తుఫానుకి ముందు

నేనామెని బార్ లో కలిశాను. అలా అని ఆమె అక్కడ వెయిట్రెస్ కాదు. నాలాగే తను కూడా కౌంటర్ దగ్గర తాగి తూగుతూ ఉంది. అక్కడ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చిపోయే వాళ్ళతో ఏదేదో వాగుతుంది. గాలివానలో ఊగిపోతున్న ఓడలో ఉన్నట్టు, మేము అటూ ఇటూ తూలిపోతున్నాం. ఉన్నట్టుండి ఆమె నా చెవిలో పెద్దగా ఏదో అరిచింది. ఆమె వంటి నుంచి అత్తరు, జిన్నూ కలిసిన వాసన. కాసేపటి తర్వాత ఆమెగదిలో మేమిద్దరమే ఉన్నప్పుడు, ఆమె రెండోదాన్ని చల్లుకుని మొదటిదాన్ని తాగేసిందా అనిపించింది.
అప్పటికి కాసేపటి క్రితం మా సంభాషణ ఇలా నడిచింది:
నువ్వు?
ఉండుండు. ఒక్క నిముషం.
నేను సరిగ్గా చెప్పలేనబ్బా…. . అహహ, ఫర్లేదు.
ఏయ్.. ఆగాగు.
అసలు బార్లో ఉన్నప్పుడే మేము చాలా తొందరగా కలిసిపోయాం. అప్పుడెక్కడ నిల్చున్నామో గుర్తులేదు, ఆ మాటలు, అత్తరు, జిన్నూ కలిసిన ఘాటు వాసన తప్ప. ఏదో వీధి నాటకం చూడ్దానికొచినట్టు ఊరికే అటూ ఇటూ తిరుగుతూ మాకు వీపులు చూపిస్తూ, కొందరు మాచుట్టూ తచ్చాడుతూ ఉన్నారు. ఒకతనెవరో తప్పతాగేసి కౌంటర్ పైకెక్కి స్పృహతప్పి పడిపోయాడు. అది చూసి జనాలు కాసేపు అరిచి, గోలగా రాగాలు తీశారు.
మేము తలుపులు తోసుకుని బయటికి రాగానే, ఆశ్చర్యంగా తుఫాను సూచనలేం లేవు. టాక్సీ డ్రైవర్లతో నిండిపోయిన రోడ్ల మీద ఒక్క నీటిచుక్క కూడా కనపడలేదు. అప్పుడు గుర్తొచ్చింది, ఇంకా ఇది నవంబరేగా, తుఫాను చాలా నెల్లుగా ఇటువైపు మళ్ళలేదు. అసలు సరైన గాలివానొచ్చి చాలా ఏళ్లవుతుంది. అందుకే బోర్లాపడిన కార్లు, గాలికి ఎగిరిపోయిన పైకప్పులు ఈ చుట్టుపక్కల ఏం కనపడట్లేదు. రోడ్డు మీద జనమంతా మంచి బట్టలేసుకుని ఎక్కడికో బయల్దేరినట్టున్నారు. తాగుబోతుల్లాగో, తుఫాను బాధితుల్లాగో చింపిరిగా లేరు.
కానీ, కాసేపట్లోనే ఆమె పడకగదిలో, అర్ధనగ్నమైన మా దేహాల్ని అట్నుంచి ఇటు విసిరేస్తూ తుఫాను గాలి ఊపందుకుంది. నా తలమీద ఒక అలమర విరిగి పడింది. ఆమె కాలిమడమ దేనికో గుద్దుకుంది. చుట్టూతా ఏడుపులు, పెడబొబ్బలు. నేను బూతులు తిట్టుకుంటూ నామీద పడుతున్న గోడని అరచేత్తో వెనక్కి తోశాను. ఆ గది రక్షణశిబిరంగా ఏమాత్రం పనికిరాదు. పనికిమాలిన వస్తువులు బోలెడు చెల్లాచెదురుగా చుట్టూ పడున్నాయి. కిటికీ తలుపుల సందుల్లో నెర్రెలు పడి ఖాళీలొచ్చాయి. ఆమె ఇంటి చుట్టు పక్కల వాళ్ళు దిక్కు తోచక గోడలమీద గట్టిగా బాదుతూ పైకీ కిందకీ పరిగెడుతున్నారు. ఉదయం కాస్తా మధ్యాహ్నమైంది, సాయంత్రమైంది. ఐనా తుఫాను ఇంకా గర్జిస్తూనే ఉంది.
ఈ గందరగోళం మధ్యలో కాసేపు అత్తరూ జిన్నూ వాసనల్ని తలచుకున్నాను. ఆమెని అడిగానేమో కూడా- జిన్ చల్లుకుని అత్తరు తాగేశావా? అని. బహుశా ఆమె కూడా తన కళ్ళని నాకళ్ళల్లోకి ఎక్కుపెట్టి అవునని చెప్పి ఉంటుంది. ఆమె అన్నిటికీ అవుననే అంటుంది.
అవును.
తన వొంటితీరు ఎలాంటిదంటే- ఎంత గొప్ప చిత్రకారుడైనా దాన్ని గియ్యడానికి ఒక వందసార్లు ప్రయత్నించి చేతగాక విసుగ్గా కుంచెని విసిరేస్తాడు. ఆ దేహమంతా రహస్యాలతో, జీవకళతో వెలిగిపోతూ ఉంటుంది. ఎన్నెన్ని గీతలు, వంపులు, ఎత్తు పల్లాలు! ఐనా నేనదేం ఆలోచించకుండా అప్రమత్తంగా ఉన్నాను. కాలి వేళ్ళు చేతి వేళ్ళు నిగడదన్ని మీదపడుతున్న గోడని, తప్పొప్పులు తెలీని మంచం కోళ్లనీ నిలబెడుతున్నాను.
మధ్యాహ్నపు ఎండలో, ఎండిపోయిన గొంతులతో, తుఫానుకి విరిగిపోయిన తెప్ప మీద మేం నిద్రపోయాం. రాళ్ళగుట్టొకటి నిర్జీవమైన సముద్రంలోకి మమ్మల్ని ఈడ్చుకుపోతుంది. మా తెప్ప అడుగున చేపలు, అంతులేని రాత్రిలో నిప్పు రవ్వల్లా మెరుస్తూ గుంపులుగా ఈత కొడుతున్నాయేమో తెలీదు.
ఈ మొత్తం గొడవలోకీ విచిత్రమైన సంగతి ఒకటుంది (ఇది తర్వాత నాకు మాత్రమే గుర్తుంది). మేము విడిపడ్డ కాసేపటికి గాలి ముమ్మరంగా వీచింది. అప్పుడు నా మొహానికి ఎదురుగా తన ముంజేతులు, మోకాళ్ళు మెడకి చుట్టుకుపోయి, తల నేలకి అతుక్కుపోయి , చెమటలో ముద్దయిపోయి తను చుట్టూ తాను లుంగచుట్టుకుపోయింది. మేడమెట్లమీద తనకి నచ్చజెబుతూ నేనే నిదానంగా ఒక్కో భాగాన్నీ విడదియ్యాల్సి వచ్చింది.
ఏడాది తర్వాత, ఆమె తప్పతాగి బైక్ నడుపుతూ ప్రమాదవశాత్తూ చనిపోయిందని పేపర్లో చదివాను. ఆరోజుల్లో పేపర్ వాళ్ళు రాయడానికి ఇలాంటి మారుమూల ప్రమాదాలు తప్ప పెద్ద వార్తలేం ఉండేవి కావు.
Source: “Before the storm” by Alex Sheel
Note: Planning to translate/write one flash fiction story per day for one month.
<img class="j1lvzwm4" src="data:;base64, ” width=”18″ height=”18″ />
<img class="j1lvzwm4" src="data:;base64, ” width=”18″ height=”18″ />
Rekha Jyothi, UshaJyothi Bandham and 24 others
3 comments
Like

Comment
Share

Commen

Leave a comment