మనిద్దరి కథ

ఒక్కో కథ ఒక్కోచోట మొదలవడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. తలుపుకి చెరొక వైపు నిలబడి మొదటిసారి మనం ఎదురుపడ్డప్పుడు ఎక్కడా ఏ కదలికా లేకపోయి ఉండొచ్చు. ఏమో! ఎక్కడో పచ్చటి పొలాల్లో ఒక గడ్డిపరక పక్కకి వంగి మట్టివాసనతో మనగురించి ఒకమాట చెప్పి ఉండొచ్చు. ఆ సాయంత్రం ఒక్క నిమిషం ఆలస్యంగా చీకటిపడి ఉండొచ్చు. ఎందుకో తెలీకుండానే నీకో నాకో ఒకమాట తడబడి ఆ తప్పు పలికిన పదం ఇప్పటికీ గుర్తుండి ఉండొచ్చు.

తలుపుకవతల నిర్లిప్తంగా నువ్వు. “ఎవరు కావాలి?” అని అడుగుతూ నా కొత్తరెక్కలు సరిచూసుకుంటూ, కొత్తకలల్ని కాటుకలా దిద్దుకుంటూ నేను. “ఏం లేదు. ఇక్కడ లేదు” అని గొణుక్కుంటూ వెళ్ళిపోయావు నువ్వు.

**

నువ్వు నాకు బాగా తెలుసో తెలీదో తెలిసేది కాదు. కానీ ఎవరికీ అర్థం కావని నేను వాడటం మానేసిన పదాలు కొన్ని నీదగ్గర వినపడేవి. నువ్వు చదువుకునే పుస్తకాల్లో అచ్చం నేను రాసుకునే వాక్యాల్లాంటివే ఉండేవి. నేను నవ్వుతూ కలువపూల గురించి చెప్పేటప్పుడు  గతాన్ని నింపుకున్న కళ్లతో నావైపు చూసేవాడివి. పాతకవిత్వపు డైరీలు చించి పిల్లలకి కాగితం పడవలు చేసిపెట్టే నిబ్బరంతో నామాటలు వినేవాడివి.

**

చంద్రుడి కళలు చాలాసార్లు మారాయి. కలువపూలు చెరువులో ఈదుకుంటూ చాలాదూరం వెళ్ళిపోయాయి.  రెక్కలు మడిచి లోపల దాచిపెట్టిన సంచి భుజానికి తగిలించుకుని కాలినడకన వెళ్తూ ఏవేవో చెట్లకింద ఆగడం అలవాటైంది. కాటుక భరిణె మూత పెడుతూ తెరుస్తూ కాలం గడిచిపోయేది. ఎక్కడికి వెళ్ళినా నీనుంచి కొన్ని పలకరింపులు, పరామర్శలు మాత్రం గూళ్లకిచేరే పక్షుల్లా వేళకి వచ్చి వాలేవి.

“అమ్మాయీ… వాల్డెన్ ని వెతుక్కుంటూ హెన్రీ ధోరో  వెళ్లినట్టు నాకూ వెళ్లాలనుంది. నువ్ మాత్రం నగరాన్ని తేలిగ్గా వదిలేసి వూళ్లలో అడవుల్లో తిరగడానికి అలవాటు పడిపోయావ్. కానీ, నువ్ లేని నగరం నాకు బోసిగానే ఉంది. మీరా భజన్లు వినేటప్పుడు నువ్వు గుర్తొస్తావు. ఆ పాటలు వింటూ నువ్వెవర్నో గుర్తు చేసుకోవడం గుర్తొస్తుంది.”

జవాబుగా నీకు కొన్ని మౌనాలు, కొన్ని కన్నీళ్ళు పంపేదాన్ని. కొన్నాళ్ళకి మొహమాటం తెగ్గొట్టి ఒక ప్రశ్నని పంపాను.  “అప్పట్లో నా ఇంటితలుపు కొట్టినప్పుడు ఏదో వెతికేవాడివి కదా, దొరికిందా? అసలింతకీ నీ కథేంటి?”

“ఇప్పుడు నవ్వున్నావు చూడు. నేను ఎప్పట్నుంచో అలానే ఉన్నాను. నెలలు, తారీఖులు తెలీకుండా వదిలెళ్ళిపోయిన ఆమెకోసం  అలమటిస్తూ  ఉండేవాణ్ణి.కోలుకోవాలని ఉండేది కాదు. ఇప్పుడు బయట పడ్డాను కానీ ఇంకా బ్రతుకులో పడలేదు.”

నువ్వెప్పుడూ అదే కథ చెప్పేవాడివి, గతాన్ని తింటూ జ్ఞాపకాల్లో నిద్రపోతున్న మనిషి లాగా.

**

ఎన్ని దిక్కుల్లో తిరిగినా నాకు దిగులే ఎదురయ్యేది. ఎన్ని రుతువులు మారినా కళ్లలో నీటిపూలే పూసేవి. అందర్లాగా నువ్వు ఈ దుఃఖం అనవసరం అనలేదు. mere emotions అని నవ్వలేదు. “నొప్పి నిజంగా లేదు, నీ మెలాంకలిక్ టెంపర్మెంట్ వల్ల సృష్టించుకుంటున్నావ్” అని తీసిపడెయ్యలేదు.

మళ్ళీ మళ్ళీ ఒకేమాటే అడిగేదాన్ని; “ఎట్లా బతకను?”

ప్రతిసారీ ఒకేలా సముదాయించేవాడివి ఈ మాటలు చెప్పి;

“రోజుకి కొద్దిగా నవ్వుతూ బతుకుదాం. తెలీక రాంగ్ అడ్రస్ లో దిగిపోయాం. ఇక్కడ మనవూరి వాళ్ళెవరూ లేరు. చెయ్యి పట్టుకో, ఈసారి జాగ్రత్తగా నడుద్దాం. ఇంత గాయపడతామని తెలీకనే అట్లా తాకి వెళ్ళిపోతారు మనుషులు. ఎవర్నీ ఏమనకు. పేదది జీవితం. ప్రేమకోసం వేధించకు దాన్ని. బిడ్డకు అన్నంపెట్టలేని తల్లిలా ఏడుస్తుంది. జాలిపడి వదిలేద్దాం.”

ఒక్కోసారి  బాగా తెలిసిన కథలో తెలీకుండానే మనమే పాత్రలం అయిపోతాం. లాంతరు నీడలో మసల్తూ చీకట్లో ఉన్నాం అనుకుంటాం.

**

ఒక్కో కథ ఒక్కోచోట మలుపు తిరగడం ఊహాతీతం కాకపోవచ్చు. ఆ మలుపు తిరిగిన క్షణాల గురించి నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలా చెప్తావు;

“ప్రేమించి, దుఃఖించి, శుష్కించిన జీర్ణ హృదయంతో నా దగ్గరకొచ్చావు ఒక వానాకాలపు ఉదయం. ఎందుకొచ్చావో తెలీలేదు. ఇన్నాళ్ళుగా తెలిసిన మనిషివే, ఎన్నోసార్లు పరిష్కరించలేక చూస్తూ ఊరుకున్న వేదనే. గుక్కపట్టి ఏడ్చే పసిపిల్లని ఊరుకోబెట్టినట్టు ముద్దుపెట్టాను.”

**

ఆరోజు అక్కడ కురవకుండా ఆగిపోయిన వానమబ్బొకటి  ఆ తర్వాతి కథ చెప్పింది;

“ఏడుపాగిపోయింది. సగం కళ్ళు తెరిచి విషాదం అంచునుంచి లేచి ఆమె పక్కున నవ్వింది. రెండు శిశిరాలు కలిసి ఒక పూలతోటగా విచ్చుకున్నాయని పైకెగిరిన పిట్టలు చెప్పుకుంటే విన్నాను.”

**

(15/2/19 సారంగ)

ఇంకెంతసేపు?

దురు చూస్తుంటావు.

తొందరపడి ముందే ఏం నిద్రలేవకుండా, ఊరికూరికే వీధిమొగలో తచ్చాడకుండా, అసలు అదొక ప్రత్యేకమైన పనిలా కాకుండా, ఎలాగూ వచ్చేస్తాననే భరోసాతో నిమ్మళంగా ఉంటావు. రోజుట్లానే జాగింగ్ నుంచి వెనక్కొచ్చి, జెర్కిన్ జిప్ తీసి కొక్కానికి తగిలించి, ఇనపగొలుసుకి వేలాడదీసిన కేన్ ఉయ్యాల లో అర్ధవృత్తాల్లో తిరుగుతావు కాసేపు. గోరువెచ్చని నీళ్ళలో తేనెచుక్కలు కలుపబోయి, జారిపడ్డ చెంచా శబ్దానికి తేరుకుని, బయటికొచ్చి బాల్కనీ రెయిలింగ్ మీద చేతులు మోపి, వీధుల్లో తోటకూర అమ్మేవాళ్లని, పాలు కొనడానికొచ్చేవాళ్లని, ఒక చివర్న ఆడుకునే కుక్కపిల్లల్ని ఎప్పట్లానే చూస్తూ..

నీ ప్రమేయం లేకుండానే, నీకసలు తెలీకుండానే ఎదురు చూస్తుంటావు.

ఎడతెగని ప్రయాణంలో ఉంటాన్నేను-

రైలు కిటికీ ఎలక్ట్రానిక్ తెరలాగా, బయటి ప్రపంచమంతా ఉపాధేయ వస్తువులాగా మారిపోయి, కొత్త కవిత్వపు పంక్తులేవో రైలు పట్టాలవెంటపడి నాతో పాటుగా వస్తుంటాయి. రైలు ఊళ్లని దాటేటప్పుడు గేటు పడి మనుషులు ఆగిపోయిన దగ్గర, కూ మన్న చప్పుడుకి ఉమ్మెత్తపూల గాలి, కాగితప్పూల రంగు ఒక్కసారి ఉలిక్కిపడి మళ్ళీ సర్దుకుంటాయి. పైబెర్తు మీద పడుకున్న ఆర్టిస్టుని నిద్రలేపి తన బొమ్మ వెయ్యమని పేచీ పెడుతుంది పాప. ఎదురు సీట్లో పెద్దాయన తరళ సలిలము అన్న పదానికి విగ్రహవాక్యం కోసం ఆ ఉదయమంతా వెతుకుతూనే ఉన్నాడు.

—-

ఒక్కోచోటులో కలిసేముందు ఒక్కోలా ఎదురుచూస్తావు నువ్వు.

కాఫీ షాప్ లో ఇయర్ ఫోన్స్ లో గజళ్ళు వింటూ; ఫ్రూట్ జూస్ సెంటర్ లో  వలసపక్షిలాంటి ఆ తెల్లటి పిల్లాడితో రోజువారి అమ్మకాల గురించి మాట్లాడుతూ, అతను వదిలేసి వచ్చిన ఆ వూరిలో అమ్మానాన్నల వివరాలు కనుక్కుంటూ; లైబ్రరీల్లో, పబ్లిషింగ్ హౌసుల్లో పుస్తకాల మధ్య చెదపురుగువై అసలు నేనొచ్చేసంగతి గుర్తులేనట్టు ఉంటావు.

ఒక్కోసారి అవతల పక్క సిగ్నల్లో నిల్చుని ఉంటావు. బస్సుల్నీ, ఆటోల్నీ తప్పించుకుని  నేనటువైపుకి చేరగానే “రోడ్డు దాటేటప్పుడు నువ్వు సిగ్గుపడ్డావు తెలుసా?” అంటావు. ఆ తర్వాత నగరం మనని ఆవరించుకుంటుంది. అంతరొద మధ్యలోనూ రోడ్లన్నీ మన మాటలకోసం చెవులు రిక్కిస్తాయి.

—–

సముద్రం మీదకి ఎగిరి ఎక్కడ వాలాలో తెలీక అక్కడక్కడే చక్కర్లు కొట్టే పక్షివై, దట్టమైన అడవిలోకి దారి దొరక్క చెట్ల తలలమీదే ఆగిపోయిన జడివానవై గ్రహగోళాల గమనంలా స్థిమితంగా కాంతి యుగాలకి అవతలి నక్షత్రాలంత సహనంగా…

ఎదురు చూస్తూనే ఉంటావు నువ్వు.

రైలు దిగేశాక కొత్త దారుల్లో పాత గుర్తులతో నడుస్తూ ఉంటాను. బస్ స్టాపుల్లో ఎర్ర రిబ్బన్ జడల్లో డిసెంబరాల పూలతో ఆడపిల్లలు అరచేతుల చాటున నవ్వుతుంటారు. కారు అద్దాలకి దగ్గరగా వచ్చి ఎగిరిపోతుంటాయి పిట్టలు. సగం వొళ్ళంతా బురద పూసుకున్న పందుల్ని తోలుకుంటూ పల్లెపాటేదో పాడుకుంటూ వెళ్తాడొక కొత్తమీసాల కుర్రవాడు. వాళ్లందరితో మాటలు కలపకుండా రాలేకపోతాను. మంచీ చెడులు చెప్పుకోకుండా కదల్లేకపోతాను. ఈలోపు ఆకాశం రంగులు మారిన సంగతి బొత్తిగా మర్చిపోతాను.

తలుపు తీస్తావు కానీ తీసినట్టుండదు. పలకరిస్తావు కానీ నన్నే అనిపించదు. రెండు కొత్త గాజు గ్లాసులు తుడిచి అక్కడ పెడతావు కానీ వాటిలో నీళ్ళుండవు. నిన్ను తాకనివ్వవు, తప్పయిందని చెప్పనివ్వవు. గదిలోపలి కర్టెన్లు ఆర్టిస్టిగ్గా ఊగడం మానేస్తాయి. కారిడార్నుంచి పైకి కిందకీ పచార్లు చెసే లిఫ్ట్ శబ్దం తప్ప ఇంకేం వినిపించదు. పాపం, ఉన్నట్టుండి లోకమంతా ఒంటరిదైపోతుంది. ఇంటిగోడలన్నీ బావురుమని ఏడవడానికి సిద్ధంగా ఉంటాయి.

చూసి చూసి “పోనీ వెళ్ళిపోతాలే” అని నేను లేవగానే మణికట్టు పట్టుకు ఆపేస్తావు. అంతసేపటి తర్వాత నొప్పితో మూలిగినట్టు ఏదో మాట్లాడతావు- “చాలా ఎదురు చూసాను, రావేమో అనుకున్నాను, రావొద్దనాలనీ అనుకున్నాను. వచ్చేసరికి తలుపేసి ఎటన్నా వెళ్ళిపోవాలని చూశాను. కోపమొచ్చింది- నిన్ను ఆపేసిన పూల మీద, పిట్టలు, మనుషులు, కవిత్వం అన్నిటిమీదా..” ఎప్పుడూ విండ్ చైమ్స్ లా మోగే నీగొంతు రుద్దమౌతుంది. కోపమో, ఇష్టమో తేలనంత గట్టిగా చేతిలో చేతిని బిగిస్తావు.

—-

చెయ్యి విడిపించుకుని, నీ మోకాలి మీద గోటితో గీరుతూ చెప్తాను-

“నీకంటే ఎక్కువని కాదు, అసలు నువ్వంటూ లేకపోతే వాటిల్లో నాకే అందమూ కనపడదు. ఆ పిట్టలా ఎగరగలననేగా ఇంత మోహిస్తావు. ఆ పూలలా ముద్దు పెట్టినప్పుడేగా అంతలా ఒళ్లు మరిచిపోతావు. ఆ ఊళ్ల గురించి, మనుషుల గురించి ఇన్ని మాటలు చెప్పి, వాళ్ల పాటలు నీ దగ్గర పాడబట్టేగా నన్ను చూసి ఇంత ముచ్చట పడతావు. ఈలోకమేగా ఇన్ని రంగులు పూసి, రెండు రెక్కలు అతికించి, నన్నిలా నీకోసం తయారుచేసింది?

నీకోసం కాదా ఈ ఆలస్యమంతా?”

వింటావో, ఇంకాసేపు కోపం నటించాలన్న సంగతి మర్చిపోతావో.. నా పొట్టలో మొహం దాచుకుని నిద్రపోతావు. మనచుట్టూ ఉమ్మెత్తగాలి, పరాయిదేశపు పాట, ఆడపిల్లల నవ్వులు, పాత పుస్తకాల వాసనా కలిసి నువ్వు తుడిచిపెట్టిన ఖాళీ గ్లాసుల్లో వైన్ లాగా నిండి పొర్లిపోతాయి.

(1/2/19 సారంగ)

చలి మంట

“నేనంటే ఇష్టమా?” అనడిగావు.

ఎవరైనా ఊలుచొక్కా తొడిగి, అరచేతులు రుద్ది బుగ్గలమీద ఆనిస్తే బావుండని ఎదురు చూస్తుంది ఉదయం. గోడమీది పెయింటింగ్ లో ఒజార్క్ లేక్ ఒడ్డున గులాబిరంగు పొగమంచులో, గుర్రాల మీద తోలు బూట్ల మనుషులు. కప్పు అడుగున  సున్నా లాగా చుట్టుకుని మిగిలిపోయిన టీ పొడి. తెల్లవారుఝాము ప్రయాణంలో టీ హట్ లో ఆగినప్పుడు టిష్యూ పేపర్ మీద నువ్వు రాసిచ్చిన ఉత్తరం, అలమరలో చీరమడతల మధ్య వెచ్చగా పడుకుంది అచ్చం నీలాగే.

మంచుపట్టిన అద్దాన్ని ముట్టుకున్నప్పుడు అక్కడ ఏదో ఒకటి రాయాలనిపిస్తుంది. గింజల కోసం రావాలా వద్దా అని పావురంపిల్ల అక్కడక్కడే తారట్లాడుతుంది. హైరోగ్లిఫ్ లాగా వేళ్లతో అద్దం మీద ఏవో గుర్తులేసి పావురం వైపు చూశాను. అది ఉన్నట్టుండి ధైర్యంచేసి గింజలమీదకి వాలింది.

కళ్ళు తిరుగుతున్నట్టు, తలచుట్టూ గాలి వలయాలుగా గిరికీలు కొడుతున్నట్టు, చుట్టూ నువ్వే ఉన్నట్టు, అసలు నా ఊహలో తప్ప నువ్వెక్కడా లేనట్టు, అన్నీ నిజాలే, అన్నీ ఊహలే. కదలకుండా ఒకేచోట ఉంటే ఏదో గుబులు. ఏవో పనులు కల్పించుకుంటూ, ‘ఇష్టమేనా’ అన్న నీ ప్రశ్నని మెడలో లాకెట్లాగా వేసుకుని, ఊరిమీద పడి తిరుగుతూ, ఊరి నుంచి ఊరికి తిరుగుతూ ఉన్నాను.

*

పేరుకుపోయిన కొబ్బరినూనె ఎండపొడకి కరిగి సీసా అంచుల మీద పూసలుగా జారుతుంది. భుజాలమీద పరుచుకున్న జుట్టంతా పైకితీసి ముడి కట్టుకోగానే సూర్యకాంతి మెడచుట్టూ అల్లుకుపోయింది. అలాంటి పెరపెరలాడే మధ్యాన్నం పూట, రెండుచేతుల మధ్యా నీ మొహాన్ని నింపుకుని తదేకంగా చూస్తుంటాను. చూస్తుండగానే నీ కళ్ళు రెండూ మెల్లగా అడవులైపోతాయి. మల్లె విచ్చుకున్నా వినపడేంత నిశ్శబ్దం అక్కడంతా. చెట్లన్నీ కళ్ళు మూసుకుని ఒళ్ళెరక్కుండా ఈలపాట పాడుతుంటాయి. అడవి బయట ప్రపంచం ఇదంతా తెలీకుండానే రాబోయే పండక్కి కొత్తబట్టలు కొనుక్కుంటూ ఉంటుంది.

చెట్టువేరులా లోపలికి పాతుకుపోయావు ఇన్నాళ్ళూ. ప్లాంటర్ లాగా, మారువేషంలో ఏ పాత సామానులో బాగు చేసుకున్నట్టు నటిస్తూ. తీరికలేని పనిలో ఉన్నట్టు నువ్వు, ఏ పనీ లేకుండా ఊరికే నీవైపు చూస్తున్నట్టు నేనూ. అదే అలవాటైపోయి, అదే అనివార్యం అయిపోయాక- లోకమంతా మనదేననీ, అసలేదీ మనది కాదనీ; జీవితానికి ఏ విలువా లేదనీ, అసలు విలువ కట్టలేనిదని ఒకేసారి అనిపిస్తుంది. నువ్వు లేకపోతే ఏం అనీ, అమ్మో, నువ్వు లేకుండా ఎలా అనీ రెండిటికీ ఒకేలా ఒళ్ళు జలదరిస్తుంది.

*

కాలం హెచ్చరిస్తుంది;

నది కదిలిపోతుందని, మంచు కరిగిపోతుందని, కుట్టుపూల దుప్పటిలాంటి చుక్కలాకాశం అర్ధరాత్రికల్లా ఆచ్చాదన లేక చలికి వణికిపోతుందనీ రుజువులు చూపిస్తుంది. ఈ ఇష్టాలేం శాశ్వతం కాదని అక్కరకొద్దీ మందలిస్తూనే ఉంది. ‘ఏది సత్యం’ అనే తాత్వికుల అనాది శోధన తప్ప విశ్వమంతట్లో శాశ్వతమైంది ఏదైనా ఉందా అనుకుని ఊరుకుంటాను. ఒంటిమీద వాలిన సీతాకోకలు ఎగిరిపోతాయేమోనని ఊపిరిబిగబట్టి కొన్ని క్షణాలపాటు కదలకుండా ఉండిపోతాను.

*

సాయంకాలం గొడ్డుచలిలో ఇల్లంతా గుగ్గిలం పొగ నింపుకున్నాను. ధూపం అడుగునించి రేగుతూ నిప్పురవ్వలు. ‘Embers’ అనే పదం మనసులో మెదలగానే నువ్వు గుర్తొచ్చావు. ఊహూ.. ఈ వాక్యం తప్పు.  నువ్వు గుర్తులేని సమయం విడిగా ఏం ఉండదు. (సరిగ్గా చెప్తానుండు) ఆ పదం నీలాగా అనిపించింది. నారింజలో ఊదా కలనేత నిప్పు రంగులోంచి, రవ్వలుగా రేగి కణికలుగా కాలిపోయే మనని గుర్తుకు తెచ్చింది.

పెన్ తో నీ చేతిమీద పిచ్చిగీతలు గీస్తుంటాను; నీ వొళ్ళు నా నోట్బుక్, ఏదైనా రాసుకుంటాను అనే పొగరుతో. గీతలెందుకు? ఏవైనా మాటలు రాయమని అడుగుతావు. అక్షరానికో తోటని పూయించగల మాటల్ని, దారి పొడుగునా దుబారాగా విరజిమ్ముతూ ఇన్ని మైళ్ళు నడిచొచ్చాక, మిగిలిన పదాలు లెక్కపెడితే ఒక హైకూ కి సరిపడా కూడా లేవు. ఏం చెప్పాలా అని పగలంతా ఆలోచించి దీపాలవేళకి నీ అరచేతిలో రాసి దోసిలి మూస్తాను ఒక అందమైన మాటని-

“మనిద్దరం” అని.

*

ఇంతకీ ఇష్టమే అంటావా నువ్వంటే?

(సారంగ 15/1/19)

సాకీ

To start with…

Where do I start?

మనుషులం కాబట్టి ప్రేమించడాన్నుంచి తప్పించుకోలేని వాళ్లమని, ఈ జీవనోత్సాహ సంరంభం వల్లనే, ఈ ప్రేమపద సోపానాల మీదుగానే, ఆనందసౌధానికి చేరుకునేదారిలోనే పాదాచారులమై కలిశామనీ, అసలు ప్రేమని వెతుక్కుంటూనే పక్షులు ఆకాశంవైపు ఎగరడం నేర్చుకున్నాయనీ, హఫీజ్ తోటలోంచి తేలివచ్చిన ప్రాణగంధపు గాలుల చలవతో నిద్రలేచి…

కుంగిపోయిన కోటల్నీ, ఒరిగిపోయిన కిరీటాల్నీ ఖాతరుచెయ్యక, అప్పుడూ, ఇప్పుడూ అదేలాగ రక్తవర్ణమధువుని స్రవిస్తున్న ఒకేఒక ద్రాక్షతీగలాగా, శీతాకాలపు పశ్చాత్తప్త పవనాల్ని దహించే వసంతాగ్నిలాగా, చలాన్ని ఆవహించుకున్న రుబాయీల విలాసస్వరంలో మొదలుపెట్టి…

“ఆలోచనలకి, భౌతిక స్పృహకి అతీతంగా, నిరాసక్తంగా, తటస్థంగా, ఏ ఉద్వేగాలూ లేని నిశ్చలస్థితిలో కూడా నా నరనరాల్లోంచి నీ అణువణువునీ పూర్తిగా, మరింతగా కోరుకుంటున్నాను” అన్న కాఫ్కా కలవరింత దగ్గర ఒక కామా పెట్టి…

ఏ ఉదాత్తతనీ ఆపాదించలేని, ఏ ఉన్నత విలువనీ అందించలేని, ఏ సందేశాన్నీ మిగల్చలేని, సహజాతి సహజమైన సహజాతాల కలయికలాంటి మన కథని-  నేపథ్య సంగీతం లేని  గాలిపాటలోని లల్లాయి పదాల్లాగా, ఏ చారిత్రక ప్రత్యేకతా లేని మన రోజూవారీ మాటల మామూలుతనంతో, గుప్పెడు గుప్పెడు పదాలుగా చల్లుకుంటూ…

*

జీవితం చిన్నదని నువ్వెందుకో తరచుగా అంటావు. జీవించగలిగే కాలం మరీ చిన్నది బతుకంతటిలోనూ. అసలు బ్రతకడం అంటే ఒక ప్రాణం మరొక ప్రాణంతో కనెక్ట్ అయి ఉండటం అనిపిస్తుంది. తోకూపుతూ చుట్టూ తిరిగే కుక్కపిల్ల కూడా బతుకు మీద ఇష్టాన్ని పుట్టిస్తుంది ఒక్కోసారి.

అవును. చిన్నదే మనిషి జీవితం. ఇవ్వాళెందుకో నిజం అనిపించింది. ఊరెళ్ళేముందు వాకిట్లో నిలబడ్ద లేత జామచెట్టు,  నేను లేనప్పుడొచ్చిన గట్టివానకి వాలిపోయాక, పాత వూర్లో వెతుక్కుంటూ వెళ్ళిన సొంత ఇల్లు పూర్తిగా పరాయిదయ్యి కనిపించాక, బస్ లో పక్క సీట్లో నడివయసు మనిషొకాయన చాతీ మీద రుద్దుకుంటూ బరువుగా బస్ దిగి వెళ్ళిపోయాక, ఇందాకట్నుంచి ఒక హాంగ్ కాంగ్ సినిమాలో ‘ఉమెబయాషి’  బీజీఎం పదే పదే విన్నాక, ఉన్నట్టుండి నువ్వన్నట్టు జీవితం చిన్నదే అని గట్టిగా అనిపించింది.

అలా అనిపించగానే, తొందర తొందరగా సొరుగులు, అలమరలు అన్నీ లాగిలాగి వెతికితే దొరికింది, మనమిద్దరం మొహమాటంగా టీ గ్లాసులవైపు  చూస్తుంటే ఎవరో తీసిన మొదటి ఫొటో. ఆ ఫోటోని దులిపితే ఇదిగో ఇప్పుడు కూడా సిగ్గు పొడిపొడిగా, పుప్పొడిగా రాలిపడుతుంది. ముఖపరిచయం కూడా లేకముందే మొదటి ఫోన్ కాల్ లో, ఈవెనింగ్ సిక్నెస్ నుండి తప్పించుకోడానికి నీతో మాట్లాడుతున్నానని చెప్తే “అచ్చం నాలాగే, సాయంత్రాలు నాకూ అంతే, ఆ దిగులు నాకు బాగా తెలుసు.” అనడం గుర్తొచ్చింది.

పార్క్ లో ఒక చివర్న ఊగిపోతున్న సిమెంట్ బెంచ్ ని కావాలనే ఎంచుకునేవాళ్ళం. కళ్లనీళ్ళు వచ్చేదాకా ఎందుకెందుకో నవ్వుకునేవాళ్ళం. ఒకళ్ళు చెప్పేది ఒకళ్లం వినకుండా బోర్డం గురించీ, బ్రతికే పద్ధతుల గురించి, ప్రయోగాల గురించి ఎవరి స్క్రిప్ట్ వాళ్లం చెప్పుకుంటూ ఒక్కోసారి క్రాస్ టాక్ తో, నిజంగానే కాస్త బోర్ గా గడిపేవాళ్ళం కదా. అవి కొన్ని డిఫైనింగ్ మోమెంట్స్. చుట్టూ నెమళ్ళు, జంటలుగా, గుంపులుగా మాయమయ్యే జనం, మసక మసగ్గా సాయంత్రం. అదంతా ఒక ప్రతీకలా అనిపించేది. సాయంత్రమౌతుంది, వెలుగు తగ్గుతుంది, అందరూ వెళ్ళిపోయాక ఇద్దరమే మిగుల్తాం పార్కులో, జీవితంలో.

నీకు తెలిసి కొన్నిసార్లు, తెలీకుండా చాలాసార్లు నీవైపు చుస్తుంటాను. నడిచేప్పుడు నీ షూస్ వైపు చూస్తాను. షర్ట్ మీద ఏదైనా ఆకు పడితే నువ్వు దులుపుకోవడం చూస్తాను. ఆ చూసినవి ఎన్నిసార్లో గుర్తు చేసుకుంటాను. నా పేరు ఎప్పుడు పలికావు, ఎలా పలికావు, అప్పుడు నీ గొంతెలా ఉంది, కళ్లలో ఏముంది. అన్నిటినీ.

ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు నేనెక్కడున్నానో మర్చిపోతాను, మొద్దుబారిపోతాను, చుట్టూ అంతా ఒక స్టిల్ లైఫ్ పెయింటింగ్ లాగా ఐపోతుంది. నేనిక్కడెందుకున్నాను, నీ దగ్గరకి ఎప్పుడెళ్ళిపోతాను, నాకసలు ఏం పని ఇక్కడ? ఏం అర్థం కాదు.

*

నీకు సంబంధించిన అన్నిటినీ హత్తుకోవాలనిపిస్తుంది. నీ పాతజీవితం, అందులోని మనుషులు అన్నిటినీ దగ్గరగా, మరింత దగ్గరగా చూడాలని, నిన్ను గతం లోను, లోకంలోను ఇంకెక్కడా మిగల్చకుండా నాలో కలిపేసుకోవాలని, లోలోపలి తీగలు వివశత్వంతో కదిలిపోతుంటాయి. వెయ్యి కోరల జీవితం అన్ని వైపుల నుంచి మీదకొస్తున్న స్పృహ. ఇన్ని చికాకుల మధ్య కూడా  నువ్వు, నీ గొంతు, మన పొద్దుపోని కబుర్లు, దగ్గరితనం, దూరం ఇవే వాస్తవంలాగా, మిగతావన్నీ తెల్లవారుఝామున వచ్చిపోయే కలల్లాగా తోస్తాయి. అప్పటికప్పుడు ‘ఇట్లా దా’ అని దగ్గరకి పిలిచి మొహమంతా ముద్దులు పెట్టి, ‘ఇప్పుడు పో’ అని నెట్టెయ్యాలనిపిస్తుంది.

పడమటి కనుమల్లో సెల్ కవరేజ్ లేని సూర్యాస్తమయ సమయాల్లో ఒకసారి, నీలాంటి మనిషొకళ్ళు కనపడి అదేపనిగా  వెంటపడి వెళ్ళిన సంగతి అక్కడి గ్రానైట్ శిలలు ఇంకా మర్చిపోలేదు. ఉత్తరదేశపు కొండల్లో తిరుగుతున్నప్పుడు కనపడ్ద ప్రతీపపువ్వుకి ఒక తెలుగు పేరు పెట్టాలనిపించి ఏ పేరుమీదా మనకి ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఎమోషన్స్ ని రంగులుగా మార్చుకుని హోలీ ఆడుకుందామని లేతరంగులన్నిట్నీ చెరిసగం పంపకం చేసుకోడం; ఏమో, మనకు తెలియంది కాదుగా- కలలన్నీ యౌవనానివి. కాలం మాత్రమే మనుషులదని.

*

ఆ సాయంత్రం వానకి నాని నాచుపట్టిన కొండరాయి మీద అరికాళ్ళు పట్టుబిగించి నిల్చున్నాం. ఆసరాకోసం కాస్త ఎత్తులో ఉన్న చెట్టుకొమ్మని పట్టుకున్నాను. నామోచేతి మడతలో మొహం రాసుకుంటూ మగత గొంతుతో ఏదో మాట్లాడావు. ఏదో చాలా మాములుగానే “ఇంకాసేపుందామా? అనో “కొమ్మ జారుతుందేమో జాగ్రత్త” అనో. అకారణంగా కదిలిపోయింది మనసు. శరీరంలో, మేధలో, అనుభవంలో పుట్టిన శక్తంతా చిక్కబడి చిక్కబడి ఒక ప్రేమాశృవుగా దొర్లింది. అవును, కావలసింది నువ్వే. నువ్వు కావల్సే ఇన్నాళ్ళూ ఇన్నిచోట్ల తిరిగింది. గుల్లచేసిన మట్టిపొరల్లాంటి చర్మకణాల్లోంచి మొలకలెత్తుతూ ఆవేశం. మాటమాటలో మోసులెత్తుతూ కొత్తగా ఒక మార్ధవపు గొంతుక నాలోపలేనా? నాదేనా? సంధ్యలన్నీ సందర్భోచితాలే కానీ, రాత్రులన్నీ సఫల మనోరధాలేనా?

*

 

(సారంగ జనవరి 2019)