గడ్డిపోచలు- 1

పాప అన్నాళ్ళూ అది తన ఇల్లే అనుకుంది. ఆకలేస్తే మట్టికుండ మీద మూత తీసి అన్నం తినడం తప్ప ఇంకేం నేర్చుకోలేదు. పాపకి మరీ చాలా బొమ్మలేం లేవు. ఆరోజు బొమ్మలన్నీ త్వరగా నిద్రలేచాయి. ఆమెవరో వాటన్నిటినీ తుడిచి సర్దుతుంది. రోజూ మట్టికుండలో అన్నం వండిపెట్టేది ఆమే అని పాపకి తెలిసిపోయింది. ఆ బొమ్మలు కూడా ఆమెవే అని. భయమేసింది. వెళ్ళిపోనా అనడిగింది. నీ బొమ్మలు నీకిచ్చేస్తా, అన్నం కూడా వద్దు, ఇది మా ఇల్లు కాదల్లే వుంది, వెళ్ళిపోతా అంది. ఆమె ఏమన్లేదు. ఉండొచ్చమ్మా, నేనేమనను, అన్నం పెడతాను అని కూడా చెప్పింది. పాపకెందుకో ఉక్రోషం వచ్చింది. ఏదో చెప్పాలనిపించింది. ఇన్నాళ్ళూ ఎక్కడ దాక్కున్నావని, నేను పుట్టేటప్పటికి నీ వయసెంతనీ, నువ్వు నాకేమౌతావనీ, నువ్వు మంచిదానివే కానీ ఈ ఇల్లు నీదని తెలీక ఉండిపోయానని, నాకెటెళ్లాలో తెలీదు నువ్వే వెళ్ళిపో అనీ చెప్పాలనుకుంది. బొమ్మలు విసిరెయ్యాలనిపించింది. ఏడ్చి ఏడ్చి చాపమీదే నిద్రపోయింది. ఆమె మళ్ళీ తన గదిలోకి తనెళ్ళిపోయింది. అన్నం ఉడుకుతున్న వాసన మళ్ళీ ఇల్లంతా…