గడ్డిపోచలు -16

“Get well soon”
“Ofcourse, I’m better”

పూటకో కోటి పూలు విచ్చుకునే చోట ఎవరైనా నాలుగు మనసున్న మాటలు నాటితే బాగుండు.

“పోనీ రమ్మంటావా?”
“ఫర్లేదు తగ్గిపోతుంది” వెనక పెద్ద కథ, పడి పడీ లేచీ లేవలేని ఒక దీర్ఘకాలిక పెనుగులాట. ఒక దుఃఖానికి రెండు కళ్ళూ చాలని నిస్సహాయ నిష్పత్తి.

టీనీళ్లు, మందులు ఉన్నాయి. కప్పుకోడానికి దొరికిన దుప్పటి పట్ల కొండంత కృతజ్ఞతా ఉంది.

“Do you need anything else?”

ఉత్తినే, ఇట్లా అన్నం సయించట్లేదూ, పిచ్చి కలలొస్తన్నయ్.. అని ఒకసారి ఎవర్తోనన్నా చెప్పుకోబుద్ధవుతుంది.

గడ్డిపోచలు – 15

జులపాలు కత్తిరించాక అతన్ని ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటుంది. రెండ్రోజులు పల్చపల్చగా ఆగకుండా వాన కురిశాక ఆఖరి బొట్లు కొన్నిచూరు చివరల్లో, ఆకు అంచుల్లో ఆగిపోయినప్పుడు ఎందుకో అతను గుర్తొస్తాడు. నవంబర్ రాత్రి నిశ్శబ్ధంలో ఒక పాత కవితేదో పైకి చదివి రికార్డ్ చేసుకోవాలనిపించి, ఈలోగా వేడిపాల మీగడమీద తెట్టకట్టిన మిరియాలపొడిని గ్లాసులోకి తిరగబోస్తున్నప్పుడు, అకారణంగానే గుర్తొస్తాడు. ఇంతకీ కథ ఎలా ఉందీ అని అతనడిగినప్పుడు ‘కాస్త బావుంది కానీ, క్లీషే నుంచి తప్పించుకోకపోయావా?” అని చెప్పబోయి మానుకున్న విషయం గుర్తొస్తుంది. ఫలానా మనిషికి ఫోన్ చెయ్యమనీ, నీకింకా నిద్ర చాలినట్టు లేదు, మేమంతా వెళ్ళొస్తాం తలుపేసుకొమ్మనీ చెప్పి వెళ్ళిన మాటలు ఇంకా పచ్చిపచ్చిగా లిఫ్ట్ డోర్ పక్కన వగరు వాసనేస్తూ తిరుగుతాయి. ‘కవిత్వమొక రోగం కాదు, వీళ్లనలా వదిలెయ్యండి” అని గతంలో అతను ఎవరెవర్తోనో మొత్తుకున్న సంగతి ఇప్పుడే తెలుస్తుంది. సమాధుల్నీ, సమాజాన్నీ కాస్త లోగొంతుకలోనైనా నిరసించాడని; కలుపుకుపోవడాన్ని, కౌగిలించుకోవడాన్నీ గట్టిగానే కోరుకున్నాడనీ చూచాయగానైనా తెలిసొస్తుంది. మొదటిసారి కాస్త సందేహంతోనూ, మళ్ళీ మళ్ళీ కాస్త మొహమాటంతోనూ అతన్ని కలవడం నిన్నమొన్నటి మింట్ ఫ్లేవర్డ్ మెమరీస్ లా మెదుల్తాయి.. “ఐతే ఆరోజు తారీఖు తప్పు చెప్పావా? లేకపోతే నేనే ఆ ఊరిపేరు సరిగ్గా వినలేదా?” అని ఇద్దరమూ కాసిన్ని మాటలు కలుపుకోడమూ కాకతాళీయం కాదనే తోస్తుంది. ఇంతాచేసీ, అతన్ని ఇంకోసారి పలకరించాలంటే ఎందుకులేబ్బా అని ఒక లోలకం లోలోపల ఊగి ఊగి “ఇంతకీ, ఆ రాత్రి ఎందుకేడ్చావ్?” అని మళ్ళీ అడుగుతాడేమో! అనే సంశయంతో ఆగిపోతుంది.

గడ్డిపోచలు – 4

 

ముదురు ఊదారంగు బచ్చలి తీగ, అరచెయ్యి బిగిస్తే పైకి ఉబికివచ్చే పచ్చనరం లాగ. పువ్వులో పువ్వుగా పదిసార్లు విచ్చుకొనే బొండుమల్లె. కార్తీకపు ఉదయపు గాలికి రాలిపడే ఉసిరాకులు. తీగ చివర తలలు పైకెత్తి చూసే సన్నజాజులు, పసుపు పసుపుగా కంది పూత, ఎర్రెర్రటి గోగుకాయలు, రెండే రెండు రెక్క మందారాలు.

ఈ ఉదయం ఎంత దిగులో, ఎంత బరువో… ఇంకా ఆర్పని వీధిదీపం రోడ్డుమీద. ఆశకి నిరాశకి అట్టే తేడాలేని స్థితిలో మనసు. ఎదురుచూసీ ఎదురుచూసీ .. ఎందుకోసమో తెలీకుండానే గడిచిపోయే ఏళ్ళు. దొరకడం యాదృచ్ఛికం. దక్కడం అదృష్టం, అనుమానం.

ఏదీ దారి కాదు, ఎక్కడా తీరం లేదు.
పలవరింతే ప్రయాణం. పాకులాటే ప్రాణస్పందన.
నువ్వో మరెవరో !
నేనో, కానో!
కావాల్సిందల్లా కాస్త కాలం, కొన్ని నిమిషాలు. మరీ మూడుపూట్లా కాకపోయినా డొక్క ఎండుకుపోయినప్పుడు జీవధార లోంచి కొన్ని తుంపర్లు.

ఇంకా ఏం కావాలి? అనడిగేవాళ్ళకి ఏం చూపించాలి?
అడవిలో కార్చిచ్చు లాంటి ఆకలినా?
కోట్ల మోహాణువులతో క్షణక్షణం చిట్లిపోయే దేహాన్నా?
పెదవిని తాకిన ప్రతి బొట్టుకీ సముద్రాలుగా పొంగే దాహాన్నా ?
ఇంకొక్క క్షణం ఇక్కడ నిలవలేనని తెలియగానే జీవితకాలపు ఖైదు విధించిన లోకాన్నా?
నిన్నా? నన్నా?…

గడ్డిపోచలు – 14

 

చలికాలపు మధ్యాహ్నం.టెర్రస్ మీద ఎండపొడలో ఆరుతూ ఆడామగా బట్టలు కొబ్బరితాళ్లపైన. కుండీలోనుంచి వంగి నేలని తాకుతూ పొడుగాటి ఆకులు ఏవో. రాలిపడ్ద చంద్రకాంత పువ్వు పక్కన వెలికిల్లా బోర్లా మొగ్గలేస్తూ పిల్లిపిల్ల. రేపు తిరగబోయే చోట్లు, రాత్రికి రాయాల్సిన కథ, తిరుగుటపాలో వచ్చిన ఉత్తరాలు, పేరుకుపోతున్న మిస్డ్ కాల్స్, ఎత్తులో ఎగిరెళ్ళిపోతున్న విమానం- వీటిసంగతి మనకెందుకు? మైక్ లో అప్పుడప్పుడూ వినిపించే నమాజ్ ఒక్కటే కాలానికి సంకేతం. తెల్లటి పీచుమిఠాయిలా కదలకుండా ఉండిపోయిన మబ్బులకింద కాసేపలా కూర్చుంటాం. గోడకి ఆనుకుని మగతగా ఇత్తడిగంటలు ఎండకి మెరుస్తాయి. చిన్న చిన్న బల్బులు చుట్టి చూరుకింద వేలాడదీసిన ఖాళీసీసాలు చలిగాలిని నింపుకుంటాయి. నేలమీద అడ్దంగా అల్యూమినియం నిచ్చెన నిర్వ్యాపకంగా పడుకుని ఉంటుంది. ఇది ఎప్పుడు దేనికి వాడుతుంటారా అని ఒక క్షణకాలపు ఊహ కదిలి సమస్తుంది. ప్రత్యేకంగా ఇదీ అని చెప్పుకునేదేముండదు. నిమ్మళంగా, నిరాలోచనంగా కాలాన్ని అలాగే పొడిగించుకోడమో, ఆ కాసేపటికే కుదించుకోడమో చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడూ లోపల్నుండి రంగుల కదలికో, సంగీతపు తమకమో, కాగితమ్మీద అక్షరాల రాపిడో ధ్వనిస్తాయి. ఒకసారి కనుక్కుని వచ్చే నెపంతో లోపలికెళ్ళి పడమటివైపు కిటికీకి పల్చటి దుప్పటితెర అడ్డంకట్టి వస్తాం. ఏ పెళ్ళి మేళమో అటుగా పోతుంటే మధ్యాహ్నపు మత్తు వదిలి తల విదిలిస్తాం. ఎటైనా వెళ్దామనుకుంటూనే ఎటో ఎందుకో తేలక ఉండిపోతాం. మామిడితాండ్ర వాళ్ళూ, ఉర్దూ గజళ్ళ వాళ్ళూ, సిగరెట్ల వాళ్ళూ వచ్చిపోతూ ఉంటారు. కాస్త ఆగమని ఒక్కోసారి వాళ్లతో పాటు మనమూ పోతాం. ఆ రాత్రికి ఇక తిరిగిరాము. మరొక బాల్కనీలోనో వరండాలోనో ఇంకొక ఉన్మత్తావస్థలో కొందరు నవ్వులవాళ్ళు, పాటలవాళ్ల మధ్య గోళీకాయల్లా కాలాన్ని రంగురంగులుగా దొర్లిస్తాం. రోజుల తరబడి కొన్ని గంటల్నైనా నిద్రకి వాడుకోలేనంత పేదవాళ్లమైపోతాం. తిన్నామో, తిట్టుకున్నామో, మన వెనక ఏవైనా గొడవల్ని వదిలి వచ్చామో మర్చిపోతాం. మెట్రోల్లో, బైకుల్లో, ఆటోల్లో ఎటెటో విడివిడిగానూ, కలిసి కలిసి తిరిగేసి ఏదోక వేళకి ఒక్కొక్కళ్లం మళ్లీ ఆ టెర్రస్ మీదకే చేరుకుంటాం. వచ్చేదారిలో లైట్ల వెలుతుర్లో బండాపి వంతెన మీద కాసేపు ఆగిన సంగతీ, నీళ్లలో నిలవలేక తేలిపోయిన బొమ్మల సంగతీ చెప్పుకున్నాకనే మంచినీళ్లకోసం వెతుక్కుంటాం. కొన్నిరోజులయ్యాక ఎవరో ఒకరం వెళ్లిపోవాల్సి వస్తుంది. బట్టలు సర్దుకోడానికి మనసురాక మెట్లమీద ఎదురూ బొదురూ కూర్చుని, అందరం కలిసి ఆసువుగా ఒక కథ అల్లుకుంటాం. అవసరమైనదానికన్నా కాస్త ఎక్కువే నవ్వుకుంటాం. వాచీలు చూసుకుని ఒకళ్లనొకళ్లం పురమాయించుకుని ఉన్నఫళాన లేచి బయల్దేరిపోతాం. రోడ్లమీద మనుషులు, లైట్లు, బళ్ళు ఎప్పట్లానే గందరగోళంగా, సందడిగా అగుపిస్తాయి. ఒక్కమనిషిని సాగనంపడానికి గుంపుగా వెళ్లే మనమే ఒక కొత్త అందాన్ని ఆపాదిస్తాం ఆ సాయంత్రానికి.

(ఉషా, మోషే లకు, వాళ్ల టెర్రస్ కు, పిల్లిపిల్లలకు ప్రేమతో…)

గడ్డిపోచలు 13

ఎందుకు భయం? అనడిగావు.
ఎందుకో తెలీదుకానీ ఎలాంటి భయమో చెప్తాను.

చెట్టూ గుట్టా తిరిగి ఆకూ కాయా తెంపుకుని,
పగలంతా అడవిపిట్టల అరుపులతో వేసట పడి
తలపగిలే నొప్పితో కాళ్లీడ్చుకుని వచ్ఛే వేళకి,
లేగల లేత అరుపులు జాలిగా ఇంటివైపుకి లాగుతుంటే-
వగరుస్తూ, గసపోస్తూ అర్చుకుపోయే గొంతుకతో గూడు చేరే వేళకి,
సరిగ్గా అదే వేళకి రోజుకొక్క నీళ్లచెలమ ఎండిపోయి ఎదురౌతుంటే
వస్తుందిగా ఒక భయం? అవును, ఆదే ఇది.

పక్కమీదకి చేరతాను. వేళకి నిద్రపోవడం అనే గొప్పకలని కంటూ…

…..

భయం దేనికో తెలీదు కానీ ఏం లేకపోవడం వల్ల భయమో తెలుసు.
రారమ్మని… కౌగిలించుకొమ్మని …గుండెదడ తగ్గేవరకూ ఆనుకొని పడుకొమ్మని అడగలేనందుకు, నిజాలు చెప్పి నమ్మించలేనందుకు, నిజంగానే నొప్పించలేనందుకు, అందుకోలేనందుకు, అసలేం మార్చలేనందుకు-
భయం.

ఎవరెవరికి భయం దేనికోసమో కానీ నాకు దేనికోసం కాదో చెప్తాను.
నువ్వనుకున్నట్టు, రేపటి గురించి మాత్రం కాదు.
పగటి గురించి, దారిలో నేలపగుళ్ల గురించి, పరిగ గింజల గురించీ – ఉహూ…కాదు!

భయం..
నిష్కారణంగా, నిష్కపటంగా, దానంతట అది అతిసహజంగా ఈ క్షణంలో నరనరాల్లోనిండిపోయి…

దాన్నింకా కారణం అడగలేదు.
అడిగేంత ధైర్యం లేనందుకే భయం.

గడ్డిపోచలు 12

గుండె లోపల కందకం లాగా రాత్రి
కొనప్రాణంతో కొట్టుకుంటూ అడవిపిట్ట ఒకటి
కళ్ళమీద తెరలు తెరలుగా జారుతూ భయం
దిక్కుతెలీని అదే పాతరోదన

కొండరాళ్ళు తిరిగి పలకవు
కొన్ని యుగాల దుఃఖంతో కరడుకట్టిన కథ వాటిది

ఒక్కో రోజు
ఒక్కో గంట
గండశిలగా కాలం

మోకరించీ
మొరపెట్టీ
అరిచిగీపెట్టినా
ఆగకుండా జీవితం

అమ్మో!
ఇదేం ఊరో తెలీట్లేదు
ఇప్పుడెక్కడికి పోను?

….

“భయం”
సరదాకీ, మాటవరసకీి కాదు. కాళ్ళూ చేతులూ వణికిపోతున్నంత నిజంగా…

కల్తీలేని భయం.

చప్పుడు రాకుండా రాత్రిపూట ఏడ్చేటప్పుడు, గుండెమీద రుద్దుకుంటూ ఊపిరి అందుకునేటప్పుడు, బయటపడని కేకలో, ఒక మనిషితాలూకా వాసన. ఒక అలవాటైన శరీరపు రుచి. రోజంతా వినపడని ఒక గొంతు లోపల్లోపలే మోగుతూ, మెలిపెడుతూ, చీకటికొట్టు లాంటి దిగుల్లోకి విసిరికొడుతూ;

తెల్లటి కర్టెన్లు గాలికి ఊగుతూ, నేలమీద కాగితం ముక్కొకటి ఎగురుతూ, దూకుతూ, చెక్కకుర్చీ కదలకుండా నిద్రలో జోగుతూ…
గుర్తుంది, అచ్చం ఇలాగే.

తీరం దాటడం, తన్నుకులాడటం, కురిసిపోడం, తెరిపినపడటం- అంతా అలవాటైన పనే.

అయినాసరే, “భయం”

అయితే, రాత్రొచ్చిన పాడుకల నిజమేనేమో!

గడ్డిపోచలు 11

పాపకి జడ వేస్తూ అమ్మ అంది “ అన్నయ్యతో గొడవ పడొద్దు చిన్నమ్మా. పాపం నోరులేని వాడు”.

“ఎహె, ఎప్పుడూ నాకే చెప్తావే?” పాప కోపంగా జడ ముందుకేసుకుని వెళ్ళిపోయింది.

 

పాప నేల మీద విసిరేసిన బొమ్మలు సర్దుతూ అన్నయ్య అన్నాడు “కుక్కపిల్లని పెంచుకోవద్దు. దానికేం ఖర్మ ఇంట్లో పడుండటానికి, మనుషుల్లో బతకడానికి? ఒక ఏనుగుల గుంపు నిన్ను పెంచుకుంటే నీకు బాగుంటుందా?”

సర్దిన బొమ్మలన్నీ మళ్ళీ తోసేసి, వాడి వీపు మీద ఒకటి పీకి బయటికి తుర్రుమంది.

ఆఫీస్ కి వెళ్తున్న పాపకి లంచ్ బాక్స్ సర్దుతూ అమ్మ అంది.

“నీకు తెలీదని కాదు. కానీ, అతనికి కోపం ఎక్కువలా ఉంది. ఇంకోసారి ఆలోచిస్తావా?”

“నీతో వీడు చెప్పాడా? వీడి పెళ్ళామేదో మహా గొప్ప..” అన్నయ్యవైపు కొరకొరా చూసింది.

ఆ తర్వాత పాపని అన్నయ్య ఆఫీస్ లో దిగబెట్టాడు.

ఆరోజు లంచ్ బాక్స్ నిండుగా వెనక్కొచ్చింది.

పాప సోఫాలు, కర్టెన్ లు దులుపుతుంటే అమ్మ ఫోన్ చేసింది.

“ఏమ్మా, బుజ్జిది బడికెళ్ళిందా? శెలవులకి తీసుకొస్తావా? నీ ఒంట్లో పర్లేదా?”

“ఆయన ఏమంటారో, అడగాలి.”

తల సోఫాలో పెట్టుకుని నేలమీద కూలబడింది,  మాట్లాడ్దానికి గొంతు పెగలక అన్నయ్యకి ఉత్తరం రాసింది. “నిజమేరా, కుక్కపిల్లల్ని పెంచుకోకూడదు. పాపం.”

అన్నయ్య వెంటనే బయల్దేరి వచ్చాడు.

“చీకటి పడట్లా? బుజ్జిది ఎక్కడా?”

అమ్మ తెల్లటి జుట్టు దువ్వి ముడివేస్తూ పాప చెప్పింది. “వాళ్ళ మామయ్య ఇంటికెళ్లింది. వాడంటే ఎంతిష్టమో దానికి.”

“ఎన్నాళ్ళుంటావే ఇట్లా? అతను కోపిష్టి వాడే కానీ బుజ్జిదాని కోసం కలిసి ఉండకూడదా?”

అమ్మమంచం పక్కన నేలమీద దిండేసుకుని పడుకుంది పాప. పుస్తకం తెరిచి పేజ్ మార్కర్ దిండుకింద దాచింది. కొత్తసినిమా పాటేదో కూనిరాగం తీసుకుంటుంది.

“నామాట నువ్వెప్పుడు విన్నావు గనక?” మంచం మీద ముసలమ్మ నిష్టూరంగా అటువైపుకి తిరిగింది.

రెణ్ణిమిషాల్లో గురక. పాపలేచి అమ్మకి దుప్పటి కప్పింది.

గడ్డిపోచలు 10

‘ఇంకెన్నాళ్లు పంతం?’ అనుకుని ఆమె కళ్ళు తుడుచుకుని మంచం మీంచి దిగ్గున లేచి గబగబా ఒక ఉత్తరం రాస్తుంది. ‘అన్నీ మర్చిపోదాం. నువ్వూ నాలాగే యాతన పడుతుంటావని తెలుసు’. ఉత్తరాన్ని పంపేలోగా  ఎవరో చెప్తారు, అతను మరో అమ్మాయితో కనబడ్డాడని. గుండెలో పాజ్ చేసిన ట్రాజెడీ ట్రాక్ ఇక నిరవధికంగా రీప్లే అవుతూనే ఉంటుంది.

ఇప్పుడు కాస్త నాటకీయంగా ఊహిద్దాం. సరిగ్గా ఈమె మంచం మీద కళ్ళు తుడుచుకునే వేళకే అతను కూడా తలుపేసి ఇక్కడికి రావడానికి బయల్దేరతాడు. ఆమెకి చెప్పినట్టే అతనిక్కూడా ఎవరో వచ్చి ఎదో చెప్తారు, ఆమె మూవాన్ అయిపోయింది, ఎవరితోనో దగ్గరగా ఉంటుంది, నువ్వెందుకు దేబిరిస్తూ అక్కడికి వెళ్లడం, గట్రా. అతను తలుపు గడి తీసి నాలుగడుగులేసి ఒక్క ఊపుతో వెనక్కొచ్చి పుస్తకాల అలమరని లాగి తంతాడు. తర్వాత రోజు నిద్రలేచాక జారిపడ్డ పుస్తకాల్ని జాగ్రత్తగా వాటి స్థానాల్లో సర్దేస్తాడు.

ఆమె పార్కులో చెమటపట్టేదాకా పరిగెత్తి, మోకాళ్ళమీద చేతులాంచి వగర్చి, తడబడుతూ ట్రాక్పాంట్ జేబులోంచి మొబైల్ బయటికి తీస్తుంది. ‘న్యూ క్రష్’ అనే కాంటాక్ట్ కోసం స్క్రోల్ చేస్తుంది. “నువ్వన్నది ఆలోచించాను. బహుశా నాక్కూడా ఇష్టమే నువ్వంటే.” అని మెసేజ్ పంపుతుంది. తిరుగుటపాలో కొన్ని ముద్దులు, “గతం మనదారిలో అడ్డురాదు” అనే ధైర్యవచనమూ వచ్చి వాలతాయి. పార్కులో చుట్టూ చూస్తుంది. లేతరంగుల పూలన్నీ హైఫై చెప్తాయి. పాజ్ చేసిన ప్రేమగీతం ఒకటి ఇయర్ ఫాన్స్ లోంచి గుండెలోకి దూకుతుంది. నుదురు తుడుచుకుని మరో రౌండ్ పరిగెత్తడానికి షూ లేస్ బిగిస్తుంది.

గడ్డిపోచలు 9

హైవే మీద కార్ల వెనకాల కుక్కలు తరుముతూ ఎందుకు పరిగెడతాయో తెలుసా?

 

కడుపు చెరువయ్యేలా, గుండెకి గండిపడేలా, గొంతు జీరుకుపోయేలా, నదికి నిలువెల్లా దుఃఖం ఎందుకో తెలుసా?

నాకు నువ్వెంతో నీకు నేను అంతే. కానీ నీకు నేను ఎలానో నాకు నువ్వు అలానే కాదని…   

అన్ని వానలు ఒక్కలానే కురుస్తాయి. నీకు తడవాలనిపిస్తుంది కదా అది నీ వాన.

అందరి ప్రపంచాలు ఒక్కలానే ఉంటాయి. నువ్వు తలుపు తెరవగానే వాన కురుస్తుంది చూడు- అదే నీ ప్రపంచం.

అసలారోజున వాన కురవకపోయి ఉంటే, అలవాటైన కప్పలు కూడా ఆదమరచి మడుగులో జారి పడకపోయి ఉంటే, మళ్లీ మబ్బుపట్టడం ఒట్టి అనుమానం కాదని అప్పుడే బలంగా అనిపించి ఉంటే, ద్వేషించడం నేర్చుకోని గాయాన్ని, ఎందుకు కమిలిందని ఎవరూ ఇంకొన్నాళ్లు అడగకుండా ఉంటే…

ఎర్రపూలున్న తెల్లదుప్పటిలోంచి అతని గొంతు వినపడుతోంది

“క్షమిస్తావా అన్నిటినీ?”

గట్టిగా ముద్దు పెడుతుంది.

“మర్చిపోతావుగా తప్పులన్నీ?”

బుగ్గతుడిచి మళ్లీ ముద్దు పెడుతుంది.

“ఉంటావా నాతో?”

అతని జుట్టు చెరిపి నవ్వుతుంది. సంబరం పట్టలేక పొంగి పొంగి నవ్వుతూనే ఉంటుంది.

నవ్వు ఆగాక గుసగుసగా అడుగుతుంది “పిల్లి పిల్లలకి స్నానం ఎలా చేయిస్తుందోయ్?”

—-

గుర్తుంచుకోదల్చుకోనివి గుర్తురాకుండా ఉండడానికి ఒకటే దారి. మర్చిపోవాలనుకున్న సంగతి మర్చిపోడమే.

హలొ …హెలో, ఇక్కడ కవరేజ్ లేదు. కరెంట్ లేదు. రంగులో చేతులు ముంచి గోడల మీద అద్దిన ముద్రలు మాత్రం మెరుస్తూ ఉన్నాయి.  ఎర్రమట్టికుండలో అడుగున కాసిన్ని నీళ్లు కూడా మిగలలేదు. నిన్ను వదుల్చుకుని వెనక్కు తిరిగి వచ్చిన ఈ పాతఇంట్లో అదే పాత చీకటి. అదే ఆందోళన, ఇతమిద్ధంగా ఇందుకు అని తెలీని భయం, రాత్రంతా అప్రమత్తత.

తెల్లారగానే

వాన వెలవగానే

కాసిని నీళ్లు గొంతులో పడగానే

ఆ గుక్కెడు నీళ్లిచ్చిన ప్రతి మనిషిని ఇప్పుడు ఆమె ఓకేమాట అడుగుతుంది “ఉంటావా నాతో?”

—-

ఇంతకీ హైవే మీద కుక్క సంగతి తెలిసిందా లేదా?