజూ వదిలేసే జుట్టుని ఆరోజే బలవంతంగా అల్లినట్టు తెలిసిపోతుంది.

 

“ఆ.. అదే..అదే, అమ్మ చూసి రమ్మంది. ఫార్మాలిటీ కదా.” చెమటతో అతుక్కుపోయిన వాచ్ ని మణికట్టుమీద విదిలిస్తూ అన్నాడు.

 

“ఏంటా మచ్చ? వాచ్ కింద” ఆమె సిగ్గుగా వేరే పక్కకి చూస్తూ అంది.

“నథింగ్, వంట చేస్తుంటే కాలింది. పెళ్ళైపోతే ఈ బాధలుండవుగా. “ ఆమె వైపు అర్థవంతంగా చూశాడు. ఆ అమ్మాయి అరచెయ్యి అడ్డుపెట్టుకుని చిన్నగా నవ్వింది.

 

***

 

నాకిప్పుడు ముప్ఫై ఐదేళ్ళు

 

“ఇందాక చెప్పావ్”

 

“ టీనేజ్ నుంచీ ఇప్పటివరకూ, బోయ్ ఫ్రెండ్స్, ఎఫైర్స్ చాలానే నడిచాయి. పాతవాటి గురించి దిగులు పడటం, మిస్ అవడం కాలేజ్ రోజుల్లో ఉండేదేమో కానీ, తర్వాతెప్పుడూ లేదు. ఆఫీస్ లో ఉన్నంతసేపూ రేస్ లో ముందుండటం మీదే ధ్యాస. సాయంత్రమయ్యేసరికి బయట ఎవరో వెయిట్ చెయ్యడమో, నేనెళ్ళి పిక్ చేసుకోడమో. కాసేపు ఊరిమీద తిరగడం, వీలు కుదిరినప్పుడు ప్రైవసీ వెతుక్కోవడం. ఇంటికెళ్లాక అర్థరాత్రి వరకూ చాట్స్. వీటన్నిటి మధ్యల్లో గాప్ ఉన్నప్పుడు అమ్మమాటలకి బదులు చెప్పడమో, ఎదురు చెప్పడమో. అంతే రొటీన్”

 

“ఇన్నాళ్ళుగా ఒకేచోట పనిచేస్తున్నాంగా, నీ లైఫ్ స్టైల్ ఇదని తెలుసు.”

 

“ఇప్పుడు నేను ఇంటికెళ్ళేసరికి పొద్దున ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉంటాయి. నేను చేస్తే తప్ప ఏ శబ్ధమూ రాదు. బాల్కనీలో నా బట్టలు మాత్రమే ఆరేసి ఉంటాయి. నేనలా సోఫాలో కూర్చుని టీవీ చూసేటప్పుడు అమ్మ అటూ, ఇటూ తిరుగుతూ ఉండటం, గది  తలుపు వెయ్యడం, తియ్యడం ఇవేం లేవు. “ఇవ్వాళ ప్లంబర్ వచ్చెళ్ళాడు, రేపు మందులు తీసుకురా, ఫ్రిజ్ లో పాలున్నాయేమో చూడు, చెప్పులు బయట తగలెయ్యి. తలపగిలిపోతుంది- ఆ పాటాలాపి పడెయ్. రిమోట్ నేలమీదుంటే కళ్లకి కనపడట్లేదా?” ఇట్లా ఎవరూ .. ఎవరూ మాట్లాడరు నాతో. కొలీగ్స్, ఫ్రెండ్స్, జోక్స్ చెబుతారు, ఎప్పుడూ నవ్వుతూ పోలిష్డ్ గా, టూ స్వీట్ గా మాట్లాడ్తారు.   ఎందుకో వెగటేస్తుంది. ఫ్లర్టింగ్, రొమాంటిక్ టాక్.. ఇవైతే మరీ చిరాగ్గా ఉన్నాయ్. “కీప్ స్మైలింగ్, యు ఆర్ ఆసం, లుకింగ్ గార్జియస్” ఇలా ఎవరైనా అంటే లాగి కొట్టాలనిపిస్తుంది. పొద్దున సెల్ చూడగానే గుడ్ మాణింగ్ మెసేజ్ ఉంటే ఫోన్ విసిరికొడుతున్నా. “పనివాళ్ళెవరూ లేరిక్కడ, బెడ్ టీ ఇచ్చి లేపడానికి” అని డబా డబా తలుపు బాదే శబ్ధంతో నిద్ర లేవాలనిపిస్తుంది….

 

అరుణ్, అర్థమౌతుందా?

 

అసలు.. ఈ మే నెల్లో… రోజూ నాలుగుసార్లైనా అనేది “ఉష్షూ, ఏవెండలు, ఏవెండలు, మగ్గిపోతన్నా ఈ ఇంట్లో” అని.

 

గుప్పెళ్ళు మూసి టేబిల్ మీద గుద్దింది. “అబ్బా” అని ఎదురు దెబ్బ తగిలినట్టు పెద్దగా అరిచింది. భుజాలు ఎగిరిపడుతుంటే వెక్కుతూ ఏడుస్తుంది. అమ్మ చనిపోయిన ఆర్నెల్లకి మొదటిసారి ఏడుస్తుంది.

 

“అర్థమౌతుంది, రిలాక్స్” అరుణ్ ఆమె భుజం చుట్టూ చెయ్యేసి పొదివి పట్టుకున్నాడు. కంగారుగా అటు వచ్చిన సర్వర్ తో “ఏం లేదు. వుయార్ ఫైన్” అని చెప్పి పంపేశాడు.

 

దు:ఖం నెమ్మదించాక సర్దుకుని అంది. 

 

“ఎప్పుడు ఏ రిలేషన్స్ లో ఉన్నా, ఎవర్తోనూ కలిసి ఉండాలనుకోలేదు. ఇప్పుడనిపిస్తుంది. ఐ నీడ్ ఏ ప్రెసెన్స్ అట్ హోం, టూ మేక్ ఇట్ హోం.

 

తన భుజం చుట్టూ ఉన్న అతని చేతివేళ్లలోకి తన చేతి వేళ్ళు దూర్చి అదాటున అడిగింది.

“పోనీ నువ్వొచేస్తావా? ప్లీజ్. ఉండిపోతావా నాతో?”

 

***

 

“There’s a better place than this, Emptiness.” ఆడియో సిస్టమ్ లో గంటనుంచి అదే పాట ప్లే అవుతుంది.

 

మిట్టమధ్యాహ్నం మంచానికి అడ్డంగా పడి నిద్రపోతుంది కెంపు. అది వచ్చిన నిద్రకాదు. తెచ్చుకున్న నిద్ర. ఏడ్చేడ్చి కళ్ళు వాచి, గోడకేసి తలబాదుకుని, అడవి జంతువు అరుపులా గదిలో వస్తువులు కంపించేలా వెర్రిగా కేకలేసి, ఇవన్నీ కాదని రాత్రుళ్ళెలాలానూ వీలు కాదని, పగటిపూట బలవంతంగా తెచ్చుకున్న నిద్ర. నేలమీద చించి పోగులు పెట్టిన పాత డైరీలు, ఫాన్ గాలికి గదంతా ఎగురుతూ ఉన్నాయి. డైరీల్లోనుంచి టైప్ చేసుకున్న వాక్యాలు లాప్టాప్ తెర మీద వెలుగుతున్నాయి.

 

 

పోయినేడాది ఇదే నెల

 

ఇవ్వాళ అతన్ని కలవాల్సినరోజు.

అతనొస్తానంటే వద్దని, వస్తే బావుండని

చెప్పకుండా ఏదోక క్షణంలో తప్పక వచ్చేస్తాడని

ఆశపడి భయపడి గాయపడి భంగపడి

చివరికి అతను రాకుండానే మిగతా రోజుల్లానే గడిచిపోయినరోజు

అప్పట్లో ఐతే, ఎంతవద్దాన్నా వచ్చేవాడు. ఏ భయాన్నీ లెక్క చెయ్యకుండా.

ఇప్పుడా? రావొద్దంటే నిజంగానే రాడు.

ఏమో! రమ్మన్నా రాడేమో!

ఏమన్నాడు? “ బ్రేకప్” – ఇష్టాన్నా, కలలనా, హృదయాన్నా?

“ మూవాన్” – నాలోంచి నన్ను పెకిలించుకుని, అడ్డొచే జ్ఞాపకాల్ని చిత్తుగా తొక్కేసి, వేర్ డూ ఐ మూవాన్?

“అలవాటైపోతుంది” – ఏడుపా? బ్రతుకా? రెండూ కాని శూన్యమా?

 

అంతకుముందు ఏడాది ఇదే నెల

 

“సముద్రం ఒడ్డున ఇసుకలో ఉన్నా.. మిస్ యూ”

“మంచంమీద దుప్పట్లో ఉన్నా.. మిస్ యూ టూ”

“ ఇక్కణ్ణుంచి ఏం తీసుకురాను?”

           “ఒక నత్తగుల్ల తెస్తావా?”

 

ఇంకొన్ని నెలల ముందు

 

“ఈ చీర ఎలా ఉంది?”

“నువ్వు కట్టుకుంటే చీర బావుంది. విప్పితే నువ్వు బావుంటావు.”

 

ఆ మధ్యలో ఎప్పుడో ఒకరోజు

 

“హెలో”

“ఆ, ఇప్పుడే స్నానం అయింది”

“అయ్యో ముందే తెలిస్తే వీడియో కాల్ చేద్దును.”

“సంపుతా కొడకా, సంగజ్జెప్పు…”

 

మరీ మరీ మొదట్లో

 

నువ్వంటే ఎన్ని బింబాలు?

నువ్వంటే ఎన్ని అద్దాలు!

ప్రతీ అద్దంలోనూ నీ రూపమే

అన్ని రూపాల్లోనూ అద్దంలా మెరిసిపోయే నువ్వే.

 

కెంపు ఉలిక్కిపడి లేచింది. మెడలో లాకెట్ గట్టిగా పట్టుకుంది. కలలోని వెక్కిళ్ళు బయటకీ కొనసాగుతుంటే మంచినీళ్ళు తాగి లాప్టాప్ మూసేసి దిండుని గట్టిగా కౌగిలించుకుని మళ్ళీ పడుకుంది.

 

**

 

ఆటో స్పీడ్ గా వెళ్తుంటే ఎదురుగాలికి అతని జుట్టు ఎగురుతుంది. ఇవ్వాళ జెల్ పెట్టుకోలేదు.

అమ్మాయి నచ్చింది.  ప్రొసీడ్ అవుదాం” అని అమ్మకి ఫోన్లో చెప్తుంటే సెల్ పింగ్ మంది. “మీరు చాలా హాండ్సం గా ఉన్నారు. నేను నిజంగా నచ్చానా?” పెళ్ళిచూపులమ్మాయి.

యూ లుక్ హోంలీ. ఆమ్మకి చెప్పేశాను.” ఆని టైప్ చేసి సెల్ జేబులో పెట్టుకున్నాడు. చేతిలో ప్లాస్టిక్ కవర్ లో కొబ్బరిచిప్ప ప్రసాదం, ఒక ముక్క కళ్లకద్దుకుని తినబోతూ… “ఓ! ఇవ్వాళ శనివారం” చిన్నగా గొణుక్కున్నాడు. సెల్ బయటికి తీసి కాంటాక్ట్స్ లో “కె” అక్షరం చూసి డైల్ చేశాడు.

 

**

 

అరుణ్ పొలమారేదాకా నవ్వుతూ ఉన్నాడు

ఇందుకు పిలిచావా నన్ను? గాడ్! ఇట్లా…. ఇట్లా అడిగేస్తావా? నువ్వు నిజంగా టూమచ్.”

నవ్వుతూనే మాట్లాడుతున్నాడు- “అసలు నన్నెందుకు?”

“ముందా నవ్వడం ఆపు. చెప్తాను. ఇన్నేళ్ళ పరిచయంలో ఒక అంచనా ఉంటుందిగా. మెంటల్లీ హెల్దీ మనిషి అని, చాదస్తాల్లేకుండా సింపుల్ గా, ఓపెన్ గా ఉంటావని…”

 

అవన్నీ కొసరు. అసలు కారణం ఇంకేదో ఉంటుందిలే. చెప్పు

 

అంటే.. మరీ.. నాలుగేళ్ళుగా ఒకే టీం లో క్లోజ్ గా పని చేస్తున్నామా? కాస్త ఏజెడ్ బట్ ఎలిజిబిల్ బాచిలర్ వి. ఐనా నేనెప్పుడూ నీకు ఎట్రాక్ట్ అవకుండా జాగ్రత్త పడ్దావుగా. అందుకు ముచ్చటేసి…”

అతనెటో చూస్తూ ఏదో పాట హం చేస్తున్నాడు.

చెప్పింది విన్నావా? ఉంటావా నాతో?”

ఆమె చెయ్యి విడిపించుకుని చకచకా అడుగులేస్తూ కెఫే డోర్ వరకూ వెళ్లాడు. ఏం చెయ్యాలో తోచనట్టు వాన కూడా కుర్చీ వెనక్కి తోసి గబగబా వెనకే వెళ్ళింది.

ఏయ్, ఆగు, సారీ, నీకిష్టం లేకపోతే…” ఆమె వాక్యం ఇంకా పూర్తి కాలేదు.

ఇందాకట్నుంచి డోర్ తెరిచి పట్టుకున్నా, నీకు పనివాళ్లెవరూ లేరిక్కడ. బయటకి తగలడు. ఇంటికెళ్దాం”

ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు.

అర్థం అయ్యాక వాన ఆగలేదు.

సరిగ్గా నాలుగు సెకండ్ల తర్వాత కేఫ్ సైలెన్స్  డోర్ ఒక గట్టి కౌగిలింత బరువుకి కిర్రుమని ఊగింది.

***

 

 

 

 

 

 

జీవనసంధ్య

తీరా అక్కడికెళ్ళి చూస్తే ఏముంది?

తెరలు దించేశారు. ఇంక నాటకం ఆడేది లేదు పొమ్మన్నారు.

నువ్వు బిచ్చగాడు ముద్దకోసం అరిచినంత దీనంగా అరిచావు. పిచ్చోడు గరుకు రాళ్లేరుకుని మూట కట్టుకున్నంత శ్రద్ధగా అడిగావు. జ్వరం తగిలిన పిల్లాడికి వళ్ళు తుడుస్తూ దేవుళ్లకి మొక్కుకునే తల్లిలా, కేవలం మనిషివి తప్ప మరేం కాకుండా మోకరించావు వాళ్ల ముందు.

“ముసలోన్ని బాబూ, చేతికర్ర పోటేసుకుని పొగులంతా నడిసొస్తన్నా నాయనా, ఇదొక్కపాలి నాకోసం ఆడండి తండ్రుల్లారా! పోనీ ఆ చివరాకర తెరదించే ముందు వొస్తదిగా. ‘ఈ సుకదుక్కాల్ని యిస్మరించి, చాస్వతానంద కారకమైన సత్తేన్ని అనువేచించి… ఆ మాటల్నోసారి చెప్పించరాదా అయ్యా!’ అని కళ్లనీళ్ళు పెట్టుకున్నావు.

వాళ్లందరూ స్టేజీ సర్దేశారు. మొహాలకి పూసుకున్న రంగులు తుడిచేసుకున్నారు. తళుకుల బట్టలు మార్చి అతుకులేసిన పాతచొక్కాలు తొడిగేసుకున్నారు. పొట్లాల్లో ఆరిపోయి బిగుసుకుపోయిన అన్నం సయించక పాడుబడ్ద పెంకుటింటి వసారాలో చింకిచాపో తలగుడ్డో వేసుకుని నిద్రరాక పొర్లుతున్నారు. కథానాయకుడున్నాడుగా, నువ్వడిగిన మాటలు మహబాగా చప్పట్లమధ్య మళ్లీ మళ్ళీ చెప్పి గొంతుజీరబోయిన వాడు, వాడు మాత్రం నల్లవిగ్గు తీసేసి ఎర్రజుట్టు దువ్వుకున్నాడు, సీసా మూత తెరుచుకు కూచుని, అప్పుడప్పుడూ ఏదో గుర్తొచ్చి అమ్మలక్కలు లంకించుకుని శివాలెత్తుతున్నాడు.

వాళ్ల దగ్గర, వాళ్లకన్నా హీనంగా చతికిలబడి దణ్ణాలు పెట్టి అడుక్కుంటున్నావు నువ్వు. ఆ వూర్నుంచి ఈ వూరిదాకా కాళ్ళీడ్చుకొచ్చేసరికి ఈవేళయింది. నువ్వొచ్చేసరికే నాటకం ఐపోయింది. ఇప్పుడు నువ్వు తిరిగెళ్లలేవు. నువ్వడిగిన ఆ నాలుగు మాటలు వినటానికే ఈ జీవుడు ఇంకా నిలిచిపోయింది.

ఎన్నేళ్లనాటి మాట! ఏ కాలం నాటిదీ నాటకం? ఇరవయ్యేళ్లేమో నీకప్పుడు. ఎన్ని ఊర్లలో ఎంత ఘనంగా ఆడిన నాటకం! ఏవూర్లో ఆడినా ఎంత పెద్ద స్టేజీ మీదైనా వేషగాళ్ల మొహానికి నువ్వే రంగులు పూసేవాడివి. విగ్గులు పెట్టి, వాళ్ల చొక్కాలమీద మెరుపు కాయితాల పూలు అంటించేవాడివి. ఆట మొదలవగానే పరిగెత్తి జనంలో చేరి చూసేవాడివి. ఇకంతే, నీకు వొళ్ళు తెలిసేది కాదు. చివరికంటా చూశాక, ఆఖర్లో కథానాయకుడు ఇల్లొదిలి వెళ్ళిపోతూ ‘ఈ సుఖదుఃఖాల్ని విస్మరించి, శాశ్వతానంద కారకమైన సత్యాన్ని అన్వేషించి…’ అనే మాటలు గంభీరంగా చెప్తుంటే వొళ్లంతా పులకరించి పూనకమెత్తేవాడివి. నీకా అక్షరమ్ముక్క రాదు. ఆ మాటలన్నీ ఏంటో, వాటి అర్థమేంటో నీ ఊహకి కూడా అందలేదు. అవేవో గొప్పమాటలని మాత్రం నీకు తెలుసు, వాటి ప్రకారం నడిస్తే ఏడుపుండదని, బతుకంతా అట్లా ఆ నాయకుడిలా గంభీరమైన మొహంతో గొప్పోడిలా బతకొచ్చని నీకు నికరంగా తెలుసు. ఈ చదువుకున్నోళ్లకంటే చాలా బాగా నీకొక్కడికే తెలుసు ఆ సంగతి. ఎవర్నో అడిగి బతిమాలి ఆ మాటల్ని ఓ కాయితమ్ముక్కమీద రాయించుకుని నీ ఇంట్లో మట్టిగోడ మీద మైదాపిండి రాసి అంటించుకున్నావు కూడా.

మాయదారి జబ్బేదో వచ్చి నీ అయ్య పోయాడు. పెద్దోడివి, నాటకాలని ఊళ్ళు పట్టుకు తిరిగితే ఈ సంతకి కూడుబెట్టే దిక్కేదని కావల్సినోళ్ళు నాలుగు చివాట్లేసి నిన్ను కూలిపనికి కుదిర్చారు. నీ అయ్య పోతే నువ్వేడవలేదు. దిక్కుమాలినోడు, పెట్టిందానికన్నా కొట్టిందే ఎక్కువ పాపిష్టోడు అని మీ అమ్మ లోపల, నువ్వు పైకే అనుకున్నారు. కానీ, నువ్వు లేకుండా జీవనసంధ్య నాటకం పక్కూర్లో ఆడిన రోజు మాత్రం ఏడ్చావు. గోడకంటించిన కాయితమ్ముందు కూర్చుని ఎక్కిళ్లతో పేగులు నెప్పెట్టేలాగా ఏడ్చావు. నాటకం పూర్తయ్యే జాముకి ఆ కాగితాన్ని తడుముకుని, దాన్లో మాటలు గుర్తు తెచ్చుకుని, ‘ఇట్లా ఏడవకూడదని కదా, బాగా పెద్దరికంగా, మొకం దైర్నంగా ఉంచుకుని బతకమని కదా దీన్లో ఉంది,’ అనుకుని మొహం కడుక్కుని పడుకున్నావు.

తర్వాత్తర్వాత ఏడుపు మర్చిపోయావు గాని, నాటకాన్ని గానీ నాయకుణ్ణి, అతని మాటల్ని గానీ మర్చిపోలేదు. ఎట్లా కనిపెట్టిందో గాని సుగుణమ్మ కాపురానికొచ్చినరోజే అడిగింది. ‘ఒక్క దేవుడి బొమ్మా లేదుగా ఇంట్లో వాసనకడ్డీ యెలిగిద్దామంటే! ఈ కాగితమ్ముక్కకి దణ్ణం బెట్టుకోడం ఎవరు నేర్పారోగాన్నీకూ…’ అని. బయటికి ఎవర్తో చెప్పుకోకపోయినా నీ పెళ్ళానికి తెలుసు నువ్వు మిగతా వాళ్లలాగా కాదని. సాయంకాలం పూట పొయ్యి దగ్గర చేరి దాకలో పులుసు కలబెడుతూ ఆకాశంలోకి అట్లా చూస్తూ ఉంటావు కదా, అప్పుడది నిదానంగా సణుక్కునేది. ‘ఏం విడ్డూరం మనిషమ్మా! చుట్టకనో, చుక్కకనో బజాట్టోకి పోకండా పెళ్ళాం చేతికి అడ్దం పడతాడు. ఇంకేవన్నా అంటే అట్టా పైకంటా సూత్తాడు. ఏవయ్యో! ఏవుంటదాడ?’ అట్లా పైకంటుంది గానీ నీకు తెలీదు, దానికి లోపలెంత కులుకో, ఏం టెక్కో, దాని మొగుడు బలే మర్యాదగల్లోడు, వివరం తెలిసినోడు అని.

పెళ్లయ్యేదాక ఎవరూ సుగుణమ్మతో ‘నువ్వు చక్కనిదాని’వనలేదు. బక్కపలచటి మనిషి. కాయకష్టం చేసుకున్న చామనచాయ ఒళ్ళు. ఎప్పుడూ ఏదోక పని చేస్తానే ఉండేది. తిన్నగా చతికిలబడి నేలమీద కూచోగా చూడలేదు ఎవరూ. మోకాళ్ల మీద గొంతు కూర్చునే అన్నమొండటం, కోళ్లకి గింజలెయ్యడం, కత్తిపీటతో కాయగూరేదో తరిగేటప్పుడు కుక్క గానీ అటువైపొస్తే దానికో రెండు ముక్కలిసరడం, గిన్నెలు తొలిపిన నీళ్ళు అట్లా మొక్కల్లోకి జల్లడం, అంతే దానికి తెలుసు. చీలమండల పైకి చీర, ఎప్పుడన్నా నాలుగు నిత్యమల్లి పూలో కనకాంబరాలో జుట్టుముడిలో దోపుకోడం, అదీ దాని అలంకారం. పని చేసుకునేటప్పుడు, కూర్చుని లేచేటప్పుడు టకటకమని మొటికల చప్పుడు పైగా.

అప్పటిదాకా ఎన్ని మొహాలకి రంగులేసినా అవి నీకు ఒట్టి మొహాలే. సుగుణొచ్చేదాకా ఆడవాళ్లంటూ ప్రత్యేకంగా ఉన్నట్టు ఎప్పుడూ అనిపించలా నీకు. అదొచ్చాక ఇంకెవరూ ఆడోళ్లలాగా కనపళ్ళేదు. ఎందుకు? అదేమన్నా అందగత్తా? రంగా రూపమా కళ్ళా ఒళ్ళా? అవేం లేవు. నీతోపాటు ఉండిపోడానికి వచ్చేసిందిగా, నీతో చెప్పుకునే మాటలు ఇంకెవరితో చెప్పుకోదుగా. సంతోషంగా ఉండటమంటే ఇదీ అని నీకెప్పుడూ దేని గురించీ అనిపించలేదు కానీ సుగుణ ఉన్నప్పుడు అంతా మాములుగా ఉన్నట్టు, అదింట్లో లేనప్పుడు వెలితిగా ఉన్నట్టూ మాత్రం అనిపించేది. అదేం చేసినా నచ్చుతుందని కాదు, దాని పెడసరం మాటలు కొన్ని, పాడలవాట్లు కొన్నీ చికాకు పెట్టవనీ కాదు. మనుషులమీద కోపమెట్లా తెచ్చుకోవాలో నీకు చేతగాక, కోపం రాని మొగుణ్ణి సాధించడమెట్లాగో దానికి తోచక, అట్లా గడిచిపోయేది. ఒకవేళ నువ్వెందుకన్నా మనసు కష్టపెట్టుకుని మాట్లాడకుండా ఉంటే ‘ఓయబ్బ! నీలిగింది చాల్లే, పోయి తిను పో’ అని సుగుణ అటు తిరిగి ఆవులించినట్టు నాటకమాడటం, ‘ఏదో మాట జారాన్లేవే గుణమ్మా! మనసులో పెట్టుకోమాక,’ అని నువ్వు దాని భుజం పట్టుకు ఊపి దొంగనిద్ర చెడగొట్టడం, ఇదే మోస్తరు నడిచింది చాన్నాళ్ళు.

జీవనసంధ్య నాటకంలో ఒకచోట నాయకుడు ప్రియురాలితో అంటాడు, ‘నా అనురాగం కళంకం లేనిది. హృదయపూర్వకంగా నీ ప్రేమని అర్థిస్తున్నాను,’ అని. ఆ మాట అనేటప్పుడు ఆ పిల్ల అరచేతిని తన చేతుల్లోకి తేసుకుని క్షమాపణగా, ఆరాధనగా, నిస్సహాయంగా ఆమె వైపు చూస్తాడు. అప్పట్లో నీకా భాగం అంతగా నచ్చేది కాదు. పెద్దగా అర్థమయ్యేది కూడా కాదు. కానీ సుగుణతో పేచీ పడ్దప్పుడు, ఏదో ఆలాపనలో ఉండి అది పిలిస్తే కసురుకున్నప్పుడు, అది రుసరుసలాడితే ఓర్చుకోలేక విసిరికొట్టినప్పుడు, అట్లా విసిరికొట్టాక అది అలిగి మూగమొద్దులాగా పనిచేసుకుంటున్నప్పుడు, నీకనిపించేది గుండెలోంచి ఏదో తన్నుకొస్తున్నట్టు, ఏవో మాటలు లోపల్నించి ఊపిరాడకుండా ఒకదాంతో ఒకటి పురిపడుతున్నట్టు. చింతచెట్టు కింద ఒక్కడివే బాసింపట్లేసుకుని ఆ ‘అనురాగం, కళంకం’ వాక్యాలు పెద్దగా నీతో నువ్వు చెప్పుకునేవాడికి. మళ్ళీ చుట్టూ ఎవరన్నా చూస్తారేమో అని మెల్లగా గొణుక్కునేవాడివి. పదాలు నోరు తిరగనప్పుడు బుర్ర మీద నీకు నువ్వే ఒక మొట్టికాయ వేసుకునేవాడివి. పదిసార్లు నీకు నువ్వు చెప్పుకుని, తప్పులేం లేవని తీర్మానించుకుని, తీరా సుగుణ దగ్గరకెళ్ళాక చెప్పటానికి మాట పెగిలేది కాదు. అక్కడక్కడే తల గోక్కుంటూ, చొక్కా అంచులు లాక్కుంటూ దాని చుట్టూ తిరిగేవాడివి. అదెట్లానో కనిపెట్టేది నీ వాలకం. ‘మళ్ళీ వచ్చా? ఆ కాగు ఇటందియ్యి. నీళ్లకి పోతా,’ అని పట్టీ పట్టనట్టుగా మాట్లాడి మళ్ళీ నిన్ను మాటల్లో కలిపేసుకునేది. ఎన్ని సంవత్సరాలు గడిచినా నీకా ‘అనురాగం’ మాట సుగుణతో చెప్పే ధైర్యం రాలేదు.

మూడు సార్లు కడుపు పోయి మోయలేనన్ని మొక్కులు మొక్కుకుని దాదాపు నడివయసు మీదపడ్డాక దక్కిన ఒక్కగానొక్క పిల్లాడికి దేవుడి పేరు పెట్టకుండా జీవనా అని పిలుస్తావని ఊరోళ్లతో పాటు సుగుణ కూడా తిట్టిపోసేది. కానీ, ఆ పేరువల్లే వాడివ్వాళ ఇంత తెలివిగల్లోడయ్యడని నీకు తెలిసినట్టు వాళ్లకి తెలీదుగా. సుగుణ మాత్రం వాణ్ణి జీవుడూ అని కేకేస్తే నీకెంత కచ్చిగా ఉండేదో. ‘నా అంటే ఉన్నంత మెత్తంగా డూ అంటే ఉండదే యెర్రిదానా!’ అన్నువ్వు చెబితే అది కోరగా ఓ చూపు చూసి ‘ఏవోనయ్యో, ఆ సోపలన్నే నాకు తెలవదు. మొక్కు ఎగ్గొట్టిన మొనగోడివి, ఏ మొహం బెట్టుకుని చెబుతున్నా?’ అని తిరుగులేని నెపంతో తెగబడేది.

మాగన్ను నిద్రలో ఏనాటివో సుగుణ మాటలు తలపుకొచ్చి నవ్వుకున్నావు. కూర్చునే నిద్రలోకి పోతున్నావు. చలికి మునగదీసుకు పడుకున్న వీధికుక్క ఒకదానికొకటి మెలిపడ్డ కాళ్ళని మత్తుగా విడదీసుకుంటూ సన్నగా కుయ్యిమంది. గోడల వెనకనుండి కీచురాళ్ళు రూరూమని రొదపెడుతున్నాయి. పందిరి గుంజ వీపుకి ఒత్తుకుని కళ్ళు తెరిచావు. నాటకం వాళ్లంతా చింకిచాపల మీద, అరుగుల మీద, దొరికినచోట దొరికినట్టు వెర్రినిద్రలో ఉన్నారు. దిగులుగా, జాలిగా, నీ గతమ్మీద గుబులుతో వాళ్లవైపే చూస్తున్నావు.

ఆ చివరాఖర్న మూలన ముడుచుకు పడుకున్నవాడు సుమారుగా జీవన ఈడు వాడే. ఐతే వీడు బక్కపలచన, ఎవరేం చెప్పినా చేసుకుపోయే మొహమాటపోడు. జీవనట్లా కాదు. గట్టి ఒళ్ళు, నిక్కచ్చి మనిషి. మాటలో జంకూ, బొంకూ తెలీదు. ‘నీకంతా మీ అమ్మదే వొచ్చిందిరా!’ అని మురిపెంగా విసుక్కుంటావు నువ్వు. వాడికెప్పుడూ జనం కావాలి. చేతినిండా పని కావాలి. ఎక్కడిక్కడికెళ్తాడో, ఎవరెవర్తో సావాసం కడతాడోగానీ భలే భలే పనులు నేర్చుకొస్తాడు. పాత టైర్లు, పారేసిన కొబ్బరి టెంకెలు, తెగిపోయిన చెప్పులు, పీలికలైన పాతబట్టలు, ఒకటనేంటిలే… ఏద్దొరికితే దాంతో వాడుకునే వస్తువులో, దాచుకునే బొమ్మలో ఏదో ఒకటి చేస్తాడు. వాడిచుట్టూ ఓ పదిమంది పిల్లలో, పెద్దోళ్ళో ఎప్పుడూ మూగే ఉంటారు. పాతవాళ్ళూ, పట్నంవాళ్ళూ అన్లేకుండా ఏ దూరపు వూళ్ళమ్మటో తిరుగుతూ, కొత్త పనులు చేసుకుంటా సందడిగా ఉంటాడు. వాడికి పొద్దు చాలదు, నీకు పొద్దు గడవదు. ఏ పని చెయ్యటానికీ నీ చేతుల్లో సత్తువ లేదు. సుగుణ పోయాక ఏదన్నా చెయ్యాలన్న హుషారూ మిగల్లేదు. ఈ నాటకం కోసమని ఇన్నేళ్లకి ఇల్లు కదిలి, ఊరొదిలి కర్ర పోటేసుకుని ఇంతదూరమొచ్చావు గానీ లేకపోతే ఎవరితోటీ మాట్లాడాలని, ఎటన్నా పోయి తిరగాలనీ మొదట్నుంచి ఎట్లానూ లేదు.

ఇప్పటిదాకా పక్కూరి గుళ్ళోనుంచి వినిపిస్తున్న భజన సద్దుమణిగింది. వసారాలో ఒక మూలన చిందరవందరగా నాటకం వాళ్ల అరిగిపోయిన చెప్పులు, బట్టల పెట్టెలు, అలంకరణ సామాన్లూ. వాటిక్కాస్త అవతల దీపం మలిగిపోయిన మట్టి ప్రమిదెలో నూనెవాసన, నూనెలో ఇంటివాసన, ఇల్లంటే సుగుణతో పాటు కలియతిరిగే నేతచీర వాసన, ఆమె చేతుల్లో తిరిగే రకరకాల పనుల తాలూకు దినుసుల, వస్తువుల వాసన, చివర్రోజుల్లో ఆమె మంచం పక్కన గుట్టగా పడున్న మందుల వాసన. ఆ మంచం పక్కనే మట్టి మూకుడులో పాలు కతికే పిల్లి వాసన. ఆమె పోయాక పిల్లి రావడం మానేసింది. నీ ఇంట్లో చాలా వాసనలు రావటం మానేశాయి. నీకు చాలా చప్పుళ్ళు వినపడటం మానేశాయి.

అప్పుడప్పుడూ నీకు కలలొచ్చేవి. ఈమధ్య కొద్దికాలం దాదాపు ప్రతీరాత్రీ వచ్చాయి. నిద్ర పట్టడం బాగా ఆలస్యమైనా బానే పడుతుంది కానీ ఎక్కడ కుక్క మొరిగినా, గట్టిగా గాలి వీచి చెట్లు కదిలినా, ఏ పొరుగూరి నుంచి ఆలస్యంగా వచ్చినోళ్ళెవరైనా దారంట నడిచెళ్ళినా, అదే అదనుగా, ఆ వంక పెట్టుకుని లేస్తున్నావు. చేతికర్ర మంచంకోడుకేసి కొట్టి ‘ఎవురదీ?’ అని కాసేపు దిక్కులు చూసి పడుకుంటూన్నావు. తెల్లారే వేళకి కలలొచ్చేవి. ఒకటనేముండదు. చాలాకలల్లో నువ్వు ముసలోడివి కాదు. ‘ఆలీసెం జెయ్యొద్దు. తెరలెత్తాలి. తొరక్కానీ,’ అని ఎవరో పురమాయిస్తుంటారు. నువ్వు ‘ఇదుగో, ఈ విగ్గొకటీ నిలబడితే యీళ్ళని రంగమ్మీదకొదలొచ్చు,’ అని గిరగిరా గదంతా తిరిగి అందరి వేషాలు బాగొచ్చాయా లేదా అని చూస్తుంటావు. ‘వృథా పోకూడదు. బట్టలుతికిన నీళ్లని ఇలా కాలవ తీసి మొక్కల్లోకి వదలొచ్చు,’ అనే జీవన గొంతు విని నిద్ర లేస్తావు. వాడు వూరోళ్ళెవరికో నీళ్ళవాడకం గురించి చెప్తూ ఉంటాడు. అప్పటికే తెల్లంగా తెల్లారిపోయి ఉంటది. ‘ఈసారి వారానికే వచ్చా ఊర్నించీ?’ అని వాణ్ణడుగుతూ మంచం దిగుతావు.

రాన్రానూ జీవనకి పన్లెక్కువయ్యాయి. స్థిమితంగా ఒక వూర్లో ఉండటం కుదరటల్లేదు. ఇప్పుడు నీకు కుక్కలు, చెట్టుకొమ్మలు మెదలకపోయినా మెలకువొస్తుంటుంది. ఇప్పుడు తెల్లారిపూట కలలూ రాటల్లేదు. పాతమనుషులెవరూ పెద్దగా గుర్తుకీ రారు. పగలంతా గుమ్మంలో కూర్చుని వచ్చిపోయే మనుషుల్ని చూస్తుంటావు. ఎవర్నీ పిలిచి పలకరించాలనేముండదు. వాళ్ళెవరా, ఎందుకటెళ్తన్నారా అన్న ఆరా కూడా ఉండదు. అట్లా చూస్తూ ఉంటావంతే. బాట మీద గులకరాళ్లని, ఎద్దులు నడిచెళ్తే రేగే దుమ్ముని, వానపడినప్పుడు నానిపోయే పాత మట్టిగోడనీ ఊరకనే అట్లా చూస్తూ ఉంటావు.

ఎప్పుడన్నా ఒకసారి నీ ఈడువాళ్ళో, నీ పాత సావాసగాళ్ళో వచ్చి పక్కన కూర్చుంటారు. ‘ఏవన్నా జెప్పూ, ఎంత కష్టం జేశావూ… ఆ వరదొచ్చినేడాది ఒక్కడివే నిట్టాడి నిలబెట్టి, వాసాలేసుకుని, ఈ గూడు నిలబెట్టుకోలా! ఎండాకాలం దొంగలుబడి చెంబూ, తపేలా ఎత్తుకుపోతే నువ్వూ, సుగుణమ్మా కలిసి మళ్ళీ కార్తె నాటికి సామానంతా సమకూర్చుకోలా!’ అని ఎప్పటివో మాటలు చెప్తుంటారు. నువ్వు వాళ్ళమొహంలోకే చూస్తా దీక్షగా వింటుంటావు. చివరికి ‘ఆ? ఏవోఁ! గుర్తు రాటల్లా…’ అని వేరేపక్కకి తిరుగుతావు.

అట్లాంటి నువ్వు మొన్నెవరో వచ్చి ‘తెలిసిందా? పక్కూళ్ళో నాటకవాడతన్నారంట. ఏనాటిదో పాత ఆటంట. మళ్ళీ ఇన్నాళ్లకి ఎవరో ఆడిస్తన్నారు. అప్పుట్లో ఆ నాటకానికి నువ్వు గూడా పనిజేశావంటనే?’ అనడగ్గానే కాళ్లూ చేతులు కూడదీసుకుని మంచంలో లేచి కూర్చున్నావు. ‘అదేనంటావా? ఎప్పుడంటా?’ అనడిగావు.

ఇకంతే, అప్పుణ్ణించీ రెండో ధ్యాస లేదు. రోజులూ గంటలూ లెక్కబెట్టుకోడమే పని. కానీ, కాలం నీకిప్పుడు ‘కూ’మని ముందుకుపోయే రైలుబండి కాదు. నిముషానికోసారి బయల్దేరిన చోటికే గుండ్రంగా తిరిగొచ్చే ఎడ్లబండి చక్రం. ఆ పాతరోజులు గుర్తు తెచ్చుకుంటూ, దారినపోయే వాళ్లని కేకేసి ఏదోకటి చెబుతూనే ఉన్నావు. పాత రేకుపెట్టె తెరిచి మైదాపిండి అట్టగట్టిన కాగితంముక్కని చూసి పదే పదే తడుముకుని మళ్ళీ లోపల పెడ్తున్నావు. తెగిపోయిన చెప్పుకి రెండు టాకాలు వేయించుకుని, అలమర్లో దాచుకున్న తెల్లచొక్కా మడతలు సరిజేసి పెట్టుకుని తయారయావు.

తీరా నాటకమాడే రోజొచ్చింది. తెల్లచొక్కా, కుట్టిన చెప్పులు వేసుకుని చేతికర్ర పోటేసుకొని బయల్దేరావు. మా జీవనా వస్తే చెప్పండని పక్కవాళ్లకి ఓ మాటచెప్పి, వసారాలో నులకమంచం ఎత్తి గోడకి చేరవేసి పొద్దుగుంకక ముందే బయల్దేరావు. ఇల్లు కదిలి, బజారుకెళ్ళి ఎన్నాళ్ళయిందోగానీ ఎక్కడికక్కడే కొత్తగా చూసుకుంటా వెళ్ళావు. ఊరుదాటి పొలాలమీదగా పోతుంటే నీ మాయదారి నీరసం నడవనీదు. గట్టురాయి పక్కన మర్రిమాను మొదట్లో కూలబడ్డావు. అట్లా ఎన్నిగంటలు గడిచిందో, ‘ఓ ముసలయ్యో!’ అనెవరో కుదుపుతుంటే తేరుకుని లేచావు. ‘ఈవరకాడ ఒక్కడివే యాడికెల్దామనొచ్చా?’ అని జాలిగా కసిరి ఏదో బండిలో తీసుకుపోయి నిన్ను పొరుగూర్లో వదిలిపెట్టారు.

తీరా అక్కడికెళ్ళి చూస్తే ఏముంది?

తెరలు దించేశారు. ఇంక నాటకం ఆడేది లేదు పొమ్మన్నారు.

కాళ్ళూ గడ్డాలూ పట్టుకున్నా లాభం లేదని తెలిశాక, పొనీ నువ్వడిగిన నాలుగుమాటలూ చెప్పించుకోవాలన్న భ్రమకొద్దీ వాళ్లనొదలకుండా వాళ్ళ విడిది దగ్గరే జోగుతూ కునికిపాట్లు పడుతున్నావు. చూసీ చూసీ ఏ నడిజాముకో నీకూ కన్నంటింది. నిద్రలో ఎప్పటెప్పటివో సంగతులు కలల్లాగా ఒకదాంతర్వాత వొకటి వచ్చిపోతూ ఉన్నాయి. అంతా ఇప్పుడు జరుగుతున్నట్టే, కళ్లముందున్నట్టే, చప్పుళ్ళు, వాసనలు, మాటలు, అన్నీ.

దిగ్గున లేచావు. తెల్లంగా తెల్లారిపోయుంది. రాత్రంతా పందిరిగుంజ ఒత్తుకుపోయి భుజం నొప్పి చేసింది. చుట్టూరా వెతికావు. అక్కడక్కడా పడేసిన చెత్తాచెదారం, పనికిరాక వదిలేసిన పగిలిపోయిన సామాను తప్ప వేరే వస్తువులు, మనుషులు ఎవరూ కనపడలేదు. నాటకం వాళ్ళు సర్దుకుని తెల్లారగట్టే వెళ్ళిపోయారని తెలిసింది. వాళ్లెళ్తున్నప్పుడు ఆ సందడి కూడా కలలోదే అనుకుని అటుతిరిగి పడుకున్నావేమో, లేదంటే మెలకువొస్తే నువ్వొదలవని వాళ్ళే చప్పుడుకాకుండా వెళ్ళారేమో. దిక్కుతోచని వాడిలాగా అక్కడే చతికిలబడి ఉండిపోయావు. ‘ఇంకేవుంది? యెళ్ళెళ్ళు,’ అని అక్కడ ఊడవడానికొచ్చినామె నిన్ను అదిలిస్తుంది. కాళ్ళు, చేతులూ కూడదీసుకుని కర్రపోటేసుకుని, మనసు దిటవు చేసుకుని నిదానంగా ఆ తెల్లవారి వెలుతురుకి ఎదురుగా నడిచి వెళ్ళిపోతున్నావు.

నువ్వా సందు మలుపు తిరిగే ధ్యాసలో చూసుకోలేదు కానీ, ఆ మూలమీద ఇంటెదురుగా పిల్లాడొకడు, వాళ్ళనాన్న పాతచొక్కాని గుండీలు పెట్టకుండా కోటులాగా వేసుకుని, నడుమ్మీద చెయ్యుంచుకుని ‘ఈ సుఖదుఃఖాల్ని విస్మరించి, శాశ్వతానంద కారకమైన సత్యాన్ని అనువేచించి…’ అని డైలాగు చెప్తున్నాడు. ఆ తమ్ముడు గట్టిగా చప్పట్లు కొడుతూ, ‘అదే, అదే, అంతే అంతే, బలే చెప్పావురా!’ అని నీళ్లమడుగులో చిందులేస్తున్నాడు.

(ఈమాట నవంబర్ 2018 లో ప్రచురితం)

ఉలిపికట్టె

అనగనగా ఒక ఊరు. ఆ ఊరంతా దొంగలే. చీకటి పడగానే ప్రతీవాడూ దొంగతాళాల గుత్తి బొడ్లో దోపుకుని గుడ్డి లాంతరు చేత పట్టుకుని బయల్దేరేవాడు. దొరికిన ఇళ్ళల్లో దూరడం, చేతికందింది మూటగట్టుకోడం. తెల్లారేవేళకి దొంగసొమ్ముతో ఇంటికి చేరేసరికి వాడిల్లు ఇంకెవడి చేతిలోనే గుల్లయి ఉండేది.

అలా అందరూ ఒకరినొకరు దోచుకునే వాళ్ళు. కలిసి మెలిసి సుఖంగా బతికేవాళ్ళు. ఒకడు ఎదిగిందీ, ఇంకోడు చితికిపోయిందీ లేదు. ఒకణ్ణొకడు దోచుకుంటూ, ఆ గొలుసు దొంగతనాలు ఊళ్ళో చివరి వాడు తిరిగి మొదటివాడిల్లు కొట్టెసేదాకా క్రమం తప్పకుండా సాగేవి. ఆ వూర్లో వ్యాపారమంతా అమ్మేవాళ్ల, కొనేవాళ్ళ మోసపు తెలివితేటల మీదే నడిచిపోయేది. అక్కడి ప్రభుత్వం ఒక మాఫియా. ప్రజల్ని వీలైనన్ని రకాలుగా దోచుకునేది, జనమేం తక్కువోళ్ళు కాదు, పన్నులు ఎగ్గొట్టడం ద్వారా ప్రభుత్వానికి న్యాయం చేసేవాళ్ళు. ఇంకేం! పేదా గొప్పా తేడాల్లేకుండా జీవితాలు నల్లేరు మీద బండిలా సాగేవి.

ఉన్నట్టుండి ఒకరోజు ఎక్కణ్ణుంచొచ్చాడో ఒక నిజాయితీపరుడు ఆ వూరొచ్చాడు. రాత్రుళ్ళు గోనెసంచి, గుడ్డిలాంతరు పట్టుకుని వూరిమీద పడకుండా ఇంటిపట్టున కూర్చుని చుట్టకాల్చుకుంటూ తత్వాలు పాడుకునేవాడు. మిగతా దొంగలు యధావిధిగా తమ వంతు ప్రకారం అతనింటికొచ్చినప్పుడు గూట్లో దీపం చూసి బయటే ఆగిపోయేవాళ్ళు.

ఇలా కొన్నాళ్ళు జరిగింది. ఇక తప్పనిసరై అందరూ అతనికి నచ్చజెప్పాల్సొచ్చింది. “బాబ్బాబూ, నీకు తిండికి లోటులేకండా ఉంటే ఉండనీ, చుట్ట కాల్చొద్దనీ, పాటలు పాడుకోవద్దనీ మేమెవరమూ చెప్పం. కాకపోతే నువ్వొక సంగతి తెలుసుకోవాలి. నువ్వు రాత్రుళ్ళు ఇల్లు పట్టుకు వేలాడితే వూళ్ళో ఒక ఇల్లు ఆకలితో మిగిలిపోతుందని గుర్తుంచుకో.” అని అతన్ని బతిమాలారు.

నిజాయితీపరుడికి అది నిజమే అనిపించింది. దొంగల సౌకర్యం కోసం అతను ప్రతిరాత్రి ఇల్లొదిలి పోయి తెల్లారి ఎంచక్కా తిరిగొచ్చేవాడు. దొంగతనాలు మాత్రం చేసేవాడు కాదు. వూరి లాకులు దాకా వెళ్ళి కాలవనీళ్ళు ఎందాక పోతున్నాయో చూసొచ్చేవాడు. తీరా వచ్చిచూస్తే ఏముంది? ఆసరికే ఇల్లంతా లూటీ అయుండేది.

అలా ఓ వారం తిరిగేలోపు, మన నిజాయితీపరుడు బికారి ఐపోయాడు. అతని ఇల్లంతా ఊడ్చిపెట్టుకుపోయింది. తినడానికి పిడికెడు బియ్యం కూడా మిగల్లేదు. ఐతే స్వయంకృతం కాబట్టి ఇదో పెద్ద బాధ కాదు. అసలు సమస్య వేరే ఉంది. రోజూ మిగతావాళ్లని ఎంచక్కా తనిల్లు దోచుకుపోనిచ్చేవాడు, ఇతను మాత్రం ఎక్కడా చేతివాటం చూపెట్టడు. అంచేత ఇతను కొల్లగొట్టాల్సిన ఇల్లు మాత్రం, ఆ ఇంటివాళ్ళు బయట పని కానిచ్చి తిరిగొచ్చేసరికి నిక్షేపంగా దర్శనమిచ్చేది. ఇంకేముంది, కాలం గడుస్తున్నకొద్దీ, అలా మిగిలిపోయిన డబ్బుతో వాళ్ళు డబ్బున్నవాళ్ళుగా తయారయ్యేవాళ్ళు. వాళ్లకి బతుకుతెరువుకోసం దొంగతనం చెయ్యాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ నిజయితీపరుడి ఇల్లేమో అతను దొంగసొమ్ముతో నింపుకోడు కాబట్టి అతనింటికి దొంగతనానికి వచ్చినవాళ్లకి ఏం దొరికేది కాదు. క్రమక్రమంగా వాళ్ళు పేదవాళ్ళుగా అయ్యేవాళ్ళు.

ఇక ఈ నడమంత్రపు సిరిని పొందినవాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా రాత్రుళ్ళు కాలవగట్టుకి షికారుకెళ్ళడం నేర్చుకున్నారు. అలా పోనుపోనూ చాలామంది ధనవంతులుగా, ఇంకా చాలా మంది పేదవాళ్ళుగా మారిపోయారు. ఈ వ్యవహారమంతా గందరగోళంగా తయారైంది.

ఇదిలా ఉందగా,  షికారుకెళ్ళే గొప్పవాళ్లకో ఆలోచన వచ్చింది. ఇలానే మనం రోజూ పనిమానేసి షికారుకెళ్తే ఎన్నాళ్ళు సాగుతుంది అని? సరే ఐతే, బీదవాళ్లకి కాస్త భత్యమిచ్చి మనకోసం దొంగతనాలు చేయించుకుంటేనో! అనుకున్నారు. అనుకున్నదే తడవుగా మనుషుల్ని పెట్టుకున్నారు. ఒప్పందాలు రాసుకుని జీతాలు, మామూళ్ళూ మాట్లాడుకున్నారు. ఈ రాతకోతల్లో కూడా ఏం మెలిక పెడదామా, ఎలా ఇంకా గొప్పవాళ్లమౌదామా అనే అందరూ ప్రయత్నించేవాళ్ళు. అలా అలా ఉన్నవాళ్ళు మరింత ఉన్నవాళ్ళుగా, లేనివాళ్ళేమో బొత్తిగా బీదవాళ్ళుగా మారిపోయారు.

అసలు కొంతమంది ఎంత డబ్బు కూడబెట్టారంటే వాళ్లకసలు దొంగతనం చెయ్యల్సిన పనిలేకుండా పోయింది.  అలాగని ఊరుకుంటే లేనివాళ్ళొచ్చి వీళ్ల ఇళ్ళు దోచుకుపోకుండా ఉండరు కదా! అందుకని ఏం చేశారంటే, లేనివాళ్లలోకెల్లా అతిపేదవాళ్లని చూసి, వీళ్ల ఇళ్లకి, ఆస్తులకి కాపలావాళ్ళుగా పెట్టుకున్నారు. దాన్నుంచి పోలిసులు తయారయ్యి, జైళ్ళు పుట్టుకొచ్చాయి. వాటివల్ల కొత్త ఉద్యోగాలు, మనుషులు వేరు వేరు వర్గాలుగా విడిపోవడం మొదలైంది.

ఈ నిజాయితీపరుడు వూర్లో అడుగుపెట్టాక పట్టుమని కొన్నేళ్లైనా గడిచాయో లేదో, జనం దొంగతనాల గురించి మాట్లాడ్డమే మానేశారు. ఇప్పుడంతా గొప్ప,పేద అనే మాటలే చెప్పుకుంటున్నారు. ఏదేమైనా, ఏ పేర్లతో పిల్చుకున్నా వాళ్లంతా ఇప్పటికీ దొంగలే.

ఎవరిమాట ఎలా ఉన్నా ఈ నిజాయితీపరుడు మాత్రం కొద్దిరోజుల్లోనే ఆకలితో చచ్చిపోయాడు.

**** (*) ****

మూలం: The black sheep by Italo Calvino
అనువాదం: స్వాతికుమారి బండ్లమూడి

http://vaakili.com/patrika/?p=12766

ఒక ఫోన్ కాల్ – డొరోతీ పార్కర్

దేవుడా దేవుడా, అతను నాకు ఫోన్ చేస్తే బాగుండు. పోనీ నేనే చేస్తే? నిజంగా ఇంకెప్పుడూ నిన్నేం కోరుకోను, నిజ్జం. భగవంతుడా…ఇదంత పెద్ద కోరిక కూడా కాదు, నీకిది చాలా చిన్నది. చాలా చాలా చిన్నది. దేవుడా అతను ఫోన్ చేసేలా చూడు. ప్లీజ్ ప్లీజ్.ఒకవేళ నేను ఈ సంగతి ఆలోచించకపోతే ఫోన్ మోగుతుందేమో. అవును, కొన్నిసార్లు అలాగే ఔతుంది. పోనీ వేరే ఏదైనా విషయం గురించి ఆలోచిస్తే? ఐదైదు అంకెలు వదుల్తూ ఐదొందలు లెక్కపెట్టుకుంటా, నిదానంగా. లెక్క పూర్తయ్యేసరికి మోగొచ్చు. అన్ని అంకెలూ లెక్కపెడతా, ఏదీ వదలను. మూడొందలు లెక్కపెట్టేశాక మోగినా కూడా లెక్క ఆపను. ఐదొందలూ పూర్తయ్యేదాక ఫోన్ మోగుతూ ఉన్నా ఎత్తను. ఐదు, పది, పదిహేను, ఇరవై, ఇరవై ఐదు, ముప్ఫై. అయ్యో, ఇంకా రింగవదే?

ఇంక ఇదే చివరిసారి. గడియారం వంక చూడను. ఇంకోసారి చూస్తే ఒట్టు. ఇప్పుడు ఏడు పది ఐంది. అతను ఐదింటికే కాల్ చేస్తానన్నాడు. “ఐదింటికి ఫోన్ చేస్తాను బంగారం.” అప్పుడే అనుకుంటా “బంగారం” అంది. నాకు బాగా గుర్తు. ఖచ్చితం అప్పుడే . ఆ మాట రెండుసార్లన్నాడు. రెండోసారి గుడ్ బై చెప్పేటప్పుడు. “గుడ్ బై బంగారం” అని కూడా.

అప్పుడతను చాలా పనిలో ఉన్నాడు. ఆఫీస్ లో అంతకంటే ఏం చెప్పగలడు. ఐనా కూడా రెండుసార్లు అలా పిలిచాడు. నా అంత నేను ఫోన్ చేసినా అతనేం అనుకోడు. కానీ, అలా ఎప్పుడంటే అప్పుడు చెయ్యకూడదు. మగవాళ్లకి అలా చేస్తే నచ్చదు. నువ్వు వాళ్ల గురించే ఆలోచిస్తున్నావనీ, తపించిపోతున్నావనీ తెలిసిపోతుంది. అప్పుడు నువ్వసలు నచ్చడం మానేస్తావు. కానీ… నేనతనితో మాట్లాడి మూడురోజులైంది. మూడు రోజులు. ఇంతాచేసి, నేను చేసింది, అతడెలా ఉన్నాడో కనుక్కోవడమే. వేరే ఎవరైనా ఐతే ఎలా అడుగుతారో అచ్చం అలానే. నేను విసిగిస్తున్నానని అతనేం అనుకుని ఉండడు. “అబ్బే, అదేం లేదు.” అన్నాడు కూడా. మళ్ళీ అతనే అన్నాడు నాకు ఫోన్ చేస్తానని. అతను అలా అనాల్సిన అవసరం లేదు. పైగా నేనూ ఏం అడగలేదు కూడా, అస్సలంటే అస్సలు అడగలేదు. అతను ఫోన్ చేస్తానని మాటిచ్చి చెయ్యకుండా ఉండేమనిషి కాదు. దేవుడా, అతన్ని మర్చిపోనివ్వకు.

“ఐదింటికి కాల్ చేస్తాను బంగారం.” “గుడ్ బై బంగారం.” అతను చాలా బిజీ, చుట్టూ మనుషులు, హడావిడి. ఐనా కూడా అతను నన్ను రెండు సార్లు “బంగారం” అని పిలిచాడు. అది నాదే. ఆ పిలుపు నాదే. మళ్ళీ అతన్నెప్పుడూ చూడకపోయినా ఫర్లేదు. ఊహూ… చాలదు. ఒకవేళ నేనతన్ని మళ్ళీ చూడలేకపోతే, మిగాతావి ఎన్నున్నా చాలదు. దేవుడా, నాకతను కావాలి. అతను కావాలి. దేవుడా, నేను మంచిగా ఉంటాను, ఇదివరకటికంటే బాగుంటాను. అమ్మతోడు. నువ్వొక్కసారి అతనితో ఫోన్ చేయించు. అయ్యో, ఒక్కసారి, ఒక్క ఫోన్ కాల్.

దేవుడా, నా కోరికని మరీ అంత తీసిపారెయ్యొద్దు. అక్కడెక్కడో దేవతల మధ్య నువ్వు, గంభీరంగా, ధవళకాంతితో వెలిగిపోతూ ఉంటావు. నక్షత్రాలు నీ చుట్టూ దోగాడుతూ ఉంటాయి. నేనేమో నీ దగ్గర ఒక చిన్న ఫోన్ కాల్ కోసం సాష్టాంగపడుతూ ఉంటాను. అదిగో, నవ్వుతున్నావ్. చూడు, ఇదంతా నీకర్థం కాదు. నీకేం, నువ్వు భద్రంగా నీలికాంతి వలయాల మధ్యన నీ సింహాసనం మీద ఉంటావు. నిన్నేదీ తాకదు, నీ హృదయాన్నెవరూ బాధతో మెలిపెట్టలేరు. ఇదెంత నరకమో! ఈ బాధ, చెప్పలేనంత బాధ. నువ్వు నాకు సాయం చేస్తావుగా? నిన్ను ప్రార్థించి ఏం కోరుకుంటే అది జరుగుతుందని చెప్తారుగా. అతన్నొక్కసారి నాకు ఫోన్ చేసేలా చూడవా?

ఛా, నేనిలా ఉన్నానేంటి? ఇలా ఉండకూడదు. సరే, ఇంకోలా అనుకుందాం. ఒక కుర్రాడు ఒకమ్మాయికి ఫోన్ చేస్తానని చెప్పి, అతనికేదైనా జరిగి కాల్ చెయ్యలేదనుకో. అమ్మో, దారుణం. మరీ అంత దారుణం కాదేమో, లోకంలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి- ఈ క్షణంలో కూడా. ఐనా లోకానికి ఏమైతే నాకెందుకు? నాకా ఫోన్ రింగయితే చాలు. యే? ఎందుకని మోగదు? ఒసేయ్ నల్లగా, తుమ్మమొద్దులా, ఏడుపుగొట్టు మొహమా, ఎందుకు మోగవు? కాస్త మోగితే నీ సొమ్మేవైనా పోయిందా? అరిగిపోతావా? నిన్ను.. నిన్నేం చేస్తానో చూడు. ముక్కలు ముక్కలు చేసి గోడవతల పారెయ్యకపోతే అడుగు.

అబ్బా! నేనింకేదైనా ఆలోచిస్తే బాగుండు. అదే చేస్తా. ఈ గడియారాన్ని పక్క గదిలో పడేసొస్తా. టైం చూడాలనిపించినప్పుడల్లా ఆ గది దాకా నడవలేక ఊరుకుంటానేమో. ఏమో, నేను మళ్ళీ టైం చూసేలోగా అతను కాల్ చేస్తాడేమో. అప్పుడు నేను చక్కగా మాట్లాడతాను. అతను ఒకవేళ ఫోన్ చేసి ఈ రాత్రికి కవలడం కుదర్దని చెప్తే నేనంటాను- “అయ్యో, భలేవాడివే, ఈమాత్రం దానికేనా?.” అతన్ని మొదటిసారి కలిసినప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. అప్పుడతనికి మళ్ళీ నచ్చుతాను. నేనసలు మొదట్లో ఎంత చక్కగా ఉండేదాన్నో అతనితో. హూఁ! ప్రేమించకముందు ఎవర్తో ఐనా బాగానే ఉండొచ్చు.

అతనికి నేనంటే కొద్దిగా ఐనా ఇష్టం ఉండే ఉంటుంది. లేకపోతే రెండు సార్లు “బంగారం” అనెందుకు పిలుస్తాడు? నేనేం ఆశ వదులుకోను. కొద్దిగా, ఇంతైనా, ఒక్క రవ్వంతైనా ఇష్టముంటే చాలు. దేవుడా, నువ్వు గనక అతనితో ఫోన్ చేయించకపోతే, నేనింక నిన్ను అడగాల్సిందేం లేదు. నేనతనితో ఇష్టంగా, ముద్దుగా, హాయిగా మాట్లాడతాను, అచ్చం మొదటిసారి లాగే. అప్పుడతను మళ్ళీ నన్నిష్టపడతాడు. అప్పుడెలానూ, నేను కోరుకోవాల్సింది ఇంకేం మిగలదు. అర్థమౌతుందా? దేవుడా, ప్లీజ్ ప్లీజ్, ఒక్కసారి ఫోన్ చేయించు.

నేను చెడ్దదాన్నని శిక్షిస్తున్నావా? నేనాపని చేశానని కోపమొచ్చిందా? చుట్టూ బోల్డంతమంది చెడ్దవాళ్ళున్నారు. నాకొక్కదానికే ఎందుకీ శిక్ష? ఐనా నేను చేసింది అంత పెద్ద తప్పేం కాదు. నేనెవర్నీ బాధపెట్టలేదు. వేరే ఎవర్నైనా కష్టపెడితేనే అది నేరం. నేను ఏ మనిషికీ మనస్తాపం కలిగించలేదు. నీకు తెలుస్తూనే ఉందిగా? దేవుడా, మంచివాడివి కదూ, అతనికి ఫోన్ చెయ్యమని చెప్తావు కదూ?

ఇదిగో, అతను గనక నాకు ఫోన్ చెయ్యకపోతే నీకు నామీద కోపమొచ్చినట్టే అర్థం. నేను ఐదైదు అంకెలు వదుల్తూ ఐదొందలు లెక్క పెడతాను. ఈలోగా అతన్నుంచి ఫోన్ రాకపోతే నువ్వు నన్నిక పట్టించుకోవని అర్థం. ఎప్పటికీ . అదొక అపశకునం. ఐది, పది, పదిహేను, ఇరవై, ఇరవై ఐదు, ముప్ఫై, ముప్ఫై ఐదు, ఇది అన్యాయం, చాలా అన్యాయం. సరే, మంచిది, నేను నరకానికి పోతాను. నరకాన్ని చూపించి నన్ను భయపెడుతున్నావు కదా. నా నరకం కంటే అది భయంకరమా?

చ చ.. ఇలా అనుకోకూడదు. అతనికి కాస్త ఆలస్యం అయుండొచ్చు. అందుకని నేనింత పిచ్చెక్కిపోనవసరం లేదు. బహుశా అతను కాల్ చెయ్యకుండా సరాసరి వచ్చేస్తాడేమో! అతనొచ్చేటప్పటికి ఇలా ఏడుపుమొహంతో ఉంటే అతనికి కోపమొస్తుంది. అట్లా ఏడిస్తే మగవాళ్లకు నచ్చదు. అతనెప్పుడూ ఏడవడు. అతన్నేడిపించాలి. బాగా ఏడిపించి అతని గుండె బరువెక్కి గొంతుకడ్డం పడితే చూసీ చూడనట్టు వెళ్ళిపోవాలి. విపరీతంగా ఏడిపించాలి.

అతను మాత్రం నన్ను ఏడిపించాలనుకోడు. అసలు తనకోసం నేనెంత అల్లాడిపోతున్నానో అతనికి తెలీదు. నేను చెప్పకుండానే అతనికి తెలిస్తే బాగుండు. వాళ్లవల్ల ఏడ్చామని చెప్తే మగవాళ్లకి నచ్చదు. అట్లా చెప్తే మొండికేసి సాధిస్తున్నామని, పెత్తనం చేస్తున్నామనీ అనుకుంటారు. మనమీద చిరాకొస్తుంది. అనుకున్నది అనుకున్నట్టు చెప్తే వాళ్లకి చిరాకొస్తుంది. వాళ్లతో ఎప్పుడూ కాస్త దోబుచులాడుతూ ఉండాలి. ఏంటో, ఇంత నాటకం అవసరమా? ఏదనిపిస్తే అది చెప్పెయ్యలేమా? ఉన్నదున్నట్టు చెప్పలేనంత పెద్ద విషయమా. అసలే విషయమైనా దాచాల్సినంత పెద్ద విషయమా? అతనొకవేళ ఫోన్ చేస్తే నేనతనికోసం దిగులు పడుతున్నానని చెప్పను. వాళ్లకి దిగులుగా ఉంటే నచ్చదు. అతను ఫోన్ చేసినప్పుడు నేను కులాసాగా, హాయిగా ఉంటాను, అప్పుడతను చచ్చినట్టు ఇష్టపడతాడు. అతను ఫోన్ చేస్తే… అతను ఫోన్ చేస్తే…

బహుశా అతనదే చేస్తూ ఉండొచ్చు. నాకు చెప్పకుండానే ఇక్కడికి బయల్దేరిపోయాడేమో. ఇప్పుడు దారిలో ఉండుంటాడు. దారిలో ఏమైనా అయిందేమో. లేదు, అతనికెప్పుడూ ఏమీ అవదు. ఏమైనా జరిగినట్టు ఊహించలేను. అతనికేదైనా జరిగి కదలకుండా పడిపోయి ఉండటం ఊహించలేను. అసలతను చచ్చిపోతే బాగుండు. ఏంటీ పాడు కోరిక? కాదు కాదు, ఎంత మంచి కోరికో! అతను చచ్చిపోతే అచ్చంగా నాకే ఉండిపోతాడు. అప్పుడు అతని గురించి బాధపడ్డ ఈరోజులన్నీ మర్చిపోగలను. మంచి రోజులను మాత్రమే గుర్తు పెట్టుకుంటాను. ఇక ఏ దిగులూ ఉండదు. నిజంగా అతను చచ్చిపోతే బావుండు. చచ్చిపోవాలి. చచ్చిపోవాలి.

చెత్తగా ఉంది. ఎవరైనా ఫోన్ చేస్తానని చెయ్యకపోతే, మరుక్షణంలోనే వాళ్ళు చచ్చిపోవాలని కోరుకుంటారా ఎక్కడైనా? అసలీ గడియారం సరిగ్గా పనిచేస్తున్నట్టు లేదు. తొందరగా తిరిగేస్తుందేమో. అసలు అతను చెప్పిన టైం ఇంకా అవ్వలేదేమో. ఏదైనా పనిలో పడి కాస్త లేటయిందేమో. ఇంకా ఆఫీస్ లోనే ఉన్నాడేమో. లేకపోతే ఇంటినుంచి ఫోన్ చేద్దామని ఇంటికెళ్లాడేమో. ఈలోపు ఎవరో వచ్చుంటారు. వాళ్ళెదురుగా నాకు ఫోన్ చెయ్యడం బాగోదని ఊరుకుని ఉంటాడు. పాపం నేను ఎదురు చూస్తున్నానని కంగారు పడుతున్నాడేమో. కాస్తైనా కంగారు ఉండే ఉంటుంది. ఒకవేళ నేనే ఫోన్ చేస్తానని ఎదురు చూస్తున్నాడేమో కూడా. నేనే చేస్తే పోలా?

ఊహూ. వీల్లేదు. నేను చెయ్యకూడదు. దేవుడా, నేనతనికి ఫోన్ చెయ్యకుండా చూడు. ఎలాగోలా నన్ను ఆపు. దేవుడా, నీకు తెలిసినట్టే నాక్కూడా తెలుసు. అతనికి ఏమాత్రం నామీద అక్కర ఉన్నా ఎక్కడో ఒకచోటనుంచి ఫోన్ చేసేవాడు . చుట్టూ ఎంతమందున్నా పట్టించుకునేవాడు కాదు. ఇంతచిన్న విషయం బుర్రలోకి ఎక్కదు నాకు. దేవుడా, నేనిదంతా తేలిగ్గా తీసుకునేలా చెయ్యడం నీకైనా కష్టమే. అదంతా ఏమొద్దుగానీ, ఈ చిన్న విషయం నా బుర్రకెక్కేలా చూడు. ఇంక ఆశలు పెట్టుకోకుండా, నాకు నేను నచ్చజెప్పుకోకుండా చూడు. నన్ను ఆశపడనీకు. దయచేసి…

నేనతనికి ఫోన్ చెయ్యను. ఈ జన్మలో, నా గొంతులో ప్రాణముండగా. నేనతనికి కాల్ చేసేలోపు అతను నరకంలోపడి అనుభవిస్తూ ఉంటాడు. దేవుడా, నాకు కొత్తగా నువ్వు ఏ బలాన్నీ ఇవ్వక్కర్లేదు. తట్టుకోడానికి నాకున్న శక్తి చాలు. నేను కావాలనుకుంటే అతడే నన్ను వెతుక్కునేవాడు. నేనెక్కడుంటానో అతనికి తెలుసు. నేను కచ్చితంగా ఎదురుచూస్తానని కూడా తెలుసు. తెలుసతనికి, అనుమానం లేదు. తనకోసం ఎదురు చూస్తానని, తనకోసమే ఉంటానని తెలీగానే ఎందుకింత అలుసో? నిజానికి అలా ఎదురు చూసే మనిషి ఉండటం, ఆ భరోసా ఉండటం ఎంత హాయినిచ్చే విషయం?

నేను కావాలనుకుంటే ఉన్నపళాన అతనికి ఫోన్ చెయ్యొచ్చు. అసలేమైందో తెలుస్తుంది. నేనే ఫోన్ చేస్తే తప్పేం లేదు. అతనేం అనుకోడులే. పైగా సంతోషపడతాడు కూడా. నాకోసం ప్రయత్నిస్తున్నాడేమో. ఒక్కోసారి పదే పదే ప్రయత్నించాల్సొస్తుంది ఫోన్ చెయ్యడానికి. నంబర్ పని చెయ్యట్లేదనో, పలకట్లేదనో ఏదో సమాధానమొస్తుంది. నచ్చజెప్పుకోడానికి కాదు. నిజంగా చాలాసార్లు అట్లా అవుతుంది. దేవుడా, నిజంగా. నన్నా ఫోన్ నుంచి ఇవతలికి లాగి పడెయ్యి. కాస్త నా అభిమానం నాకు మిగలనీ. నాకేమాత్రం సిగ్గున్నా అది ఇప్పుడే అడ్డుపడాలి.

ఇంతలా ఓర్చుకోలేనప్పుడు అభిమానాన్ని పట్టుకు వేలాడితే ఏం లాభం? అదొక పనికిమాలిన మాట. అసలు అభిమానం లేకపోవడమే నిజమైన గౌరవం మనిషికి. అతనితో మాట్లాడ్డానికి ఈ సమర్థన చేసుకోడం లేదు. ఇది నిజం. ఎప్పుడూ నిజమే. ఈ చిన్న చిన్న మర్యాదల్ని వదిలేసి నేను ఎదగాలి.

దేవుడా! నేనతనికి ఫోన్ చెయ్యకుండా నన్నుఆపు.

ఐనా ఇంతోటి దానికి అభిమానం, మొహమాటం అవసరమా? ఇంత నాన్చడం, నీలగడం, ఇంత చిన్న విషయానికి? అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నానేమో. ఒకవేళ అతనే నన్ను ఐదింటికి ఫోన్ చెయ్యమని చెప్పాడేమో! “ఐదింటికి ఫోన్ చేస్తావుగా బంగారం?” అనుంటాడు. నిజమే, అలాగే అన్నాడు. దేవుడా. ఆపెయ్. నన్ను నేనే ఇంకా మభ్యపెట్టుకోనివ్వకు. ఉన్నదున్నట్టు ఒప్పుకోనీ.

నేనింకేదైనా ఆలోచిస్తా. నిశ్శబ్ధంగా కూర్చుంటా. కదలకుండా, ఏ ఆలోచనా లేకుండా, కూర్చోగలిగితే! ఏదైనా చదువుకుంటే నయం. ఈ పుస్తకాలన్నిటిలో ప్రేమ కథలే. స్వచ్ఛ మైన, మధురమైన ప్రేమకథలు. ఈ రాసేవాళ్లంతా ఇలాంటి కథలెందుకు రాస్తారో. ఇదంతా పచ్చి అబద్ధమనీ, మోసమనీ తెలియకనా? చదివేవాళ్లని అవెంత బాధ పెడతాయో తెలీదా వీళ్లకి? చెత్త రాతలు. చెత్త వెధవలు.

ఇంకేమీ చెయ్యను. మెదలకుండా ఉంటాను. అంత అతిగా ఇదవ్వాల్సిందేం లేదు. ఇదిగో, అతను గనక నాకు బాగా తెలీదనుకో. అతను మగవాడు కాకుండా ఒక అమ్మాయనుకో. అప్పుడు ఎంచక్కా ఫోన్ చేసి “ఏమైందోయ్. బానే ఉన్నావా?” అని తేలిగ్గా అడిగేదాన్ని. అసలు దాని గురించి ఇంత సతమతమయ్యేదాన్నే కాదు. అందరితో లాగా అతనితో కూడా మాముూలుగా, తేలిగ్గా ఎందుకుండలేను? అతన్ని ప్రేమించినందుకా? ఎందుకుండలేను? ఉండగలను. కావాలంటే ఇప్పుడే ఫోన్ చేసి చాలా మాములుగా హాయిగా మాట్లాడతా. అలా మాట్లాడలేకపోతే చూడు. దేవుడా, వద్దు. అతనికి ఫోన్ చెయ్యనివ్వద్దు. వద్దు.

దేవుడా, నువ్వు నిజంగా అతనితో ఫోన్ చేయించవా? అంతేనా? నీ మనసేం కరగదా? కనికరం లేదా? ఈ నిమిషంలోనే చెయ్యమని కాదు. కాసేపట్లో చేసినా ఫర్లేదు. ఐది ఐదు వదుల్తూ ఐదొందలు లెక్క పెడతాను. నిదానంగా, తొండి చెయ్యకుండా లెక్క పెడతాను. ఈలోగా అతను పలకరించకపోతే నేనే పలకరిస్తాను. దేవుడా, మంచివాడివి కదూ! గొప్పవాడివి కదూ! ప్లీజ్, ప్లీజ్. దేవుడా…

ఐదు, పది, పదిహేను, ఇరవై, ఇరవై ఐదు, ముప్ఫై, ముప్పై ఐదు.

**** (*) ****

Translated by: Swathi kumari . B
Original: A Telephone Call by Dorothy Parker – http://www.classicshorts.com/stories/teleycal.html

http://vaakili.com/patrika/?p=14889

టూఎయిటీన్ డీ

“అమ్మయ్య, ఈ బస్సుకోసమే ఇంతసేపూ కాచుక్కూచున్నానండీ. ఇంతకు ముందు టూట్వెంటీవన్ వచ్చింది కానీ దానికి ఏసీ లేదు.”

“సార్, అది ఇండియనెక్స్‌ప్రెస్సేనా? ఏదీ వోసారి జస్ట్ హెడ్‌లైన్స్ చూసిచ్చేస్తాను.”

“అహహ, టికెట్ వెనక రాయొద్దు, నేనెప్పుడూ ప్రాపర్ చేంజ్ క్యారీ చేస్తాను.”

“ఐతే కంట్రోల్ రూమ్ దగ్గర దిగిపోయి ఆటో పట్టుకుంటే సరిపోతుందిగా?”

“అంతే అంతే.”

హలో అక్కా! వియ్ లవ్ రేడియో మిర్చీ!

“లేదొదినా, అమ్మాయీ ఐటీనే. అమెరికాలోనే లోనే చేసుద్ది. ఐనా ఆడదాని ఉద్యోగాన్దేముందిలే వదినా. రేపే కడుపో కాలో వస్తే…”

“మనావోళ్ళే ఇరవయ్యారు లక్షలకి కొనేశారు. డెడ్డు చీపన్నమాట. ఇప్పుడా యేరియాలో స్క్వేరుయార్డొచ్చి ఎంతనుకున్నావ్?”

“మా… మీ… నాన్న పోదాం.”

“వెళ్దాం కన్నా. రెండ్రోజులు… అమ్మకి పనుంది కదా.”

“ఊఁ… ఊఁ… నా… న్నా…”

హాబీసంటే వాచింగ్ టీవీ. చాలా సార్లు ట్రై చేస్తామక్కా, ఇవ్వాళే ఫస్ట్‌టైమ్ కలిసింది. అక్కా, మా ఫేవరెట్ సాంగ్ ఒకటి ప్లే చెయ్యరా! ప్లీజ్!

“పెళ్ళికూతురి చీరలు కంచిలోనే తీస్తన్నాం. డబల్నేత లేకపోతే అసలు బాగోదు. ఏదో పిల్ల కన్నూ ముక్కూ బావుందనే కానీ వాళ్ళిచ్చిన డబ్బుల్తో ఏమొచ్చుద్దొదినా? ముష్టి…”

“పండూ, ఏడవకమ్మా! జెమ్స్ ఇవ్వనా? అదిగో ఆ బ్లూ కార్ చూడు!”

“ఊఁ… ఊఁ… బ్లూ కార్… ఊఁ… బ్లూ నాకొద్దూ… నాన్నా…”

“టెన్నియర్సుగా ఉన్నా ఈ ఫీల్డులో. ఆరోజేంటన్నావ్? ఔటుస్కర్ట్సు అనా? మరిప్పుడు చూడు, అటేపెల్తే అసలా రేట్లకి చుక్కలు, చుక్కలు కనిపిస్తయ్! ఇంక ఆ ఫ్లయోవరు గానీ ఎప్రూవు ఐపోయిందనుకో…”

“ఏం చేస్తావే? అంకుల్ నన్నడిగారు ప్రవీణ్ గురించి.”

“అదేనే భయం. తెలిసిపోతే కాలేజ్ మానెయ్యమంటారు. అస్సలు నచ్చవు ఇలాంటివి. రెండ్రోజులు అన్నం మానేస్తే అమ్మ వింటది కానీ, అమ్మో, డ్యాడీ, ఇదివరికి చూశాగా, అన్నయ్యని బెల్ట్ తో…”

“మరి? వదిలేస్తావా!”

“ఆఁ… ఏమో. ఐనా వాడు అంత సీరియస్సంటావా? ఊర్లో మరదలుందన్నాడు ఒకసారి.”

గాల్లో తేలినట్టుందే గుండే పేలినట్టుందే
తేనేపట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే…

“పెళ్ళి మాత్రం గ్రాండుగా చేయమన్నాం. దానికే ఏడిచ్చస్తన్నారు. మనకి సిటీలో ఫ్లాటు, గోల్డూ అదీ బాబే తీశాడు. బాబుకిప్పుడు గ్రీన్‌కార్డ్ కూడా వుందిగా వొదినా.”

“మామీ… అమ్మమ్మా ఇంట్లో ఏసీ లేదుగా. వెళ్ళొద్దూ… ఊఁ… నాన్న పోదాం…”

“ఉఫ్, కన్నా! వెళ్తాం నాన్నా. ఊరుకోవూ? ఇదిగో జెమ్స్, అమ్మకి నీరసం రా.”

“వాడికే లేంది నీకేంటే అంత ఇది. లైట్ తీస్కో.”

“కానీ, బావుంటాడు కదే? అచ్చం…”

“ఊర్లో పొలాలుంటే ఎవడికంటా? అహఁ, ఇంత పొజిషన్లో ఉన్నావా?! సిటీలో విల్లా ఉండకపోతే… ఏంటి, విన్నావా? మనలాగా మనపిల్లలు కూడా మిడిలు క్లాసు లాగా… బాగోదు. చెప్తున్నా అని కాదు. థింక్ చెయ్యి.”

“అంతగాక ఎంతలే వదినా. ఐనా అందం కొరుక్కుతింటామా పాడా? ఎంత పెట్టుబడి పెట్టాం వాడి మీద! నీకు తెలుసుగా వదినా? ఎవర్తో అనకు గానీ వాళ్ళు ముందే నెట్లో చూసుకున్నారు. ఏదో గుట్టుగా కానివ్వడమే, కన్నవాళ్లకి తప్పదుగా. ఎంతైనా మనం చూసిన పిల్లయితే ఒద్దికా అదీ చూసుకోమా?”

“మా…మీ… నా… నా…”

“పోదాం రా. పోదామని చెప్పాగా. ఇక పడుకో కాసేపు.”

ఐఐటీ ఫలితాల్లో మొదటి మూడు రాంకులే కాక వందలోపు పది రాంకులతో దూసుకెళ్తున్న …

“కొత్త వెంచర్సున్నయ్. సండే కలుద్దాం, ఫ్రీయేగా. ఇంకా బయటివాళ్లకి తెలీదు. మనోడివని చెప్పటమే. రేపు పేపర్లో వచ్చాకా నీకీ రేటుకి దొరికితే నీ చెప్పుచ్చుకుని…”

“మరి ఇంట్లో చెప్పావా?”

“అమ్మో, డాడీ చంపేస్తారు. ఇంటర్ కాస్ట్ అంటే అసలొప్పుకోరు.”

“మరి వదిలెయ్యవే, చెప్పనా వాడికి ఇంట్లో ప్రోబ్లెమ్ అని?”

“మోనీ, ఒకటి చెప్తా, ప్రామిస్ చెయ్, ఎవరికీ చెప్పకూడదు.”

“ప్రామిస్, చెప్పవే ఏంటో?”

“లాస్ట్ మంత్ అరకు వెళ్ళాంగా, ఆ ట్రిప్‌లో సత్య ప్రపోజ్ చేశాడు. ఏం చెప్పనే? ఏంటో, టెన్షన్‌గా ఉంది.”

“ఓ! సత్యా?! ఆరోజు బస్ వెనక చీకట్లో తనతో… అది నువ్వేనా?”

“ఏంటీ? కాలేజ్‌లో తెలిసిపోయిందా? వద్దన్నాను. నైట్ కదా! చీకట్లో ఎవరూ చూడరని… చున్నీ కప్పేసుకుని…”

“…సినిమా పేరు కరక్ట్‌గా గెస్ చేసి బిగ్ బజార్ నుంచి టెన్ థౌజండ్ రుపీస్ గిఫ్ట్ వోచర్ గెల్చుకున్న….”

“హ్మ్… సరే… చూద్దాం, మిసెస్‌తో ఒకసారి చెప్తాను, ఆదివారం రండి అలాగే.” (కళ్ళజోడు తుడుచుకుంటూ)

“ఊఁ.. అంతా ఉత్తిదే. ఊఁ… నానా నువ్వూ కొట్టుకునీ… ప్లే..టులు.. ఇసిరే..సీ.. బజ్జునీ… చూశాగా… (ఎక్కిళ్ళు)

“వీప్పగలకొడతా, నోర్మూస్కోని పడుకో కాసేపు. పీక పిసికి చంపేయండ్రా నువ్వూ నీ నాన్నా నన్ను. నా ప్రాణానికి తగులుకున్నారు. దిక్కుమాలిన సంత. చచ్చినా బాగుణ్ణు.” (చేతుల్లో మొహం, మొహంలో ఏడుపు)

“ఆ ఇంగితం వాడికుండొద్దొదినా? పిల్లల్ని కంటాం కానీ, రాతల్ని… (చీరచెంగుతో మొహం ఒత్తుకుంటూ)

“ఊరుకో వదినా. నువ్వెంత కష్టపడి పెంచావో నాకు తెలీదా. మీ అన్నయ్య ఎప్పుడూ అంటారు, రాజిలాగా పెంచాలి పిల్లల్నీ అనీ.” (భుజం మీద చెయ్యేస్తూ)

“అమ్మో, ఇంట్లో తెలిసిపోతే? డ్యాడీ ఇరగదీస్తారు.” (సెల్లో టెక్స్ట్ చూసుకుంటూ)

రామకృష్ణ గారూ, కంగ్రాట్స్! … రోజూ వింటారా మా ప్రోగ్రామ్? వావ్, థాంక్సండీ. మీ ఫామిలీకి, ఫ్రెండ్స్‌కీ, రేడియో మిర్చి నుంచీ నానుంచీ…

“టెన్ కాదండీ, ట్వెంటీ ఇచ్చా, మీరు చూళ్లేదు. ఈ పాప కూడా అప్పుడే ఎక్కింది, అడగండి.”

“మాస్టారూ! నా స్టాపొచ్చింది. పేపరిస్తారా?”

“అంటే… మీరూ ఇంకోలా కూడా చెయ్యొచ్చు. ఆబిడ్స్ దాకా వెళ్ళిపోయి ఇంకో బస్ తీసుకుని తిన్నగా స్టేషన్‌కి…”

చెరువు – చింతచెట్టు

మరి- బాగా ఎండల్లో, నడి వేసవిలో ఎండిపోయిన చెరువులో సాయంత్రాలు పిల్లలంతా చేరి ఈలేస్తే అంటుకునే ఆట, చప్పట్లు కొట్టి పరిగెత్తే ఆట ఆడుకుంటారు కదా, ఇంట్లో తిడతారనే భయమున్న పిల్లొకత్తి పీచుపీచుగా మసక రాగానే తొందరగా ఇంటికి బయల్దేరుతుంది కదా, దాదాపు ఆ వేళప్పుడే వచ్చాడు వాడు. దుబ్బు గడ్దం, ఒత్తు జుట్టు, మురికి బట్టలూ, ఆ అవతారమూ; ఏ దిక్కునుండి, ఏ వూరి నుంచి వచ్చాడో ఎవరూ చూడలేదు. పాతగుడ్దతో కట్టిన మూటొకటి చంకన పెట్టుకుని ఆడుకునే పిల్లల మధ్యకి ఈలలేసుకుంటూ చప్పట్లు కొడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. మట్టిదిబ్బ మీద మూట విసిరేసి “రండ్రా! నన్నంటుకోండి చూద్దాం” అని వాళ్ల మధ్య వడగాలిలా అటూ ఇటూ గెంతాడు. “అమ్మో! పిచ్చోడు” అని గట్టుమీదకి పారిపోయారు వాళ్ళు. “పోరా పిచ్చెదవా” అనరిచాడు ఒక పెద్ద పిల్లాడు కాస్త ధైర్యంగా. “ఓయ్, ఉరేయ్… నా పేరెవడు చెప్పాడ్రా నీకు? బలే, బలే” అని పెద్దగా నవ్వాడు పిచ్చాడు, బయమేసేలా కాదు నవ్వొచ్చేలా నవ్వుతాడు వాడు, కితకితలు పెడితే మెలికలు తిరిగినట్టు వంకర్లు పోతూ ఇహ్హిహ్హి అని. నవ్వితే వాడి కళ్ళ పక్కన వదులుగా ఉన్న చర్మం గీతలుగా ముడతలు  పడుతుంది. “మళ్లీ రేపు రండి. రారూ? హిహి” అనుకుంటూ తలకింద మూట వొత్తుగా పెట్టుకుని కాలిమీద వేసుకున్న కాలు ఊపుతూ ఆ ఎండిన చెరువులో పైకి చూస్తూ పడుకున్నాడు. పిల్లలు బెదిరిపోయి ఎటు వాళ్లటు ఇళ్లకెళ్ళిపోయారు.

అది మొదలు వాడా చెరువుని వదల్లేదు. మిట్టమధ్యాహ్నం రాళ్ళు రాజుకునే ఎండప్పుడు మాత్రం చెరువొడ్డున చింతచెట్టు కిందకి చేరేవాడు. ఎవర్నీ ఏమీ అనడు, పొమ్మంటే పోడు, తిడితే నవ్వుతాడు, గట్టిగా బెదిరించి పొమ్మని కర్ర చూపిస్తే ఇంకా పెద్దగా నవ్వుతాడు. మెల్లగా పిల్లలు అలవాటు పడిపోయారు, నాల్రోజులకి వాళ్ల ఆటల్లో చేర్చుకున్నారు కూడా. పిచ్చోడిది చువ్వలాంటి ఒళ్ళు, చురుకైన నడక, తూనిగలాగా ఎటైనా దూరిపోయి పరిగెడతాడు కానీ చచ్చినా అంటుకోడానికి చిక్కడు. జట్టులుగా ఆడేటప్పుడు వాణ్ణి తమలో చేర్చుకోడానికి రెండు జట్ల పిల్లలూ పోటీ పడేవాళ్ళు. పిల్లలకిష్టంగా ఉన్నాడు కదాని పెద్దాళ్ళు కూడా వాణ్ణేం అనలేదు. ఆ చెట్టుకింద వాడే పడుంటాడులెమ్మని వదిలేశారు.

పిల్లలు లేనంతసేపూ వాడేం చెయ్యడు, అట్లా ఖాళీగా చెరువులోనో చెట్టు కిందో తిరుగుతూనో పడుకునో ఉంటాడు. చింతచెట్టు పక్కన పసుపురాయికి ఎవరైనా బొట్టుపెట్టి ఒక కొబ్బరిముక్కో, అరటి పండో అక్కడ పెట్టెళ్తే తింటాడు. పిల్లలు  ఆటలకొచ్చినప్పుడు అటుకులో, మరమరాలో తెచ్చిస్తే ఆకుల్లో పొట్లాం కట్టుకుని రాత్రికి దాచుకుంటాడు. “పిచ్చోడా! ఏం తిని బతుకుతావురా? పనిస్తా చేస్తావా” అని ఎవరైనా జాలిగా అడిగితే “పోరా! పనికిమాలినోడా, పని చెప్తే తంతా, తంతే నవ్వుతా” అని మళ్లీ కితకితలుగా నవ్వుతాడు.  రాత్రైతే మాత్రం హుషారుగా గొంతెత్తి పాడుకుంటాడు చాలాసేపు. ఏమాటకామాట, వాడిగొంతు భలే సన్నగా, కాస్త ఆడగొంతులా మెత్తగా ఉంటుంది. వినసొంపుగా ఉంటుంది కానీ ఆ పదాలకి అర్థం పాడూ ఏముండదు. ఏ మాట గుర్తొస్తే, ఎదురుగా ఏది కనిపిస్తే ఆ పేర్లన్నీ కలిపేసి, ఒక్కోసారి మధ్యలో ఆపి “ఊహుహు,  రాళ్ళురప్పలు కాదు, మొద్దురాచిప్పలు, బాగుంది.”అని కళ్ళు మూసుకుని మళ్ళీ పాడతాడు. అప్పటికి ఊరు సద్దుమణిగి సగంనిద్రలో ఉంటుంది. ఐనా పాటలెవరిక్కావాలి. దొంగలొస్తే కాపలాకుక్క అరుపులాగా, రావిచెట్లూ, వేపచెట్లూ ఊగినప్పుడు అర్దరాత్రి వాడి పాటలు కూడా.

***

ఆ ఏడాది మొదటి వానొచ్చింది. చెరువునొదిలి పిచ్చోడు అచ్చంగా చింతచెట్టు కిందే ఉంటున్నాడు. మళ్ళీ వానొచ్చింది. చెరువు నిండింది. బిందెలతో, కావిళ్లతో చెరువు నీళ్లకి వచ్చే జనంతో బాగా పొద్దుపోతుంది. వాన వెలిసిన ఒక రాత్రి వాడు ఎప్పటికన్నా ఎక్కువ సరదాగా రాత్రంతా పాడుకుని ఆగి ఆగి నవ్వుకుని ఎప్పటికో నిద్రపోయాడు.

అప్పటికింకా తెల్లారలేదు. ఎక్కడా ఏ చప్పుడూ లేదు. ఆ పొద్దుటి చీకటిలో పిచ్చోడెందుకో చప్పున లేచి చూశాడు. అనుకోకుండానే వాడి పాతబట్టల మూటని గట్టిగా గుండెకి అదుముకున్నాడు. ఎవరదీ అని కర్రపుల్ల తీసీ అటూ ఇటూ గాల్లో ఆడించాడు. కర్రకి మెత్తగా ఏదో తగిలింది. “బ్బా…” అనొక ఆడ గొంతుతో పాటు గజ్జెల చప్పుడూ గబగబా దూరమయ్యింది. అట్లా పోయేటప్పుడు వెళ్తున్న మనిషి బిందెలోంచి నీళ్ళు ఒలికిపోయి వాడు తడిసిపోయాడు. పిచ్చోడు నవ్వాడు. “బిందె వాన, గజ్జెల వాన” అని మళ్లీ మళ్ళీ అనుకుని మూట తలకింద సర్దుకుని మళ్ళీ పడుకున్నాడు.

రోజూ తెల్లారకముందే ఇదే వరస. ఎట్లానో నిద్రాపుకుని ఒకరోజు పట్టుకున్నాడు. “ఎవరే నువ్వు? నీ పేరేంటే?” అన్నాడు. ఆ పిల్ల భయంగా చూసింది. ఎంతడిగినా ఏం చెప్పదు. అది మూగదని తెలిసింది వాడికి. దానికో పేరు కూడా ఏం లేదు. ఐనా మూగదానికి పేరెందుకని ఎవరూ దానికి పేరు పెట్టలేదు. బిందెలో నీళ్ళు వాడి మొహం మీద చల్లి నవ్వేసి పోయింది. ఎవరూ లేవకముందే నీళ్లకోసమో, నీళ్లవంకనో కానీ వచ్చేదా పిల్ల. కాసేపు అక్కడ కూర్చునేది. వాడూ సరిగ్గా ఆ వేళకి ముందే లేచేవాడు. చాలా మాటలు చెప్పేవాడు. కొన్నిసార్లు ఏదైనా పాడేవాడు. ఆ పిల్ల చద్దన్నం తెచ్చి పెడితే పొద్దెక్కాక తినడానికి దాచుకునేవాడు. ఒక్కోసారెందుకో ఇద్దరూ కలిసి బాగా నవ్వుకునేవాళ్ళు, ఒకళ్ల మీదొకళ్ళు నీళ్లు చల్లుకునే వాళ్ళు. రాత్రి పూట చెట్లకింద రాలిన పూలేరి ఆమె రాగానే నీళ్ల బిందెలో వేసేవాడు. మిగతా వాళ్లలా మూగదానా అని పిలవటానికి వాడికి మనసు రాలేదు. “నువ్వు మంజులవి కదూ? “ అనేవాడు. దానికి నోరుంటే మిగతా వాళ్లలా వాడిని పిచ్చోడా అని పిలవదని వాడికి ఎట్లా తెలుసో కానీ తెలుసు.

ఒక్కోసారి మంజుల వాడి మూటని చూపించి అదేంటని సైగ చేసేది. వాడిక్కోపమొచ్చి కర్రపుల్ల తీసుకు విసిరేసేవాడు. నొప్పుట్టి ఏడ్చి వెళ్ళిపోయేది. అలా అలిగితే ఓ రెండ్రోజులు వాడికి కనపడకుండా ఎటునుంచో చెరువుకి వచ్చి వెళ్ళిపోయేది. కానీ ఉండబట్టలేక మళ్ళీ వచ్చేది. అట్లా అలిగి మళ్ళీ వచ్చినప్పుడల్లా పసుపురాయి దగ్గర పళ్ళు, పొట్లాల్లో అటుకులు చీమలు పట్టి ఉండేవి. కళ్లనీళ్ళు పెట్టుకునేది, వాడి భుజం మీద తట్టి నిద్రలేపేది. వాడు “కొట్టన్లే, రాకుండా ఉండకే మంజులా, ఆకలెయ్యట్లేదు” అని నవ్వేవాడు.

తెల్లారుతుంటే బిందెత్తుకుని బయల్దేరేది. ఒక్కోసారి చెయ్యి పట్టుకు ఆపేసేవాడు. “ఇంటికెందుకూ? ఉండిక్కడే” అనడుగుతాడు. ఇంట్లో తాత ఉన్నాడని, తాతకెవరూ లేరని , లేచి నడవలేడని సైగ చేసి చెప్తుంది. “సరే! ఫో, ఛీ, పనికిమాలినదానా, ఫో, మళ్లీ ఇటొచ్చావా కొడతా” అని చెయ్యొదిలేవాడు. అటూఇటూ తిరిగే జనాల్ని చూసి అది గబగబా వెనక్కి తిరక్కుండా వెళ్లిపోయేది. అలా వెళ్ళేప్పుడు కాలిపట్టీలు భలే గలగలమనేవి.

ఎన్నిసార్లో అట్లా. ఇంకెప్పుడూ రావద్దనడం, రాకపోతే కడుపు మాడ్చుకు పడుకోవడం, మళ్ళీ అదొచ్చాకా “ఏమనను, కొట్టను. తాత దగ్గరికే పో, నాతో ఉండొద్దులే, ఏడవకు. చద్దన్నం తినేదాకా ఉండిపో” అని బతిమాలడమూ. వాళ్లకదంతా ఒక ఆటలాగా, అలవాటులాగా అయింది.

ఒకరోజు పిచ్చోడికి హుషారెక్కువైంది. పెంకితనం ముదిరింది. ఎప్పట్లాగే వెళ్లొద్దని చెయ్యి పట్టుకు ఆపాడు. మంజుల ఆగలేదు, చెయ్యి విదిల్చుకుంది. వాడికి పంతం వచ్చింది. బిందె లాక్కుని నీళ్లన్ని దాని మీద కుమ్మరించాడు. దానికెందుకో చాలా ఎడుపొచ్చింది. కోపమొచ్చింది. వాడేమో ఏం చేసినా నవ్వుతాడాయె, వీణ్ణెట్లా ఎడిపించాలా అని అటూ ఇటూ చూసింది. వాడి మూట కనపడింది. గబుక్కున ఆ మూట తీసుకు అటూ ఇటూ పరిగెత్తింది. వాడసలే పరుగులో చురుకుకదా వెంటపడ్దాడు, మీదపడి కలబడ్డాడు. మూట ఊడిపోయింది. అందులోని వస్తువులన్నీ కింద పడిపోయాయి; కొన్ని రంగుల మట్టి గాజులు, ఒక పాత చీర, ఒక పూసల దండా, ఇంకా అట్లాంటివే ఏవో. మంజుల ఏం మాట్లాడలేదు. ఏమడగలేదు. నిదానంగా మళ్లీ    చెరువుకెళ్ళి నీళ్ళు ముంచుకుని వెళ్ళిపోయింది. పిచ్చోడూ ఏం మాట్లాడలేదు. ఏం తెలీనట్టు అలా చింతచెట్టుకింద అటు పక్కకి తిరిగి పడుకున్నాడు. చెదిరిపోయిన సామానంతా అలాగే వదిలేశాడు.

గొడవైతే కొన్నిరోజులు రాదుగా ఆ పిల్ల, కానీ ఈసారి వచ్చింది. తెల్లారేదాకా నీళ్లకోసం ఆగలేదు. ఆ రాత్రే, చీకట్లో తడుముకుంటూ చెట్టు వెతుక్కుంటూ వచ్చింది. వాడెప్పట్లాగే నవ్వుకుంటూ, పదాలు మార్చి మార్చి పాడుకుంటూ, చెట్టు మాను మీద దరువేసుకుంటూ ఉన్నాడు. “ఓ మంజులోయ్! దా దా, ఈ పూట బాగా తిన్నా, చుశావా? చీమలకి పస్తే” అని పెద్దగా నవ్వాడు. మళ్ళీ కాస్త ఆగాడు. “ఇదిగో చెప్తున్నా! ఎందుకొచ్చావో వచ్చావు. ఈ పూట వెళ్లావా, ఇక అంతే” అని అరిచాడు. అది కాసేపేం అనలేదు. తర్వాత సైగ చేసింది మణికట్టు చూపించి మెడ చూపించీ, చిరిగిన మూట చూపించీ.. అవన్నీ ఎవరివని అడిగింది. “ఎవరేంటే? పనికిమాలినదానా? ఈ ఊరికి రాకముందు ఎన్ని ఊర్లు తిరాగాను. నీకెందుకే మూగదానా?” అని మళ్ళీ జోరుగా పాటందుకున్నాడు. ఆ పిల్ల వెళ్ళిపోడానికి లేచింది. “ఇదిగో! చెప్పాను. ఈపూట వెళ్లావా! ఇక..” వాడి మాట పూర్తికాలేదు, వాడి రెండు చెంపలమీదా బలం కొద్దీ చాచికొట్టింది. చీకట్లో తడుముకోకుండానే పరిగెత్తి ఇంటికెళ్ళిపోయింది.

ఆ రాత్రి తెల్లారాక నీళ్ళకెళ్ళిన వాళ్ళెవరికీ చింతచెట్టు కింద పిచ్చోడు కనపడలేదు. మూగది నిద్రలేచి చూసుకుంటే దాని  కాలిపట్టీలు కూడా కనపడలేదు. అసలు సంగతేంటంటే- కొట్టినా తిట్టినా ఎప్పుడూ నవ్వే పిచ్చోడు ఆ రాత్రంతా ఎక్కెక్కి ఏడ్చాడనీ, ఆ తర్వాతెప్పుడు నీళ్లకెళ్ళినా మూగది ఒక బిందెడు నీళ్ళు పసుపురాయి మీద కుమ్మరించి పోతుందనీ చింతచెట్టుకీ చెరువుకీ తప్ప ఇంకెవరికీ తెలీదు.

-*-