నచ్చటం గురించి

తను ఎవరికీ ఏమాత్రం నచ్చని మనిషిగా తయారవుతుందని ఆమెకి స్పష్టంగా అర్థమౌతూ ఉంది. నోరు తెరిచిన ప్రతిసారీ ఆమె ఏదోక అసహ్యమైన మాట అంటుంది, ఇక చుట్టుపక్కల ఉన్నవాళ్ళకి ఆమె మీద ఇష్టం తగ్గిపోతుంది. వీళ్ళు ఎవరైనా కావచ్చు- కొత్తవాళ్ళు, దగ్గరి స్నేహితులు, బంధువులు, బొత్తిగా అపరిచితులు, వాళ్ళతో స్నేహం పెరిగితే బావుందని ఆమె కోరుకునే మనుషులు కూడా కావచ్చు. అసలామె నోరు తెరవకపోయినా, చూడ్డానికి ఏదోలా కనిపించినా, “ఆ, ఊ” అని చిన్న శబ్ధం చేసినా ఎవరికీ ఎప్పుడూ నచ్చదు. దీనికి మినహాయింపుగా ఒక్కోసారి ఆమె రాబోయే నాలుగైదు క్షణాలపాటు తను తప్పకుండా నచ్చితీరాలని పట్టుపట్టిన సందర్భాల్లో (అంతకన్నా ఎక్కవసేపు అసాధ్యమని ఆమెకీ తెలుసు) ఆమె పంతం నెగ్గించుకుంది, అదైనా కొన్నిసార్లే. అసలేంటి ఈమె సమస్య? ఎందుకీమె ఎవరికీ నచ్చట్లేదు? ఆమెకే ఈ ప్రపంచం బొత్తిగా నచ్చకుండా పోయిందా? లేదా ప్రపంచమే ఆమెకి దూరం జరిగిందా? అసలు లోకంతీరే చెత్తగా మారిపోయిందా? (అదే అయ్యుంటుంది, కాకపోయి కూడా ఉండొచ్చు. ఆమెకి ఒకప్పుడు నచ్చే విషయాలన్నీ ఇప్పుడు అయిష్టంగా మారినట్టున్నాయి). అసలు ఆమెకి ఆమే నచ్చట్లేదా? (ఇది ఎప్పుడూ ఉన్నదే, కొత్తేం కాదు.) లేదంటే కేవలం వయసు పెరగడం వల్ల ఆమె ఎవరికీ ఇష్టం లేకుండా అయిపోయిందా, ఎందుకంటే నలభై ఏళ్ళ వయసుకి ఆమె ఎన్నేళ్ళుగానో చేసిన పనుల్నే మళ్ళీ మళ్ళీ చేస్తుండవచ్చు, ఇరవై ఏళ్ళ అమ్మాయి చేసే పనులు నలభై ఏళ్ళావిడ చేస్తే ఎవరికైనా ఏమాత్రం బాగుంటుంది గనక? ఆమె ఎలా ఉన్నా ఎవరికీ నచ్చదని ఆమెగ్గానీ తెలిసిపోయిందా, ఇలా ఎందుకౌతుందని గొడవ పడకుండా, చలిగాలికి ఒదిగి ముడుచుకున్నట్టు పోనీలే అని సర్దుకుపోయిందా? ఏమో (బహుశా) ఆమె కొన్నాళ్ళు ఎదురుతిరిగి ఉంటుంది, ఆ తిరుగుబాటు నిరర్ధకమని మెల్లగా గ్రహించి ఉంటుంది. ఇక పొద్దున్నే ఆమె నోరు తెరవగానే ఎవరికీ నచ్చకపోవడం ఆమెకిప్పుడు కాస్త గర్వంగా కూడా ఉందేమో. ప్రతీ రాత్రీ నిద్రపోయేముందు ఆమె అందరికీ మరింత అయిష్టురాలిగా తయారౌతుంది. రోజులన్నీ ఇలాగే గడిచిపోతున్నాయి. గంటగంటకీ అమెలో మెచ్చదగ్గ లక్షణాలు తరిగిపోతున్నాయి, చివరికి ఒకానొక ఉదయం, ఆమె ఎవరూ సహించలేనంత అసౌకర్యమైన అయిష్టతకి ప్రతిరూపంగా మారిపోతుంది, ఇక అప్పుడామెని ఒక కంతలోకి తోసేసి అక్కడే వదిలెయ్యక తప్పదు.

Source: “LIKABLE” by DEB OLIN UNFERTH#flashfiction

Leave a comment