ఆదిమం

ఏ శ్రమా లేదు.

కార్డ్స్ ఆడినంత శ్రద్ధగా, పుస్తకం చదివినంత ఓర్పుగా, వదిలేసిపోయిన వస్తుసంచయంలోనే తిరిగొచ్చి అర్థాన్ని వెతుక్కోవడంలో, ఆహారమే ఆనందం అనిపించడంలో అబద్ధమేం లేదు.

వెలివేతలాంటి ఒంటరితనం లోనుంచి, ఉలిపికట్టెగా మిగిల్చిన ఊహాలోకపు విలువల బరువునుంచి, ముసలితనంలాంటి తెలివిడిలాంటి భయంలోనుంచి…

శుభకార్యాల, ఫ్లాష్ న్యూస్ ల, గాసిపింగ్ ల శానిటీలోకి, కళకళలాడే జనజీవనంలోకి, మృత్యువువంటి నిశ్చలమైన మాములుతనంలోకి, ఏదైతేనేం అనే సాంఘిక లొంగుబాటులోకి, మనకోసం ఇంకా ఏదో ఒక ద్వారం తెరిచి ఉండటమే మహదవకాశం అనే కృతజ్ఞత లోకి… వచ్చిపడ్డందుకు బహుశా మనవాళ్ళంతా సంతోషించవచ్చు.

—-

లివింగ్ విత్ డెత్ లాంటి నిహిలిస్టిక్ నిర్లిప్తతలోంచి, రోజుకి కొంతగానో, ఒకే క్షణంలోనే అంతాగానో అంతమౌతు, ఆరంభమౌతు నువ్వు, నేను, న్యూస్ పేపర్ లో మొహం కనపడని ఒక నేరస్థుడు, మనుషుల కోసమే బతికిన మనుషులు కొందరు, పొగడ్తలు, ప్రగల్భాలు, కాలానికి నిలబడే (!) పుస్తకాలు, అసలు కాలమంటే ఏంటనే ప్రశ్నలు, ప్రతి కుదుపుకి ఉలిక్కిపడి సర్దుకుంటూ బస్సు కిటికీలో ఈగలు.

ఉదయం, సాయంత్రం, కొండ, నది, చెక్కతలుపు మీద చెక్కబడ్డ పూలతలు, సున్నపు గోడమీద రంగుల నెమలిబొమ్మలు, అనుకరణల అలంకారాలు. కొన్ని దుఃఖాలు సహజమనీ, కొంత వేదన వ్యసనమనీ ఇవ్వబడే తీర్పులు. ఇష్టాలు, త్యాగాలు, స్వార్ధాలు, దేహాలు, అనుమానాలు, అపనమ్మకాలు- ఏదీ నిరూపించుకోబుద్ధి కాని నిర్వేద సమయాలు.

—-

దీనంతటి మధ్యలోనూ ఒక జడివాన మధ్యాహ్నం వెచ్చటి లెమన్ టీ కప్పులతో ఇద్దరు మనుషులు, ఒక బ్లాక్ అండ్ వైట్ పాటని గుర్తు చేసుకుంటూ, ఇష్టంగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ. బహుశా అదొక్క జ్ఞాపకమే కదా, వేలసార్లు సమస్త మానవ మీమాంస సమయాల్లో రీప్లే అయ్యి “పోన్లే, ఇంకొన్నాళ్ళు బతుకుదాం” అని సర్దిచెప్పేది? ఒళ్లు కూడగట్టుకుని లేచి బట్టలు మార్చుకుని బయటికెళ్లమని ప్రోత్సహించేది?

—–

P.S: The pain of enduring the unsustainability of a dreamer’s world is too real to be articulated.

Leave a comment